Begin typing your search above and press return to search.

ఏమిటీ జేపీసీ.. అదేం చేస్తుంది? ఎలా పని చేస్తుంది?

జేపీసీ.. జాయింట్ పార్లమెంట్ కమిటీ. అచ్చ తెలుగులో చెప్పాలంటే సంయుక్త పార్లమెంటరీ సంఘం. ఈ కమిటీని కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వేస్తారు.

By:  Tupaki Desk   |   19 Dec 2024 5:08 AM GMT
ఏమిటీ జేపీసీ.. అదేం చేస్తుంది? ఎలా పని చేస్తుంది?
X

జేపీసీ.. జాయింట్ పార్లమెంట్ కమిటీ. అచ్చ తెలుగులో చెప్పాలంటే సంయుక్త పార్లమెంటరీ సంఘం. ఈ కమిటీని కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వేస్తారు. ఏదైనా కీలక బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెట్టినప్పుడు కానీ.. ఏదైనా భారీ కుంభకోణం జరిగిందన్న ఆరోపణల వేళ.. ఈ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఇందులో అధికార.. విపక్షాలకు చెందిన ఎంపీలు ఉంటారు. గరిష్ఠంగా 31 మంది సభ్యుల్ని నియమించే వీలు ఉంటుంది. కమిటీ ఛైర్మన్ గా అధికార పార్టీకి చెందిన ఎంపీ ఉంటారు. ఒకే సందర్భంలో కానీ వేర్వేరు సందర్భాల్లో కానీ ఎన్ని కావాలంటే అన్ని జేపీసీలు వేయొచ్చు. వీటికి ఎలాంటి పరిమితులు లేవు.

దేశంలో మొదటి జేపీసీని బోఫోర్స్ కుంభకోణం వేళ ఏర్పాటు చేశారు. 1987లో కాంగ్రెస్ నేత బి. శంకరానంద దానికి అధ్యక్షత వహించారు. నాటి రక్షణ మంత్రి కేసీ పంత్ లోక్ సభలో తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. వారం తర్వాత రాజ్యసభలో దాన్ని ఆమోదించారు. యాభై సార్లు సమావేశమైన ఈ కమిటీ 1988 ఏప్రిల్ 26న తుది నివేదిక ఇచ్చారు. అయితే ఆ కమిటీలో కాంగ్రెస్ సభ్యులు ఎక్కువగా ఉన్నారని విమర్శ పెద్ద ఎత్తున వచ్చింది. కమిటీని అప్పటి విపక్షాలు వ్యతిరేకించాయి. చివరకు రిపోర్టును సైతం రిజెక్టు చేశాయి.

కుంభకోణాలతో పాటు.. వివాదాస్పద బిల్లులు.. విపక్షాలకు ఆమోదం లేని బిల్లులపై జేపీసీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తుంటారు. దీనికి అనుగుణంగా అధికారపక్షాలు జేపీసీలను ఏర్పాటు చేస్తుంటాయి. తాజాగా జమిలి ఎన్నికల విషయంలోనూ జేపీసీనీ ఏర్పాటు చేస్తూ మోడీ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఏదైనా ప్రత్యేక అంశం లేదంటే బిల్లులను పరిశీలించేందుకు పార్లమెంటు చేత ఏర్పాటు చేసే కమిటీగా దీన్ని చెప్పొచ్చు. ఈ కమిటీ సదరు అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించటంతో పాటు.. దర్యాప్తుచేస్తుంది. కమిటీ సభ్యులను పార్లమెంట్ నిర్ణయిస్తుంది. ఇందులో అధికార.. ప్రతిపక్ష సభ్యులు ఉంటారు.

చాలా సందర్బాల్లో రెండు సభల సభ్యులు సమానంగా ఉంటారు. మరికొన్ని సందర్భాల్లో మాత్రం రాజ్యసభ సభ్యుల కంటే రెండు రెట్లు ఎక్కువ మంది లోక్ సభ సభ్యులు ఉంటారు. ఉదాహరణకు జేపీసీలో 15 మంది సభ్యులు ఉంటే.. అందులో లోక్ సభ నుంచి 10 మంది..రాజ్యసభ నుంచి ఐదుగురు సభ్యులు ఉంటారు. వీరు విచారించే అంశానికి సంబంధించిన నిపుణులు.. ప్రజాప్రతినిధులు.. సంఘాలు.. వ్యక్తులు..పార్టీల నుంచి ఆధారాల్ని సేకరిస్తారు. ఎవరైనా విచారణకు రాకున్నా.. సహకరించకున్నా దాన్ని సభా ధిక్కారంగా పరిగణిస్తారు. ఏదైనా స్కాంకు సంబంధించి అయితే.. ఆ విషయాలన్నీ గుట్టుగా జరుగుతాయి. జేపీసీ ఛైర్మన్ కమిటీ సాగించిన చర్చల వివరాల్ని మీడియాకు వెల్లడిస్తారు.

కమిటీ కావాలనుకుంటే రాజకీయ నేతలు.. ప్రజాప్రతినిధులు.. మాజీ జడ్జిలు.. లాయర్లు.. ఇతర రాజ్యాంగ నిపుణులతో పాటు.. పలువురితో విస్త్రతంగా సంప్రదింపులు జరిపే వీలు ఉంటుంది. జమిలి ఎన్నికల బిల్లు విషయానికి వస్తే.. ఈ బిల్లు చట్టంగా మారితే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది కాబట్టి.. అందుకు అనుగుణంగా ఎన్నికల కమిషన్ మాజీ సభ్యలను సైతం సంప్రదించి అభిప్రాయాలు తీసుకుంటారు. అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లను సైతం సంప్రదించే వీలుంది. కావాలనుకుంటే సాధారణ ప్రజల నుంచి కూడా అభిప్రాయాలు తీసుకోవచ్చు. అంతా అయ్యాక తాము సేకరించిన సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించి.. క్లాజుల వారీగా లోక్ సభకు నివేదిక రూపంలో సమర్పిస్తారు.

సాధారణంగా మంత్రులను జేపీసీ పిలవదు. ఒకవేళ.. అలా పిలవాల్సి వస్తే.. స్పీకర్ అనుమతి తీసుకొని విచారించే వీలుంది. కొన్ని సందర్భాల్లో జేపీసీ అడిగిన సమాచారాన్ని ప్రభుత్వం ఇవ్వటానికి నో చెప్పొచ్చు. అలాంటి వేళలో స్పీకర్ జోక్యం చేసుకొని ఆయన సమ్మతి తెలిపితే తప్పనిసరిగా సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. జేపీసీ ఏర్పాటుకు సంబంధించి మరో ఆసక్తికర అంశం ఉంటుంది. లోక్ సభ.. రాజ్యసభ రెండింటిలో ఏదో ఒక చోటు దీనికి సంబంధించిన తీర్మానం చేయాలి. మరో సభ దాన్ని బలపర్చాల్సి ఉంటుంది. మరో పద్దతిలో లోక్ సభ స్పీకర్.. రాజ్యసభ ఛైర్మన్ లు ఇద్దరు సంప్రదింపులు జరిపి ఏకాభిప్రాయంతోనూ జేపీసీని ఏర్పాటు చేసే వీలుంది. ఇక.. కమిటీ కార్యకలాపాలు గోప్యంగా ఉంచే వీలుంది.

ఇక.. జేపీసీ చేసిన సిపార్సుల్ని అమలు చేయాలని ఒత్తిడి తేలేరు. వాటిని అమలు చేయాలా? లేదా? అన్నది ప్రభుత్వానికి ఉన్న పూర్తి విచక్షణతో ఉంటుంది. జేపీసీ చేసిన సిఫార్సులకు ప్రతిస్పందించటం.. తీసుకున్న చర్యల గురించి నివేదించటం ప్రభుత్వం బాధ్యత. ప్రభుత్వ సమాధానం ఆధారంగా కమిటీ పార్లమెంటులో చర్య తీసుకున్న నివేదికల్ని సమర్పిస్తుంది. కమిటీ సూచించిన సిఫార్సుల్ని ప్రభుత్వ ప్రతి స్పందనలు పార్లమెంటులో చర్చిస్తారు. జేపీసీకి నిర్దిష్ట కాలపరిమితి అంటూ లేదు. సాధారణంగా 90 రోజుల్లో నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. కావాలంటే.. దాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంటారు. కమిటీ తన విధిని పూర్తి చేసిన తర్వాత రద్దు చేస్తారు.