జమిలికి బ్రేకులు వేస్తున్న ఎన్డీయేలో రెండు పార్టీలు ?
జమిలి ఎన్నికల విషయంలో ఎంత ఉత్సాహంగా బీజేపీ ఉందో అంతలా బ్రేకులు పడే పరిస్థితి ఉంది.
By: Tupaki Desk | 16 Dec 2024 4:02 AM GMTజమిలి ఎన్నికల విషయంలో ఎంత ఉత్సాహంగా బీజేపీ ఉందో అంతలా బ్రేకులు పడే పరిస్థితి ఉంది. నిజానికి నరేంద్ర మోడీ 2014లో మొదటి సారి ప్రధాని అయిన నాటి నుంచి బీజేపీ నోట జమిలి మాట వినిపిస్తూనే ఉంది. అది కాస్తా 2019లో అనుకున్నారు. ఇపుడు 2024 వచ్చేసింది. ఇక తధ్యమని గట్టిగా వినిపిస్తున్న వేళ మరోసారి జమిలి ఎన్నికల మీద అయోమయం ఏర్పడింది.
జమిలి ఎన్నికలకు సంబంధించి బిల్లులను లోక్ సభలో ప్రవేశపెట్టే విషయంలో ఏకంగా పునరాలోచనలో కేంద్రం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. నిజానికి లోక్ సభలో ప్రవేశపెట్టబోయే బిల్లుల విషయంలో లిస్ట్ లో ఉంచారు కానీ చివరిని అవి కనిపించలేదు. ఈ నెల 16న ఈ బిల్లులను లోక్ సభ ముందుకు రావాల్సి ఉంది. మరి 20తో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగుస్తున్నాయి. దాంతో ఈ సెషన్ లో జమిలి బిల్లులు ఉండవన్నది తేలిపోతోంది.
మరి దానికి కారణం ఏమిటి అన్నదే చర్చగా ఉంది. జమిలి ఎన్నికలు పెట్టాలీ అంటే పార్లమెంట్ పదవీకాలంలో మార్పు కోసం అధికరణం 83ని, అసెంబ్లీల పదవీ కాలం సవరణ కోసం అధికరణం 172ని ఎన్నికల నిబంధలన రూపకల్పన కోసం 327ని పూర్తిగా సవరించాల్సి ఉంటుంది.
ఇలా కొంచెం క్లిష్టమైన విషయంగానే ఈ బిల్లుల ఆమోదం ప్రక్రియ ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడితే ఎండీయే ప్రభుత్వం మూడవసారి అనేక పార్టీలను కలుపుకుని ఏర్పాటైంది. బీజేపీకి పూర్తి మెజారిటీ లేదు. ఏపీలో టీడీపీ బీహార్ నుంచి నితీష్ కుమార్ నాయకత్వంలోని జేడీయూల మద్దతుతోనే ఈ ప్రభుత్వం సాగుతోంది.
ఈ నేపధ్యంలో పూర్వం మాదిరిగా బీజేపీ దూకుడు అయితే చేయడానికి వీలు లేని పరిస్థితి ఉంది అని అంటున్నారు. ఈ జమిలి బిల్లుల విషయంలో కూడా అదే జరుగుతోంది అని అంటున్నారు ఎన్డీయేలో రెండు కీలక పార్టీలు జమిలి బిల్లులను అడ్డుకుంటున్నాయని అంటున్నారు. ఆ పార్టీలకు జమిలి ఎన్నికలు నిర్వహించడం అంతగా ఇష్టం లేదని అంటున్నారు. ఆ పార్టీలు సుముఖంగా లేకపోవడంతోనే జమిలి ఎన్నికల బిల్లుని ఈ శీతాకాల సమావేశాలలో చివరి నిముషంలో ప్రవేశపెట్టకుండా వెనక్కి తీసుకున్నారు అన్న ప్రచారం అయితే సాగుతోంది.
ఇంతకీ ఆ రెండు పార్టీలు ఏమిటి అన్నదే చర్చగా ఉంది. జమిలి ఎన్నికలు ఎందుకు అవి వ్యతిరేకిస్తున్నాయని కూడా ప్రశ్నలు వస్తున్నాయి. మరో వైపు చూస్తే విపక్షాల నుంచి కొన్ని పార్టీలు జమిలి ఎన్నికలకు సుముఖంగా ముందుకు రావడం విశేషం. బీఎస్పీ అధినేత్రి మాయావతి జమిలి ఎన్నికలకు పూర్తి మద్దతు ప్రకటించారు. అయితే బీజేపీ మరింత పూర్తి కసరత్తుతో 2025 బడ్జెట్ సమావేశాలలో జమిలి బిల్లులను ప్రవేశపెడుతుందని కూడా అంటున్నారు.