కూటమిలో కమలం సలసల...ఎందుకలా ?
తెలుగుదేశం పార్టీ కూటమిలో ఉన్నవి మూడు పార్టీలు. రెండు ప్రాంతీయ పార్టీలు అయితే ఒకటి జాతీయ పార్టీ.
By: Tupaki Desk | 7 April 2025 7:30 AMతెలుగుదేశం పార్టీ కూటమిలో ఉన్నవి మూడు పార్టీలు. రెండు ప్రాంతీయ పార్టీలు అయితే ఒకటి జాతీయ పార్టీ. తెలుగుదేశం బలమైన ప్రాంతీయ పార్టీ. కూటమికి సారథ్యం వహిస్తున్న పెద్దన్నగా ఉంది. ఆ తరువాత ఏపీలో ఎదుగుతున్న పార్టీగా జనసేన ఉంది. మూడవది జాతీయంగా బలంగా ఉండి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ. అయితే ఏపీలో మాత్రం ఆ పార్టీకి పెద్దగా ఉనికి లేదు.
అయితే కూటమిలో తమను చిన్న చూపు చూస్తున్నారని ఏపీ కమలనాధులు అసంతృప్తిలో ఉన్నారుట. తమను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారుట. మరీ ముఖ్యంగా నామినేటెడ్ పదవుల పంపిణీలో బీజేపీకి అన్యాయం జరుగుతోందని వాపోతున్నారుట. ఇప్పటికి రెండు విడతలుగా మార్కెటింగ్ కమిటీ చైర్మన్ల జాబితా ప్రకటించారు. ఒదటి విడతలో 47 మార్కెటింగ్ కమిటీలకు చైర్మన్ పదవులు ప్రకటిస్తే అందులో బీజేపీకి దక్కింది రెండు పోస్టులు. తాజాగా మరో 38 మందితో లిస్ట్ రిలీజ్ చేస్తే అందులో దక్కింది ఒక్కటి. ఇలా టోటల్ మూడంటే మూడు ఇచ్చి మూలన కూర్చోబెట్టారు అని తెగ ఫీల్ అవుతున్నారుట.
ఇపుడు మరో లిస్ట్ ప్రిపేర్ అవుతోందని ఈ లిస్టులో అయితే తమకు సున్నా ఇచ్చి షాక్ ఇస్తారా అని కూడా అనుకుంటున్నారుట. మార్కెటింగ్ కమిటీలకు చాలా ప్రాధాన్యత ఉంటుందని తమ నాయకులకు ఎక్కడో ఒక చోట అవకాశం ఇవ్వవచ్చునని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. అయితే ఎక్కువ పదవులు టీడీపీ తీసుకున్నా జనసేన కంటే తీసికట్టుగా తమకు పోస్టులు ఇస్తున్నారని మండుతున్నారుట.
పార్టీలో ఎంతో మంది దశాబ్దాలుగా పనిచేస్తూ వస్తున్నారని వారందరి లిస్ట్ ఇచ్చామని కానీ మూడు పోస్టులు ఇస్తే ఎలా అని అంటున్నారు. ఏపీలో కూటమి గెలవడానికి బీజేపీ కృషి చాలా ఉందని చెబుతున్నారు. నిజానికి కూటమిలో బీజేపీ కలిశాకనే గెలుపు కళ వచ్చిందని కూడా అంటున్నారుట. ఇలా మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పదవులలో తమకు దెబ్బేశారని బీజేపీ నేతలు అంటున్నారు. పదవుల కోసం పార్టీలో తమ వెంటపడుతున్న వారికి ఏ విధంగా జవాబు చెప్పుకోవాలని కూడా అంటున్నారుట.
రేపో మాపో ఆలయ పాలక మండళ్ళ జాబితాను కూడా రిలీజ్ చేస్తారని అందులో కూడా తమ ప్లేస్ నంబర్ ఎక్కడో వెతుక్కోవాల్సిందేనా అని అంటున్నారు. నామినేటెడ్ పదవులు అంటే ఆ రెండు పార్టీలేనా మేము కనిపించమా అని కమలం నేతలు కస్సుబుస్సులాడు తున్నారు ఈ మధ్యనే బీజేపీ మంత్రి సత్య కుమార్ యాదవ్ అయితే ఏపీలో కూటమి గెలుపు వెనక బీజేపీ ప్రభావం కూడా చాలా ఉందని చెప్పారు.
మెల్లగా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. అయితే కూటమి లెక్కలు ఎలా ఉన్నాయీ అంటే కేంద్రంలో బీజేపీకి అవసరం అయిన బలాన్ని తమ ఎంపీలు ఇచ్చి ప్రభుత్వం కొనసాగడంలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారని. ఇక ఏపీలో చూస్తే ఉన్నంతలో న్యాయం చేస్తున్నాం కదా అని అంటున్నారు. బీజేపీకి ఎమ్మెల్సీ ఇచ్చారు, మంత్రి పదవి ఇచ్చారు, ఒక ఎంపీ ఇచ్చారు. ఇలా న్యాయం జరుగుతోంది అన్నది కూటమి వైపు నుంచి వాదనగా ఉంది. చూడాలి మరి ఎవరి వాదనలో బలముందో.