ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెజార్టీ 5106 ఓట్లు.. చెల్లనివి 28,686 ఓట్లు
తీవ్ర ఉత్కంటకు గురి చేసి రోజుల తరబడి సాగిన మెదక్ - నిజామాబాద్ - ఆదిలాబాద్ - కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఎట్టకేలకు పూర్తి కావటం తెలిసిందే.
By: Tupaki Desk | 6 March 2025 11:11 AM ISTతీవ్ర ఉత్కంటకు గురి చేసి రోజుల తరబడి సాగిన మెదక్ - నిజామాబాద్ - ఆదిలాబాద్ - కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఎట్టకేలకు పూర్తి కావటం తెలిసిందే. 5106 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నారు. తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డిపై విజయం సాధించారు. దీంతో.. కాంగ్రెస్ తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. ఈ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరిక్రిష్ణ గట్టిపోటీ ఇచ్చారు. సోమవారం ఉదయం ఆరు గంటలకు మొదలైన ఓట్ల లెక్కింపు బుధవారం రాత్రి 9 గంటలకు ఒక కొలిక్కి వచ్చింది. దీంతో.. ఉత్తర తెలంగాణలో జరిగిన రెండు ఎమ్మెల్సీ స్థానాల్ని బీజేపీ సొంతం చేసుకున్నట్లైంది.
మొదటి ప్రాధాన్య ఓట్లను సొంతం చేసుకోవటంలో బీజేపీ.. కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నడిచింది. మూడో స్థానంలో నిలిచిన ప్రసన్నహరిక్రిష్ణ గట్టి పోటీని ఇవ్వటమే కాదు.. తుది ఫలితాన్ని డిసైడ్ చేశారని చెప్పాలి. రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు అనంతరం బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 98,637 ఓట్లు సాధించగా.. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి 93,531 ఓట్లు సొంతం చేసుకున్నారు. మొత్తం 3,55,159 మంది ఓటర్లు ఉన్న ఈ పట్టభద్రుల నియోజకవర్గానికి ఫిబ్రవరి 27 పోలింగ్ జరిగింది.
పోలింగ్ వేళ 2,52,029 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. అయితే.. ఓట్ల లెక్కింపు వేళ ఒక ఆసక్తికర అంశాన్ని గుర్తించారు. మొత్తం పోల్ అయిన ఓట్లలో పది శాతానికి కంటే ఎక్కువ ఓట్లు చెల్లని వైనాన్ని గుర్తించారు. చెల్లని ఓట్లు 28,686గా అధికారులు గుర్తించారు. చెల్లుబాటు అయిన 2,23,343 ఓట్లలో గెలుపు కోటాను 1,11,672గా నిర్ణయించారు. మొత్తం 11 రౌండ్ల లెక్కింపు కొనసాగగా.. మొదట్నించి బీజేపీ అభ్యర్థి అధిక్యతను ప్రదర్శించారు.
ఆరేడు.. ఎనిమిది.. తొమ్మిది రౌండ్లలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి అధిక్యతను ప్రదర్శించారు. మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి 75,675 ఓట్లతో బీజేపీ అభ్యర్థి మొదటి స్థానంలో ఉండగా.. 60,419 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి రెండో స్థానంలో బీఎస్పీ అభ్యర్థి మూడో స్థానంలో నిలిచారు. గెలుపు కోటాను చేరాలంటే రెండో ప్రాధాన్యతను లెక్కించాల్సి వచ్చింది. ఇందులో భాగంగా తక్కువ ఓట్లు పొందిన అభ్యర్థి నుంచి ఎలిమినేషన్ ప్రక్రియను చేపట్టారు. అలా మొత్తం 53 మందిని ఎలిమినేట్ చేశారు.
మూడో స్థానంలో నిలిచిన బీఎస్పీ అభ్యర్థి సాధించిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కేశారు. ప్రసన్న హరిక్రిష్ణకు వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్య ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థికి కాస్త పైచేయి సాధించినా.. మొత్తంగా బీజేపీ అభ్యర్థి అధిక్యంలో ఉండటంతో 5106 ఓట్ల అధిక్యంలో విజయం సొంతం చేసుకున్నారు. ఫలితాల్లో చేదు అనుభవంతో కాంగ్రెస్ అభ్యర్థి కంటతడి పెడుతూ ఓట్ల లెక్కింపు కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయారు. విజయం సాధించిన అంజిరెడ్డి బ్యాక్ గ్రౌండ్ చూస్తే.. రైతు కుటుంబంలో జన్మించిన ఆయన సంఘ్ పరివార్ బ్యాక్ గ్రౌండ్ ఉంది. ఏబీవీపీ విద్యార్థి నాయకుడిగా గుర్తింపు ఉంది. 1993లో ఎస్సార్ ఇండస్ట్రీని స్థాపించి సేవా కార్యక్రమాల్ని చేపట్టారు. 2009 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. 2014లో పటాన్ చెర్వు నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడారు. తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ తరఫు పోటీ చేసిన ఆయన.. బీజేపీ ఎమ్మెల్సీగా మండలిలో అడుగు పెట్టనున్నారు.