సౌత్ వర్సెస్ నార్త్.. బీజేపీ పాలిటిక్స్!
మరీ ముఖ్యంగా.. డీ లిమిటేషన్ ప్రక్రియ బీజేపీకి కలిసి వస్తోంది. 2004 తర్వాత.. తొలిసారి మళ్లీ ఇప్పుడే డీలిమి టేషన్ ప్రక్రియ ప్రారంభమవుతోంది
By: Tupaki Desk | 19 March 2025 12:00 AM ISTదేశంలో బీజేపీ రాజకీయ క్రీడకు తెరదీసింది. త్వరలోనే జమిలి ఎన్నికల బిల్లును ఆమోదించేందుకు రెడీ అయిన కేంద్ర ప్రభుత్వం.. దీనిని అమలు చేసే విషయంలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మరీ ముఖ్యంగా.. డీ లిమిటేషన్ ప్రక్రియ బీజేపీకి కలిసి వస్తోంది. 2004 తర్వాత.. తొలిసారి మళ్లీ ఇప్పుడే డీలిమి టేషన్ ప్రక్రియ ప్రారంభమవుతోంది. అయితే.. జన గణన చేపట్టకుండానే ఈ ప్రక్రియను ప్రారంభించడం వివాదానికి దారి తీస్తోంది.
ఇదేసమయంలో ఉత్తరాది రాష్ట్రాలైన యూపీ, బిహార్ వంటి పెద్ద రాష్ట్రాల్లో జనాభా నియంత్రణపై స్పష్టత లేదు. దీంతో అక్కడ జనాభా విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఇటు దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ గట్టిగా చేపట్టారు. వివిధ సంక్షేమ పథకాలను జనాభా నియంత్రణకు ముడిపెట్టి.. అమలు చేశారు. దీంతో జనాభా గణనీయంగా తగ్గిపోయింది. ఇప్పుడు ఈ పరిణామం దక్షిణాది రాష్ట్రాలకు ప్రాణ సంకటంగా మారగా.. ఉత్తరాదిరాష్ట్రాలకు పార్లమెంటు సీట్లు పెరిగేందుకు దోహద పడింది.
వాస్తవానికి జనాభా ప్రాతిపదికన పార్లమెంటు స్థానాలను పెంచాలని అనుకుంటే.. 2021లో జరగాల్సిన జనగణను ఇప్పటి వరకు చేపట్టలేదు. అప్పట్లో కరోనా నేపథ్యంలో వాయిదా వేసిన కేంద్రం.. ఇప్పటి దాకా ఆ ఊసు ఎత్తలేదు. ఇక, ఇప్పుడు.. జన గణనకు ముందే పార్లమెంటు స్థానాల పెంపు, తగ్గింపు అంశం చర్చకు వచ్చింది. ఇదే.. ఇప్పుడు సౌత్ వర్సెస్ నార్త్‌గా తీవ్ర దుమారం రేపుతోంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసింది.
అయితే.. దీనికి బీజేపీ, బీఆర్ ఎస్ నాయకులు డుమ్మా కొట్టారు. మరోవైపు ఈ నెల 22న తమిళనాడు ప్రభుత్వం కూడా డీలిమిటేషన్‌పై అంతర్రాష్ట్ర సమావేశం ఏర్పాటు చేసింది. అయితే.. ఇది కూడా అంత తేలికగా తేలే వ్యవహారం కాదు. మొత్తంగా దక్షిణాదిలో సీట్లు ఇప్పుడు ఉన్నవి తగ్గకపోయినా.. ఉత్తరాదిలో భారీ గా పెరుగుతుండడమే బీజేపీకి కలిసి వస్తున్న అంశం. ప్రస్తుతం ఉత్తరాదిపై పట్టు సాధించిన బీజేపీ.. దక్షిణాదిలో మాత్రం కొంత బలహీనంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఉత్తరాదిపై దక్షిణాది రాష్ట్రాలు దుమారం రేపుతున్నాయి. ఇది ఎప్పటికి తేలుతుందో చూడాలి.