Begin typing your search above and press return to search.

కమలంలో కలహం : గెలవకుండానే సీఎం కోసం సిగపట్లు

ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అని ఒక ముతక సామెత ఉంది. అలా ఉంది హర్యానా బీజేపీ నేతల తీరు.

By:  Tupaki Desk   |   16 Sep 2024 6:30 AM GMT
కమలంలో కలహం : గెలవకుండానే సీఎం కోసం సిగపట్లు
X

ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అని ఒక ముతక సామెత ఉంది. అలా ఉంది హర్యానా బీజేపీ నేతల తీరు. ఇప్పటికి రెండు సార్లు బీజేపీని పవర్ లో కూర్చోబెట్టిన హర్యానా ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారు అని సర్వేలు చెబుతున్నాయి. అది లోక్ సభ ఎన్నికల్లోనే కనిపించింది.

ఇపుడు మరింతగా బలపడుతోంది. పైగా పొలిటికల్ గా వివిధ సెక్షన్లు అన్నీ పోలరైజ్ అవుతున్నాయి. కాంగ్రెస్ వైపుగా అవి ర్యాలీ అవుతున్నాయి. రైతులు జాట్లు, రెజ్లర్లు యువత మహిళ ఇలా వివిధ వర్గాల ప్రజానీకం అయితే హర్యానాలో విలక్షణమైన తీర్పు ఇవ్వాలని అనుకుంటోంది.

దాంతో కమలనాధులకు కలవరం రేగుతోంది.మ్యాజిక్ ఫిగర్ అయిన 46 నంబర్ ని ఎలా చేరుకోవాలా అని పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. హర్యానాలో ఎన్నికల ప్రచారాన్ని మొదలెట్టిన మోడీ అయితే కాంగ్రెస్ కి ఓటేయవద్దు అని కోరారు అంటే సీన్ ఏంటో పెద్దలకు కాస్తా అర్థం అయింది అని అంటున్నారు.

ఈ విషయం ఇలా ఉంటే హర్యానా సీఎం సీటు తనకు కావాలని మాజీ మంత్రి బీజేపీ సీనియర్ నేత ఒకరు పట్టు బడుతున్నారు. తనకే బీజేపీలో అన్ని వర్గాల నుంచి మద్దతు ఉందని కూడా ఆయన చెప్పుకుంటున్నారు. తాను ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను అని మంత్రిగా కూడా చేసాను అని ఆయన క్లెయిం చేసుకుంటున్నారు. తాను మంత్రి పదవికి అర్హుడిని కాదా అని కూడా ప్రశ్నిస్తున్నారు.

ఇంతకీ ఆయన ఎవరంటే బీజేపీ సీనియర్ నేత అనిల్ విజ్. ఈ నాయకుడు ముఖ్యమంత్రి సీటుకే గురి పెట్టేశారు. ఒక వైపు గెలుపు కోసం బీజేపీ నానా పాట్లూ పడుతూ ఉంటే సీఎం సీటు నాదే సుమా అని ఆయన ముందర కాళ్ళకు బంధం వేస్తున్నాడు.

నిజానికి బీజేపీ ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రస్తుత సీఎం అయిన నవాబ్ సింగ్ సైనీని ప్రకటించింది. ఆయన కాబోయే సీఎం హోదాలోనే హామీలు ఇస్తూ ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఆయననే గెలిపించాలని బీజేపీ పెద్దలు కూడా కోరుతున్నారు. మరి సందట్లో సడెమియా అన్నట్లుగా అనిల్ విజ్ సీన్ లోకి రావడం పట్ల చర్చ అయితే సాగుతోంది. ఇది కమల దళానికి అపశకునంగా తోస్తోంది అని అంటున్నారు. నిజానికి ఈ కల్చర్ కాంగ్రెస్ ది అని అంటున్నారు. బీజేపీలో ఎవరి పేరు హై కమాండ్ చెబితే వారే సీఎం గా ఉంటారు.

కానీ ఇపుడు బిగ్ ట్విస్ట్ అన్నట్లుగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకుంటూ అనిల్ విజ్ సీఎం నేనే అంటున్నారు. దీని వల్ల బీజేపీ అవకాశాలు మరింత బలహీనం అవుతాయని ఆ పార్టీ పెద్దలు కంగారు పడుతున్నారు. అయితే ఇవేమీ పట్టని అనిల్ విజ్ మాత్రం తాను ఇప్పటిదాకా పార్టీ నుంచి ఏమీ ఆశించలేదని అన్నారు. తాను సీనియర్ నేత కాబట్టే ఈసారి పార్టీ గెలిస్తే సీఎం కావాలని అనుకుంటున్నానని మనసులో మాటను మీడియా ముఖంగా చెప్పేశారు. నా కోసం ప్రజలతో పాటు పార్టీ నేతలు కూడా రాష్ట్రం నలుమూలల నుంచి కలవడానికి వస్తున్నారు అంటే అది తన పట్ల ఉన్న ఆదరణగా చెప్పుకున్నారు.

తాను ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదని ప్రజలే అడుగుతున్నారని కూడా ఆయన ఫిట్టింగ్ పెట్టారు. అలా ప్రజల డిమాండ్ మేరకు తాను ఈసారి సీఎం కావాలని అనుకుంటున్నాను అని తేల్చేశారు. ఈ విషయాన్ని అధినాయకత్వం కూడా పరిశీలించి తనకు చాన్స్ ఇస్తే కనుక హర్యానా ముఖ చిత్రాన్నే మార్చేస్తాను అని అనిల్ విజ్ చెబుతున్నారు.

మరి ఆయన కోరిక బీజేపీ పెద్దలు తీరుస్తారా ఒకవేళ ఆయన పేరు చెబితే ప్రస్తుత సీఎం ఊరుకుంటారా అలా చెప్పకపోతే అనిల్ విజ్ ఏమి చేస్తారు అన్నదే హర్యానా పాలిటిక్స్ లో కొత్త ట్విస్ట్. పార్టీ అంతా ఏకతాటిగా పనిచేయాల్సిన వేళ ఇలా సీఎం సీటు కోసం పోటీ పడితే అసలే గెలుపు అంచనాల మీద ఉన్న కాంగ్రెస్ కి బంగారు పళ్ళెం లో అధికారం అప్పగించడం ఒక్కటే తక్కువ అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.