ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణం...కొద్ది రోజులు ఆగాల్సిందే !
ఇక ఢిల్లీ బీజేపీ సీఎం ప్రమాణ స్వీకారానికి బీజేపీ సహా ఎన్డీయే ముఖ్యమంత్రులు అంతా హాజరవుతారని చెబుతున్నారు.
By: Tupaki Desk | 9 Feb 2025 12:30 PM GMTఢిల్లీలో బీజేపీ విజయం చారిత్రాత్మకం అన్నది పక్కన పెడితే దాదాపుగా మూడు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు దక్కిన ఫలితం అని చెప్పాలి. ఇది మిగిలిన రాజకీయ పార్టీలకు స్పూర్తిని ఇచ్చే విజయంగా చూడాలి. ఎందుకంటే ఒకసారి ఓడితేనే పార్టీలను క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయే రాజకీయం సాగుతున్న రోజులు ఇవి. కానీ బీజేపీ అలా కాదు తన గెలుపు కోసం వరసబెట్టి ఏడు ఎన్నికల్లో పోరాడింది. అలా ఏడవసారి విజయం అన్న పిలుపు విన్నది.
మరి బీజేపీ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయంటే దాని వెనక అర్ధం ఎంతో ఉంది కదా. ఇదిలా ఉంటే ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ఎవరూ అన్న ప్రశ్న వెంటనే వస్తోంది. ఆప్ సీఎం గా ఉన్న అతిషీ ఆదివారం తన రాజీనామాను లెఫ్టినెంట్ గవర్నర్ కి అందించారు. కొత్త ప్రభుత్వానికి దారి చూపించారు. అయితే బీజేపీ మాత్రం వెంటనే ప్రమాణం చేయడానికి సిద్ధంగా లేదు.
బీజేపీకి చెందిన 48 మంది ఎమ్మెల్యేలూ కలసి ఒక సమావేశం నిర్వహించడం విజయోత్సాహాన్ని పంచుకోవడం మాత్రమే ప్రస్తుతం జరుగుతుంది. కొత్త సీఎం ఎంపిక ప్రమాణం అన్నవి కొద్ది రోజుల తరువాతనే అని అంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం నుంచి వారం రోజుల పాటు విదేశీ పర్యటన చేయనున్నారు. అందులో భాగంగా ఆయన ఈ నెల 13న అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ కానున్నారు.
అలా మోడీ విదేశీ పర్యటన హడావుడి ఉంది. అందుకే బీజేపీ కొత్త సీఎం అభ్యర్ధి పేరుని నిర్ణయించలేదని అంటున్నారు. ఇదిలా ఉంటే బీజేపీ ఫస్ట్ ఛాయిస్ గా పర్వేష్ వర్మ లైన్ లో అగ్రభాగాన ఉన్నారు. ఆయనకు 2024 లోక్ సభ ఎన్నికల్లో టికెట్ ని నిరాకరించి మరీ వ్యూహాత్మకంగా బరిలోకి దింపినపుడే ఈ హామీ దక్కిందని చెబుతున్నారు. పైగా ఆయన అరవింద్ కేజ్రీవాల్ ని ఓడించి జెయింట్ కిల్లర్ అయ్యారు. మాజీ సీఎం సాహెబ్ సింగ్ వర్మ తనయుడు. బలమైన సామాజిక వర్గం. ఇలా చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి. కేంద్ర పెద్దల మద్దతు కూడా ఉంది.
మరి ఆయన పేరు ప్రకటించకుండా ఎందుకు ఆలస్యం అంటే ఒకరిద్దరు కాదు ఏకంగా ఏడుగురు ఢిల్లీ సీఎం రేసులో ఉన్నారుట. పర్వేష్ వర్మ తరువాత వినిపించే పేరు మనీష్ తివారీ. ఈయన ఢిల్లీ బీజేపీకి 2016 నుంచి 2020 దాకా బాధ్యతలు నిర్వహించారు. ఈయన వరసగా మూడు సార్లు ఎంపీగా ఈశాన్య ఢిల్లీ నుంచి గెలిచారు. పూర్వాంచల్ ప్రజలలో ఈయనకు మంచి ఆదరణ ఉంది. బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుంటే ఈయనకు చాన్స్ అని అంటున్నారు.
అదే విధంగా మంజీందర్ సింగ్ సిర్సా పేరు వినిపిస్తోంది. ఈయన అకాళీదళ్ నుంచి బీజేపీలోకి వచ్చిన వారు. ఈయన కూడా అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఉన్నారు. ఢిల్లీలో సిక్కు సమాజాన్ని ప్రభావితం చేసే లీడర్ గా గుర్తింపు ఉంది. ఆయనకు సీఎం చాన్స్ ఇస్గ్తే పంజాబ్ లో బీజేపీకి బలంగా మారుతారు అన్న చర్చ ఉంది.
ఇక కేంద్ర మంత్రిగా పనిచేసి గత ఎన్నికలో అమేధీ నుంచి ఓటమి పాలు అయిన స్మృతి ఇరానీ పేరు కూడా పరిశీలనలో ఉంది అంటున్నారు. ఆమె బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలిగా గతంలో పనిచేశారు. బీజేపీలో చూస్తే ఎక్కడా మహిళా సీఎం అన్నవారు లేరు. దాంతో స్మృతికి ఈ కోటాలో చాన్స్ దక్కుతుందా అన్న చర్చ నడుసోంది.
అలాగే మరో పేరు విజయేందర్ గుప్తా. ఆయన ఢిల్లీలోని రోహిణి అసెంబ్లీ సీటు నుంచి వరసగా మూడు సార్లు గెలిచి ఉన్నారు. అంతే కాదు రెండు సార్లు బీజేపీ తరఫున ప్రతిపక్ష నేతగా పనిచేశారు. 2015లో బీజేపీకి ముగ్గురు ఎమ్మెల్యేలే ఉంటే అందులో కూడా గెలిచిన వారు విజయేందర్ గుప్తా . ఆయన సీఎం పోస్టుకు రేసులో ఉన్నారని అంటున్నారు. అలాగే మోహన్ సింగ్ బిఫ్త్ నాలుగు సార్లు అసెంబ్లీకి గెలిచి ఉన్నారు. అందువల్ల ఆయన సీనియరిటీతో సీఎం పోస్టు అడుగుతున్నారు. వీరేంద్ర సచిదేవా అన్న మరో సీనియర్ నేత కూడా సీఎం పదవిని ఆశిస్తున్నారు.
ఇలా చూస్తే లిస్ట్ చాలా పెద్దది ఉంది. అందుకే అందరికీ ఆమోదయోగ్యమైన వారు పేరుని ఎంపిక చేయడానికి కూడా కొంత సమయం తీసుకుంటున్నారు. ఇక ఢిల్లీ బీజేపీ సీఎం ప్రమాణ స్వీకారానికి బీజేపీ సహా ఎన్డీయే ముఖ్యమంత్రులు అంతా హాజరవుతారని చెబుతున్నారు. బ్రహ్మాండంగా ఈ ప్రమాణం జరపాలని నిర్ణయించినందువల్లనే కొద్ది రోజులు ఆగాల్సి ఉందని చెబుతున్నారు.