Begin typing your search above and press return to search.

రాజ్యసభకు చిరంజీవి? నాగబాబుకు మళ్లీ నిరాశేనా?

ఏపీ రాజకీయాల్లో బీజేపీ కీ రోల్ అవుతోంది. పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కొన్ని రాజకీయ నిర్ణయాలను ప్రభావితం చేస్తోంది.

By:  Tupaki Desk   |   6 Feb 2025 12:30 PM GMT
రాజ్యసభకు చిరంజీవి? నాగబాబుకు మళ్లీ నిరాశేనా?
X

ఏపీ రాజకీయాల్లో బీజేపీ కీ రోల్ అవుతోంది. పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కొన్ని రాజకీయ నిర్ణయాలను ప్రభావితం చేస్తోంది. ప్రస్తుతం కూటమి భాగస్వామిగా ఉన్న బీజేపీ.. మరో మిత్రపక్షం జనసేనతో చిరకాలంగా స్నేహ సంబంధాలు కొనసాగిస్తోంది. ప్రస్తుతం టీడీపీతో పొత్తుకు కూడా జనసేన అధినేతే పవన్ కల్యాణ్ కారణం కావడం తెలిసిందే. అయితే తాజాగా ఏపీ రాజకీయాల్లో ఓ కీలక పరిణామానికి బీజేపీ ప్రయత్నిస్తోందని చెబుతున్నారు. దీనిప్రకారం జనసేనాని పవన్ కల్యాణ్ సోదరుడు, మెగాస్టార్ చిరంజీవిని రాజ్యసభకు నామినేట్ చేయాలని చూస్తున్నారని సమాచారం.

తెలుగు రాష్ట్రాలతోపాటు దక్షిణాదిలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ఇమేజ్, ఆయన గ్లామర్ భవిష్యత్తులో బీజేపీ ఎదుగుదలకు ఉపయోగించుకోవాలని కమలనాథులు ప్లాన్ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన చిరంజీవి.. ఇప్పటికీ కాంగ్రెస్ లో ఉన్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతుంటారు. అయితే ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినా చిరంజీవి మాత్రం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూనే వస్తున్నారు. ఇదే సమయంలో ప్రధాని మోదీతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. గతంలో ఏపీలో అల్లూరి సీతారామరాజు శత జయంతి ఉత్సవాలు, ఆ తర్వాత కూటమి ప్రభుత్వ ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రధానితో చిరంజీవి వేదిక పంచుకున్నారు. ఇక ఇటీవల ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంట్లో జరిగిన సంక్రాంతి సంబరాలకు ప్రత్యేక అతిథిగా వెళ్లిన చిరంజీవితో ప్రధాని మోదీ ఆత్మీయంగా వ్యవహరించడం వైరల్ అయింది.

ప్రధాని మోదీతోపాటు బీజేపీ పెద్దలతో చిరంజీవికి సాన్నిహిత్యం పెరగడం, ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో జనాకర్షణ ఉన్న నేత కోసం ఎదురుచూస్తున్న బీజేపీ.. చిరంజీవి ద్వారా ఆ లోటు పూడ్చుకోవాలని చూస్తోందని అంటున్నారు. చిరంజీవి తమతో ఉంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కాషాయ పార్టీ బలపడే అవకాశాలు ఉన్నాయని అంచనాతో చిరంజీవికి కేంద్రంలో సముచిత స్థానం కల్పించాలని భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా ఏపీ నుంచి రాజ్యసభకు నామినేట్ చేయాలని ప్రతిపాదిస్తోంది. అయితే జనసేన లేదంటే బీజేపీ అభ్యర్థిగా చిరంజీవిని పరిగణించాలని కోరుతున్నారట..

ప్రస్తుతం ఏపీలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సివుంది. ఈ స్థానం నుంచి చిరంజీవి సోదరుడు, జనసేన ప్రధాన కార్యదర్శ నాగబాబును పోటీకి పెట్టాలని సీఎం చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు. నాగబాబును మంత్రిని చేస్తానని గతంలో చంద్రబాబు ప్రకటించారు. అయితే ఆయన సేవలను ఎక్కువగా కూటమి సమన్వయానికి వాడుకోవాలని భావిస్తుండటం వల్ల రాజ్యసభకు పంపి కూటమి సమన్వయ సారథిగా నియమించాలని చంద్రబాబు ప్రతిపాదిస్తున్నారు. అయితే ఢిల్లీ పెద్దలు మాత్రం ఈ సారి నాగబాబును పక్కన పెట్టి ఆయన అన్న మెగాస్టార్ చిరంజీవిని రాజ్యసభకు పంపాలని కోరుతున్నారని తెలుస్తోంది.

ప్రస్తుతం రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్న చిరంజీవి.. సినిమాల్లో బిజీగా ఉన్నారు. అయితే కమలం పెద్దల ప్రతిపాదనపై ఆయన ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదని అంటున్నారు. తన సోదరుడు ఆశపడుతున్న స్థానాన్ని తాను తీసుకోవడం సరికాదనే ఆలోచనలో చిరంజీవి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల అవసరాల మేరకు ఆయన నిర్ణయం ఉండే అవకాశం ఉందంటున్నారు. ఏదిఏమైనా కూటమి ద్వారా పావులు కదుపుతున్న బీజేపీ.. తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని స్థానానికి చేరుకోవడం కోసం బిగ్ స్కెచ్ వేసిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.