Begin typing your search above and press return to search.

మండలిలోనూ బీజేపీ గళం.. బలం.. తెలంగాణ రాజకీయాల్లో మార్పు

అప్పటికి ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే కాషాయ పార్టీ ఏదో సంచలనం రేపబోతోందనే అంచనాలు ఏర్పడ్డాయి.

By:  Tupaki Desk   |   4 March 2025 7:03 PM IST
మండలిలోనూ బీజేపీ గళం.. బలం.. తెలంగాణ రాజకీయాల్లో మార్పు
X

ఇదిగో మాదే అధికారం అంటే 2023 నాటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ తెగ హడావుడి చేసింది. అప్పటికి ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే కాషాయ పార్టీ ఏదో సంచలనం రేపబోతోందనే అంచనాలు ఏర్పడ్డాయి. కానీ, ఎన్నికలకు ఐదు నెలల ముందు రాష్ట్ర అధ్యక్షిడిని మార్చింది. ఎన్నడూ లేనంతగా 8 సీట్లను గెలుచుకుంది. 15పైగా స్థానాల్లో రెండోస్థానంలో నిలిచింది.

ఉమ్మడి ఏపీలోనూ బీజేపీకి అసెంబ్లీలో రానన్ని సీట్లు తెలంగాణలో 2023 ఎన్నికల్లో వచ్చాయి. దీంతోనే ఆ పార్టీ గళం గట్టిగా వినిపించే అవకాశం కలిగింది.

ఇక ఎంపీ సీట్ల గురించి చెప్పేదేముంది..? 2014 నుంచి ఆ పార్టీ బలపడుతోంది. గత ఏడాది రికార్డు స్థాయిలో 8 ఎంపీ సీట్లను నెగ్గింది. అయితే, తెలంగాణ నుంచి లోక్ సభలో, అసెంబ్లీలో మంచి ప్రాతినిధ్యమే ఉన్నప్పటికీ తెలంగాణ శాసన మండలిలో మాత్రం ఇప్పటివరకు బీజేపీకి చోటు లేదు. తాజాగా జరిగిన గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలతో ఆ లోటు తీరింది.

ఉమ్మడి కరీంనగర్-మెదక్-ఆదిలాబాద్-నిజామాబాద్ నియోజకవర్గ టీచర్ ఎమ్మెల్సీగా విద్యావేత్త మల్క కొమరయ్య గెలుపుతో మండలిలో బీజేపీకి చోటు దక్కింది.

తాజాగా వెలువడుతున్న ఫలితాల ప్రకారం ఈ ప్రాంత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థిదే పైచేయిగా ఉంది. రెండో రౌండ్ ఫలితాలు వెలువడ్డాక చూస్తే బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 14,690 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 13,198 ఓట్లు, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరిక్రిష్ణకు 10,746 ఓట్లు పోలయ్యాయి.

బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 1492 ఓట్ల ముందంజలో ఉన్నారు. పరిస్థితులు చూస్తూ ఉంటే ఈ సీటు కూడా బీజేపీ ఖాతాలోకే చేరే అవకాశం కనిపిస్తోంది. అంటే ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు శాసన మండలిలో బీజేపీకి ఇద్దరు సభ్యులు రాబోతున్నారన్నమాట.