మోడీ వర్సెస్ దీదీ.. కొరుకుడు పడట్లేదుగా!!
వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
By: Tupaki Desk | 23 Nov 2024 9:58 AM GMTప్రధాన మంత్రి నరేంద్ర మోడీ-పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉరఫ్ దీదీల మధ్య రాజకీ య సెగల విషయం తెలిసిందే. ఒకరిపై ఒకరు సెటైర్ల నుంచి రాజకీయ విమర్శల వరకు పాలిటిక్స్‌ను హీటెక్కిస్తారు. ఎప్పటికైనా కాదు.. ఇప్పటికిప్పుడే.. మమతను గద్దెదించేస్తామని అనేక సందర్భాల్లో బీజేపీ నాయకులు చెప్పుకొచ్చారు. వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
దీనికి ముందు తాజాగా ఇప్పుడు ఆరు అసెంబ్లీ స్థానాల్లో ఉప పోరు జరిగింది. వివిధ కారణాలతో ఆరు చోట్ల ఖాళీ అయిన స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహించింది. చిత్రం ఏంటంటే.. ఈ ఆరు చోట్ల కూడా.. బీజేపీ యుద్ధ ప్రాతిపదికన ప్రచారం చేసింది. కీలక నేతలను కూడా రంగంలోకి దింపింది. ప్రధాని వెళ్లలేదు కానీ.. అగ్రనాయకులు మాత్రం వెళ్లారు. దీనికి కారణం.. వచ్చే ఏడాది ఎన్నికలకు సంబంధించి కర్టెన్ రైజర్‌గా ఉప పోరులో విజయం దక్కించుకోవాలన్నది వారి సంకేతం.
అయితే.. చిత్రం ఏంటంటే.. మమతా బెనర్జీ హవా ముందు బీజేపీ ప్రచారం ఒక్కమూలకు కూడా రాలేదు. ఆరు స్థానాల్లోనూ మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ విజయ పరంపరను కొనసాగిస్తోంది. తొలి రౌండ్ నుంచే తృణమూల్ అభ్యర్థులు.. దూకుడుగా ముందుకు సాగారు. నాలుగు చోట్ల విజయం కూడా కైవసం అయిపోయింది. మిగిలిన రెండు స్థానాల్లో మాత్రం కౌంటిగ్ జరుగుతూనే ఉంది. అయినా.. విజయం మాత్రం దీదీ వర్గానిదే.
ఈ పరిణామాలు బీజేపీలో కలవరపాటుకు కారణమయ్యాయి. మహారాష్ట్రలో విజయం దక్కించుకున్నా.. జార్ఖండ్‌లో పరాజయం, ఉప పోరులో నూ అనేక రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి వంటివి కమల నాథులకు ఇబ్బందిగానే మారాయి. మరీ ముఖ్యంగా దీదీకి చెక్ పెట్టాలని ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్న బీజేపీ నాయకులకు.. ఇప్పుడు కనీసం 2 స్థానాల్లో అయినా గెలిచి ఆమెకు చుక్కలు చూపించాలని అనుకున్నారు. కానీ, మోడీ వ్యూహానికి.. బీజేపీ ఎత్తులకు దీదీ రాజకీయాలు ఎక్కడా కొరుకుడు పడకపోవడం గమనార్హం.