12 రోజుల తర్వాత ఢిల్లీకి కొత్త సీఎం.. అవకాశం ఎవరికో?
ఢిల్లీ చిన్న రాష్ట్రం. అక్కడ ఉన్నదీ 70 సీట్లే. మహారాష్ట్ర వంటి అతిపెద్ద రాష్ట్రంలోనే.. పోటీ అధికంగా ఉన్నచోటనే కొద్ది రోజుల్లో ముఖ్యమంత్రి ఎవరో తేల్చేసింది బీజేపీ.
By: Tupaki Desk | 17 Feb 2025 9:57 AM GMTఫిబ్రవరి 8న ఫలితాలు వెలువడిన ఢిల్లీలో ఇప్పటికీ సీఎం ఎవరో తేలలేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. తమ పరిధిలోని ప్రాంతానికి సీఎంను ఎంపిక చేయడంలో జాప్యం చేస్తోంది. 27 ఏళ్ల తర్వాత దేశ రాజధానిలో గెలిచిన బీజేపీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 12 రోజుల సమయం తీసుకుంటోంది.
ఇంత ఆలస్యమా..
ఢిల్లీ చిన్న రాష్ట్రం. అక్కడ ఉన్నదీ 70 సీట్లే. మహారాష్ట్ర వంటి అతిపెద్ద రాష్ట్రంలోనే.. పోటీ అధికంగా ఉన్నచోటనే కొద్ది రోజుల్లో ముఖ్యమంత్రి ఎవరో తేల్చేసింది బీజేపీ. ఢిల్లీలో మాత్రం 12 రోజుల సమయం తీసుకుంటోంది. కాగా, గురువారం కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం ఉంది. ముందుగా బుధవారం బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ప్రమాణం.. ప్రఖ్యాత రాంలీలా మైదానంలోనే జరిగే అవకాశం ఉంది.
వాస్తవానికి సోమవారమే ఢిల్లీ బీజేపీ శాసనసభాపక్ష సమావేశం తలపెట్టారు. కానీ, అంతలోనే వాయిదా వేశారు. కొన్ని రోజులుగా ఢిల్లీ సీఎం పదవికి ఉన్నత స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. పర్వేష్ వర్మ, ఆశిష్ సూద్, రేఖా గుప్తా సహా పలువురి పేర్లపై ఊహాగానాలు వస్తున్నాయి. ప్రధాని మోదీ అమెరికా నుంచి తిరిగి వచ్చేవరకు సమయం తీసుకున్నారు.
సీఎం రేసులో పర్వేష్ వర్మ ముందంజలో ఉన్నా.. జాతీయ నాయకులతో సన్నిహిత సంబంధాలున్న ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శి, జనక్ పురి ఎమ్మెల్యే ఆశిష్ సూద్ పేరు కూడా వినిపిస్తోంది. మహిళా నేతల్లో షాలిమార్ బాగ్ ఎమ్మెల్యే రేఖా గుప్తా పేరునూ పరిశీలిస్తున్నారు. అత్యంత సీనియర్ నాయకుడు, ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోహిణి ఎమ్మెల్యే విజేందర్ గుప్తా, మాలవీయనగర్ ఎమ్మెల్యే సతీష్ ఉపాధ్యాయ, ఆర్ఎస్ఎస్ మద్దతు బలంగా ఉన్న జితేంద్ర మహాజన్, గ్రేటర్ కైలాష్ నుంచి గెలిచిన శిఖా రాయ్ ను కూడా పరిగణిస్తున్నారు.
మహిళ లేదా పూర్తిగా కొత్త వ్యక్తిని సీఎంగా ఎంపిక చేసే చాన్స్ ఉందని సూచనప్రాయంగా చెబుతున్నారు. మంత్రి పదవులకు 15 మంది ఎమ్మెల్యే పేర్లను షార్ట్ లిస్ట్ చేసినట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. కొత్త ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి ఉండే అవకాశం లేదట.