వీరే బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు
తెలంగాణలో త్వరలో జరిగే ఉపాధ్యాయ.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల్ని ఫైనల్ చేసింది తెలంగాణ బీజేపీ.
By: Tupaki Desk | 11 Jan 2025 5:06 AM GMTతెలంగాణలో త్వరలో జరిగే ఉపాధ్యాయ.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల్ని ఫైనల్ చేసింది తెలంగాణ బీజేపీ. నల్గొండ - వరంగల్ - ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి.. కరీంనగర్ - నిజామాబాద్ - అదిలాబాద్ - మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంతో పాటు.. కరీంనగర్ - ఆదిలాబాద్ - మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. మిగిలిన ఎన్నికలకు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ వ్యూహం మిగిలిన పార్టీలకు భిన్నంగా ఉంటుందన్న సంగతి తెలిసిందే.
అసెంబ్లీలో ఎమ్మెల్యేల బలం అంతంతమాత్రంగా ఉన్నప్పటికి.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి సైతం చెమటలు పట్టించేలా కమలనాథుల ప్లానింగ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. తాజాగా జరిగే రెండు ఉపాధ్యాయ.. ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు తాజాగా అభ్యర్థుల్ని డిక్లర్ చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఇంతకూ ఈ మూడు ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల వివరాల్లోకి వెళితే..
- నల్గొండ - వరంగల్ - ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగాపులి సరోత్తంరెడ్డి
- కరీంనగర్ - నిజామాబాద్ - అదిలాబాద్ - మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కొమురయ్య
- కరీంనగర్ - ఆదిలాబాద్ - మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా సి.అంజిరెడ్డి
అభ్యర్థుల బ్యాక్ గ్రౌండ్ విషయానికి వస్తే.. సరోత్తంరెడ్డి సొంతూరు వరంగల్ కాగా.. 21 ఏళ్ల పాటు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా.. పదేళ్ల పాటు హెడ్మాస్టర్ గా పని చేశారు. 2012 - 2019 వరకు పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. ఈ సమయంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై గళం విప్పి పోరాడిన చరిత్ర ఉంది. ఇక.. కొమురయ్య విషయానికి వస్తే.. ఆయన సొంతూరు పెద్దపల్లి కాగా.. ఉస్మానియా వర్సిటీ నుంచి బీఈ పూర్తి చేవారు. పెద్దపల్లి.. నిర్మల్.. హైదరాబాద్ లలో స్కూళ్లు ఏర్పాటు చేశారు. మూడో అభ్యర్థి అంజిరెడ్డి విషయానికి వస్తే ఆయన సొంతూరు మెదక్ జిల్లా రామచంద్రాపురం. ఆయనకు భిన్న రంగాల్లో వ్యాపారవేత్తగా అనుభవం ఉంది. ట్రస్టు ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాల్ని నిర్వహించే ఆయన సతీమణి గోదావరి సైతం సంగారెడ్డిబీజేపీ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. ఎంపికలో జాగ్రత్తలు తీసుకున్న బీజేపీకి ఎలాంటి ఫలితాలు వస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.