సికింద్రాబాద్ బంద్.. దుకాణాలకు తాళం!
తెలంగాణలోని జంట నగరాల్లో ఒకటైన సికింద్రాబాద్‌కు తాళం పడింది! అన్ని వ్యాపారాలు, వ్యవహారాలు నిలిచిపోయాయి.
By: Tupaki Desk | 19 Oct 2024 9:46 AM GMTతెలంగాణలోని జంట నగరాల్లో ఒకటైన సికింద్రాబాద్‌కు తాళం పడింది! అన్ని వ్యాపారాలు, వ్యవహారాలు నిలిచిపోయాయి. ఆర్టీసీ బస్సులను కూడా నిలిపివేశారు. ప్రైవేటు వాహనాలు మాత్రం ఒకటి అరా తీరుగుతున్నాయి. హిందూ సంఘాలు.. ముఖ్యంగా బీజేపీ నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు.. ఈ బంద్ పాటిస్తుండడం గమనార్హం. నిత్యం ఎంతో రద్దీగా ఉండే.. అల్ఫా హోటల్, హైదరాబాద్ బిర్యానీకి ప్రసిద్ధమైన ప్యారడైజ్ హోటల్ కూడా మూత బడ్డాయి.
కారణం ఏంటి?
ఇటీవల నాలుగు రోజుల కిందట సికింద్రాబాద్ లోని రైల్వే స్టేషన్‌కు కూత వేటు దూరంలో ఉన్న పురాత న ముత్యాలమ్మ ఆలయంలో విధ్వంసం జరిగిన విషయం తెలిసిందే. ఆలయంలోని అమ్మవారి విగ్రహా న్ని దుండగులు ధ్వంసం చేశారు. అదేవిధంగా ఆలయం గేట్లను కూడా కూల్చి వేసే ప్రయత్నం చేశారు. అప్పట్లోనే ఈ వ్యవహారం రాజకీయంగా కూడా ఉద్రిక్తతలకు దారితీసింది. కేంద్ర మంత్రి, బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి స్వయంగా పర్యటించారు. ఓ వర్గంపై ఆయన ఆరోపణలు కూడా చేశారు.
దీనిని సీరియస్‌గా తీసుకోవాలని, నిందితులను శిక్షించాలని కూడా కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. అయితే.. ఎవరూ పెద్దగా స్పందించలేదు. సర్కారు అసలు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు, హిందూ సంఘాల పిలుపు మేరకు శనివారంఇక్కడ బంద్ పాటిస్తున్నారు. ఈ బంద్ నేపథ్యంలో అన్ని వ్యాపార వర్గాలు తమ కార్యకలాపాలను నిలిపివేశాయి. ఇక, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు మాత్రం పనిచేస్తున్నా.. అక్కడ భారీ భద్రత కల్పించారు.
మరోవైపు.. శనివారం సాయంత్రం.. నిరసనలో భాగంగా ధ్వంసమైన ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహంతో ఊరేగింపు నిర్వహిస్తామని బీజేపీ నాయకులు చెప్పారు. అయితే.. ఈ ఊరేగింపునకు పోలీసులు ఇప్పటి వరకు అనుమతి ఇవ్వలేదు. దీనివల్ల ఉద్రిక్తతలకు అవకాశం ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న బంద్ ప్రశాంతంగా సాగుతుండడం గమనార్హం.