Begin typing your search above and press return to search.

ఒక్క ట్వీట్ తో ఉత్తమ్ ను లాగిన బీజేపీ !

తెలంగాణలో పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ పదవిని బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఇవ్వడంతో వివాదం మొదలయింది.

By:  Tupaki Desk   |   15 Sep 2024 3:30 PM GMT
ఒక్క ట్వీట్ తో ఉత్తమ్ ను లాగిన బీజేపీ !
X

తెలంగాణలో పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ పదవిని బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఇవ్వడంతో వివాదం మొదలయింది. ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన పదవిని అధికారపార్టీలో చేరిన వారికి ఎలా ఇస్తారు ? అన్నది బీఆర్ఎస్ పార్టీ వాదన. ఒకవైపు పార్టీ ఫిరాయింపుల మీద నాలుగు వారాలలో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు తీర్పు ఇచ్చిన రోజే పీఏసీ చైర్మన్ ఎంపికను ప్రకటించడం బీఆర్ఎస్ పుండు మీద కారం చల్లిన చందంగా మారింది.

ఈ నేపథ్యంలో తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని, కాంగ్రెస్ పార్టీలో చేరలేదని అరికెపూడి గాంధీ చేసిన ప్రకటన నేపథ్యంలో మరి పార్టీ మారకుంటే రేపు మీ ఇంటికి వస్తాను. పార్టీ కండువా కప్పుతాను. ఇద్దరం కలిసి మీ ఇంటి మీద బీఆర్ఎస్ జెండా ఎగిరేద్దాం అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో రాజకీయం హీటెక్కింది.

పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో అరికెపూడి ఇంటికి వెళ్లకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అరికెపూడి తన అనుచరులతో కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లడం, కాంగ్రెస్ కార్యకర్తలు కౌశిక్ ఇంటి మీద దాడి చేయడంతో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. కౌశిక్ రెడ్డికి మద్దతుగా బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి తదితరులు వెళ్లారు.

అక్కడి నుండి సీపీ కార్యాలయానికి చేరుకుని దాడి చేసిన వారి మీద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో వారిని అరెస్ట్ చేసి మహబూబ్ నగర్ జిల్లాకు తీసుకెళ్లడం, వేలాది మంది బీఆర్ఎస్ శ్రేణులు కేశంపేట పోలీస్ స్టేషన్ ముట్టడించడంతో అర్ధరాత్రి వారిని వదిలివేయడం జరిగింది.

పోలీసుల విధులకు ఆంటకం కలిగించాడని కౌశిక్ రెడ్డి మీద, హత్యాయత్నం చేశారని అరికెపూడి గాంధీ, ఆయన అనుచరులు 40 మంది మీద కేసులు నమోదయ్యాయి. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో ఎక్కడా స్పందించని బీజేపీ పార్టీ ఎక్స్ వేదికగా వేసిన ఒక ట్వీట్ తో రాష్ట్ర మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డిని వివాదంలోకి లాగింది.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కు బంధువు అయిన నేపథ్యంలో ఆయన వెనక ఈయన ఉన్నారన్నది బీజేపీ వాదన. తెలంగాణలో 8 ఎంపీ, 8 ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకున్న బీజేపీ లోక్ సభ ఎన్నికల తర్వాత చల్లబడిపోయింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో విభేదాలు సృష్టించే ప్రయత్నంలో భాగంగానే ఈ ట్వీట్ చేసి ఉంటారన్న వాదన రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. దీనిపై కాంగ్రెస్, ఉత్తమ్ ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.