తెలంగాణాలో బీఆర్ఎస్ కోరుకుంటున్నది అదేనా ?
అందులో పదేళ్ళ పాటు అధికారాన్ని కూడా అనుభవించింది. ఇక 2000 నుంచి చూస్తే ఈ రోజు వరకూ బీఆర్ఎస్ అక్కడ ఉద్యమంలోనూ రాజకీయాల్లోనూ బలంగా ఉంది.
By: Tupaki Desk | 9 March 2025 6:00 PM ISTతెలంగాణా అస్తిత్వమే సెంటిమెంట్. తెలంగాణా నినాదమే ఈ రోజుకు జనం గుండెల్లో బలంగా ఉంది. ఇపుడు తెలంగాణావాదులే పాలన చేస్తున్నారు. ఇబ్బందులు ఉండొచ్చు కానీ మా వాళ్ళు పాలిస్తున్నారు అన్న సంతృప్తి అయితే జనాలలో ఉంది. అలా తెలంగాణా వాదాన్ని రాజేసి బీఆర్ఎస్ పాతికేళ్ళ తన రాజకీయ ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది.
అందులో పదేళ్ళ పాటు అధికారాన్ని కూడా అనుభవించింది. ఇక 2000 నుంచి చూస్తే ఈ రోజు వరకూ బీఆర్ఎస్ అక్కడ ఉద్యమంలోనూ రాజకీయాల్లోనూ బలంగా ఉంది. బీఆర్ఎస్ ని పక్కన పెట్టి మాట్లాడేందుకు వీలు లేని పరిస్థితి ఉంది. ఈ రోజున బీఆర్ఎస్ ఓటమి పాలు కావచ్చు కానీ అది నివురు గప్పిన నిప్పులా లోపల వేడి అలాగే ఉంది.
ఏ సందర్భంలోనైనా తెలంగాణా వాదాన్ని ప్రజ్వరిల్లచేసి దానితో మళ్ళీ అధికారం అందుకోవచ్చు అన్నదే బీఆర్ఎస్ ఆలోచన. ఇక తెలంగాణా రాజకీయ క్షేత్రంలో చూసుకుంటే ప్రధానంగా మూడు పార్టీలు బలంగా ఉన్నాయి. అధికార కాంగ్రెస్ విపక్ష బీఆర్ఎస్, అలాగే విపక్షంలో రెండవ ప్లేస్ లో ఉన్న బీజేపీ. ఈ నేపథ్యం నుంచి చూసినపుడు ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కాషాయం పార్టీ రెండు సీట్లు గెలిచి సత్తా చాటింది.
దాంతో బీజేపీలో ఎక్కడ లేని ధీమా కనిపిస్తోంది. ఈసారి తాము తప్పకుండా అధికారంలోకి వస్తామని అంటోంది. అయితే ఉత్తర తెలంగాణాలో బీజేపీకి బలం ఉంది. కానీ మొత్తం తెలంగాణా అంతటా లేదు. ముఖ్యంగా దక్షిణ తెలంగాణాలో బీఆర్ఎస్ కి పట్టుంది. అలాగే కాంగ్రెస్ కి రూరల్ బెల్ట్ లో గట్టి పట్టు ఉంది. ఈ క్రమంలో బీజేపీ ఈ కూడా తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే బీజేపీ దీని కోసం ఎన్డీయే కూటమిని తెలంగాణాలోనూ కట్టాలని చూస్తోంది అని వార్తలు వస్తున్నాయి.
అంటే ఏపీలో మాదిరిగా టీడీపీ, జనసేనలను కలుపుకుని ముందుకు వెళ్ళాలని చూస్తోందని అంటున్నారు. అంటే ఈ మూడు పార్టీలూ కలిస్తే బలంగా నిలిచి తెలంగాణాలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ ని గద్దె దించవచ్చు అన్న ఆలోచన అన్న మాట. ఏపీలో సక్సెస్ అయిన ఎన్డీయే కూటమి ఫార్ములా తెలంగాణాలోనూ వర్కౌట్ అవుతుందని కమలనాధులు నమ్ముతున్నారు.
పైపెచ్చు చంద్రబాబు రాజకీయ వ్యూహాలు పవన్ కళ్యాణ్ గ్లామర్ కలసి ఎన్డీయే కూటమిని అక్కడ పవర్ లోకి తెస్తాయని లెక్క వేస్తోంది. ఇవన్నీ ఇలా ఉంటే ఈ పొత్తులు కుదిరి తెలంగాణాలో తెలుగుదేశంతో బీజేపీ చేతులు కలిపితే అది రాజకీయంగా కమలానికి ఎంతవరకూ ప్లస్ అవుతుంది అన్న చర్చ కూడా ఉంది.
ఎందుకంటే 2018లో కాంగ్రెస్ టీడీపీ పొత్తు పెట్టుకున్నాయి. అయితే అప్పట్లో కేసీఆర్ ఆంధ్రా వాళ్ళ పెత్తనం అంటూ ఊరూ వాడా తిరిగి మరీ కాంగ్రెస్ అవకాశాల మీద చావు దెబ్బ కొట్టారు. ఆ విధంగా సెంటిమెంట్ పండి రెండోసారి బీఆర్ ఎస్ అధికారంలోకి వచ్చింది. మరి ఇపుడు బీజేపీ టీడీపీ చేతులు కలిపితే కేసీఆర్ కానీ బీఆర్ఎస్ నేతలు కానీ చూస్తూ ఊరుకుంటారా అన్నదే చర్చగా ఉంది.
ఇప్పటికే గోదావరి క్రిష్ణా నీళ్ళు దోచుకునిపోతున్నారు అని ప్రచారం చేస్తూ వచ్చిన వారు అక్కడ టీడీపీ బీజేపీ దోస్తీని జనంలో పెట్టి మరీ సెంటిమెంట్ ని బయటకు తీస్తారు అని అంటున్నారు. ఇక బీజేపీ కూటమి కట్టి అధికారం కోసం దూకుడు చేస్తే హిందూ ఓట్ల పోలరైజేషన్ సంగతేమో కానీ మైనారిటీ ఓట్లు పోలరైజ్ అవుతాయి. అవి కాంగ్రెస్ ని దించాలనుకుంటే మరో బలమైన పార్టీగా బీఆర్ఎస్ వైపు మళ్ళె చాన్స్ ఉంటుంది అని అంటున్నారు.
అంటే బీజేపీ కనుక తెలంగాణాలో ఎన్డీయే స్థాపనకు నడుం బిగిస్తే మాత్రం గులాబీ పార్టీకి రాజకీయంగా ప్రాణం లేచివచ్చినట్లే అని అంటున్నారు. అయితే ఈ ప్రచారంలో ఎంత నిజం ఉందో తెలియదు. బీజేపీ సొంతంగా ఎదుగుతోంది. కొంత అనుకూల వాతావరణం ఉంది. ఈ నేపధ్యంలో టీడీపీతో దోస్తీకి తెర తీస్తుందా దానికి స్థానిక బీజేపీ నేతలు అంగీకరిస్తారా అన్నది కూడా చర్చగా ఉంది.