బీజేపీ బండి లాగేది ఆయనేనా ?
తెలంగాణాలో 2024 ఎన్నికల్లో ఎనిమిది ఎంపీలను గెలుచుకున్న బీజేపీ ఈసారి ఎన్నికలు అంటూ వస్తే మరింతగా బలపడాలని లెక్కలు వేసుకుంటోంది.
By: Tupaki Desk | 30 Oct 2024 4:14 AM GMTబీజేపీ తెలంగాణా మీద ఫోకస్ పెడుతోంది. జమిలి ఎన్నికల నేపథ్యంలో దక్షిణాదిన తెలంగాణా మీదనే బీజేపీ ఆశలు అధికంగా ఉన్నాయి. ఏపీలో జనసేన టీడీపీతో బంధం పటిష్టంగా ఉంది. దాంతో ఏ ఢోకా లేదు. తెలంగాణాలో 2024 ఎన్నికల్లో ఎనిమిది ఎంపీలను గెలుచుకున్న బీజేపీ ఈసారి ఎన్నికలు అంటూ వస్తే మరింతగా బలపడాలని లెక్కలు వేసుకుంటోంది.
ఇక తెలంగాణా బీజేపీ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రిగా జి కిషన్ రెడ్డి ఉన్నారు. ఆయన ప్రస్తుతం రెండు బాధ్యతలను మోస్తున్నారు. దాంతో ఆయన ప్లేస్ లో కొత్తవారిని ఎంపిక చేయాలని బీజేపీ చూస్తోంది. అయితే ఆ కొత్త వారు ఎవరు అన్నదే చర్చగా ముందుకు వస్తోంది.
కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ కి మరో మారు పార్టీ పగ్గాలు అప్పగించాలని కూడా టాక్ నడుస్తోందిట. ఆయన హయాంలో పార్టీ గ్రౌండ్ లెవెల్ దాకా వెళ్ళిందని పక్కా మాస్ లీడర్ గా బండి కమలం పార్టీకి దూకుడు పెట్టించాడు అని అంటున్నారు.
బండిని గత ఏడాది ఆ పదవి నుంచి తప్పించారు. ఇపుడు చూస్తే ఒక వైపు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి దూకుడు ఉంది మరో వైపు చూస్తే బీఆర్ఎస్ కూడా జూలు విదిలిస్తోంది. ఈ రెండు పార్టీలను తట్టుకుని రాజకీయ క్షేత్రంలో నిలబడాలీ అంటే కచ్చితంగా పూర్తి స్థాయిలో పార్టీని పట్టించుకోవాల్సి ఉంది అని అంటున్నారు.
దాంతో పాటు ఢీ అంటే ఢీ కొట్టే నాయకత్వం అవసరం అని కూడా అంటున్నారు. ఆ విధంగా చూసుకుంటే బండికే ప్రయారిటీ ఇస్తారు అని అంటున్నారు. అదే సమయంలో ఎంపీగా ఉన్న ఈటెల రాజేందర్ కి కూడా పగ్గాలు దక్కవచ్చు అని అంటున్నారు. ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వనిది అందుకే అని కూడా చెబుతున్నారు.
ఈటెల కూడా తన ఈటెల లాంటి విమర్శల్తో ప్రత్యర్ధులకు హడల్ పుట్టిస్తారు అని అంటున్నారు. అయితే ఈటెలను కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకుని బండికే పార్టీ బాధ్యతలు అప్పగించే చాన్స్ ఎక్కువగా ఉంది అని అంటున్నారు. ఇక కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉంటూ రాష్ట్ర పార్టీ విషయంలో అనుకున్న విధంగా స్పందించడం లేదని అంటున్నారు.
తొందరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయని అలాగే జీహెచ్ఎంసీ ఎన్నికల మీద కూడా బీజేపీ కన్ను ఉందని అంటున్నారు. గతసారి అధికంగా కార్పోరేటర్లను గెలుచుకుని బీజేపీ మేయర్ పీఠానికి చేరువగా వచ్చింది. ఈసారి మరింతగా దూకుడు చేస్తే అనుకున్నది నెరవేరుతుంది అన్న ఆశ ఉంది. మొత్తానికి తొందరలోనే తెలంగాణాకు కొత్త అధ్యక్షుడు వస్తారని అంటున్నారు. అది బండి నా లేకా ఈటెలనా అన్నది చూడాల్సి ఉంది.