Begin typing your search above and press return to search.

కోలుకున్న కమలం... జమిలికి సిద్ధమయ్యే ఫలితం!!

మోడీ మూడోసారి ప్రధాని అయిన తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి గుడ్ న్యూస్ చెప్పే ఫలితాలే వచ్చాయని భావించాలి.

By:  Tupaki Desk   |   8 Oct 2024 6:45 PM GMT
కోలుకున్న కమలం... జమిలికి సిద్ధమయ్యే ఫలితం!!
X

మోడీ మూడోసారి ప్రధాని అయిన తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి గుడ్ న్యూస్ చెప్పే ఫలితాలే వచ్చాయని భావించాలి. ఇందులో భాగంగా అటు హర్యానాలో హ్యాట్రిక్ విజయం దక్కగా.. జమ్మూకశ్మీర్ లోనూ గతం కంటే మెరుగైన ఫలితాలే దక్కాయి. ఈ సమయంలో జమిలీ ఎన్నికల అంశం తెరపైకి బలంగా చర్చకు వస్తోంది.

అవును... ఈ ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో, చెప్పుకున్న స్థాయిలో బీజేపీ రాణించలేదు! నితీష్ కుమార్, చంద్రబాబుల మద్ధతులో కేంద్రంలో మోడీ 3.0 సర్కార్ నడుస్తుంది. అయితే తాజా హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కచ్చితంగా బీజేపీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయనే చెప్పాలి.

ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పాలన ఉండటంతో.. తాజాగా హరియాణాను కోల్పోతే ఆ ప్రభావం కచితంగా మిగిలిన వాటిపైనా పడే అవకాశం ఉందనే విశ్లేషణలు తెరపైకి వచ్చాయి. అయితే.. తాజాగా దక్కిన హరియాణా విజయంతో బీజేపీ బలం మరింత పెరిగింది.. ఈ తాజా విజయంతో బీజేపీ ఖాతాలో 13వ రాష్ట్రం వచ్చి చేరింది!

మరోవైపు విజయం దక్కకపోయినా జమ్మూకశ్మీర్ లోనూ బీజేపీ బలమైన శక్తిగానే ఆవిర్భవించింది. గతంలో 25 సీట్లకే పరిమితమైన ఈ పార్టీ ఈసారి 29 స్థానాలను తన ఖాతాలో వేసుకోగలిగింది. ఈ సమయంలో... జమిలీ ఎన్నికలకు వెళ్లేందుకు ఈ తాజా ఫలితాలు, నెంబర్లు భారతీయ జనతాపార్టీకి ఊతమివ్వనున్నాయనే చర్చ మొదలైంది.

వాస్తవానికి జమిలీ ఎన్నికల విషయంలో బీజేపీ ఉత్సాహం ప్రదర్శిస్తుందనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మాజీ రాష్ట్రపతి రాం నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీని నియమించడం.. ఆ కమిటీ జమిలీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఇటీవల తమ నివేదికను రాష్ట్రపతికి అందజేయడం కూడా జరిగిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం హర్యానాలో హ్యాట్రిక్ విజయం.. మోడీ 3.0 ఏర్పడిన తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం.. జమ్మూకశ్మీర్ లోనూ ఉన్నంతంలో మంచి ఫలితాలు సాధించడంతో వీలైనంత త్వరలో జమిలీ ఎన్నికల కార్యచరణ దిశగా బీజేపీ అడుగులు వేసినా ఆశ్చర్యం లేదని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

పైగా ప్రస్తుతానికి జేడీయు నితీష్ కుమార్, టీడీపీ చంద్రబాబుల సహకారంతో అధికారంలో కొనసాగుతున్న బీజేపీ.. గడిగడిగండం నూరేళ్ల ఆయుష్షు అనే పరిస్థితిలో ఉందనే విశ్లేషణలు తెరపైకి వస్తున్న వేళ.. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి చేరుకోవాలని బీజేపీ బలంగా భావిస్తుందని అంటున్నారు.

ఈ నేపథ్యంలో జమిలీ ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనకు హరియాణా ఎన్నికల ఫలితం, జమ్మూకశ్మీర్ లో పెరిగిన సీట్లు బలం కలిగించే అవకాశాలున్నాయని అంటున్నారు పరిశీలకులు. ఈ నేపథ్యంలో... బీజేపీ అధిష్టాణం ఎలాంటి ఆలోచనలు చేస్తోందనేది ఆసక్తిగా మారింది.