ముస్లింల కోటాలో బీజేపీ పాగా..! 31 ఏళ్ల తర్వాత..
రెండు రాష్ట్రాల్లోనూ ఎన్డీయే కూటమి పాగా వేస్తుందని సర్వేలు వెల్లడించగా.. అనూహ్యంగా జార్ఖండ్‌లో ఇండియా కూటమి విజయం సాధించింది.
By: Tupaki Desk | 24 Nov 2024 7:11 AM GMTదేశవ్యాప్తంగా మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చర్చకు దారితీశాయి. మరోసారి ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో సర్వే అంచనాలు తప్పాయి. రెండు రాష్ట్రాల్లోనూ ఎన్డీయే కూటమి పాగా వేస్తుందని సర్వేలు వెల్లడించగా.. అనూహ్యంగా జార్ఖండ్‌లో ఇండియా కూటమి విజయం సాధించింది. మహారాష్ట్రను ఎన్డీయే కూటమి కైవసం చేసుకోగా.. ఈ రెండు రాష్ట్రాలతోపాటే పలు అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు బై పోల్స్ జరిగాయి. వాటిలోనూ ఎన్డీయే కూటమి సత్తా చాటింది.
48 అసెంబ్లీ స్థానాల్లో 25 స్థానాల్లో ఎన్డీయే గెలుపొందింది. రెండు లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ హవా కొనసాగించింది. అయితే.. ఈ ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఆ ఒక్క సీటు గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. దేశమంతా అదే సీటుగురించి మాట్లాడుకుంటున్నారు. మరీ ముఖ్యంగా యూపీ రాజకీయ వర్గాల్లో ఇది మరింత హాట్ టాపిక్ అయింది.
యూపీలోని మురాదాబాద్ జిల్లా కుందర్కీ నియోజకవర్గంలో 1993 తరువాత ఇంతవరకు బీజేపీ గెలవలేదు. దాదాపుగా 31 ఏళ్లుగా అక్కడ బీజేపీ విజయం సాధించలేకపోయింది. అప్పుడు బీజేపీ తరఫున పోటీ చేసిన చంద్రవిజయ్ సింగ్ ఇక్కడ పోటీ చేసి గెలుపొందారు. మూడు దశాబ్దాల తర్వాత 2024 బైపోల్ నిన్నటి ఫలితాల్లో బీజేపీకి చెందిన రామ్‌వీర్ సింగ్, సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి మొహమ్మద్ రిజ్వాన్‌పై 1,44,791 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు.
అయితే.. ఈ నియోజకవర్గం ముస్లింలకు కేరాఫ్ కావడంతో ఇక్కడి అభ్యర్థులు కూడా ముస్లింలే బరిలో నిలిచారు. 2017లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా రామ్‌వీర్ సింగ్ మొదటగా హిందూ వ్యక్తిగా బరిలోకి దిగి సుమారు 2 వేల ఓట్లతో ఓడిపోయారు. ఇక.. ఈ ఉప ఎన్నికల్లో కుందర్కీ నియోజకవర్గం నుంచి రామ్‌వీర్ సింగ్ ఒక్కరే మళ్లీ హిందూ అభ్యర్థిగా బరిలో దిగారు. మిగిలిన 11 మంది అభ్యర్థులు అందరూ కూడా ముస్లింలే. వీరు వివిధ పార్టీల నుంచి బరిలోకి దిగారు. సమాజ్‌వాదీ పార్టీతోపాటు ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరాం), ఏఐఎంఐఎం, బహుజన సమాజ్ పార్టీలు కూడా అభ్యర్థులను రంగంలోకి దింపాయి.
ఈ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన రామ్‌వీర్ సింగ్‌కు 1,70,371 ఓట్లు రాగా.. సమాజ్‌వాదీ పార్టీ నుంచి పోటీ చేసిన మొహమ్మద్ రిజ్వాన్‌తో 25,580 ఓట్లు మాత్రమే సాధించి రెండో స్థానంలో నిలిచారు. అంటే.. వీరిద్దరి మధ్య 1,44,791 ఓట్ల ఉంది. ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరాం) అభ్యర్థి చాంద్ 14,201 ఓట్లు సాధించి మూడో స్థానానికి పరిమితం అయ్యారు. ఎంఐఎంకు చెందిన మొహహ్మద్ వారిస్‌కు 8,111, బీఎస్పీ నుంచి పోటీ చేసిన రఫతుల్లాకు 1,099 ఓట్లు పడ్డాయి.
కుందర్కీ నియోజకవర్గంలో దాదాపు 60 శాతం మంది ముస్లింలు ఉండగా.. వీరి తీర్పే ప్రధానం. వీరు ఏ అభ్యర్థికి మద్దతు తెలిపితే ఆ పార్టీ అభ్యర్థి గెలుపు ఖాయం. అయితే.. ముస్లింల మద్దతు కూడగట్టి ఈ ఉప ఎన్నికల్లో రామ్‌వీర్ సింగ్ గెలుపొండాన్ని ఆ పార్టీ కూడా పెద్ద విషయంగానే పరిగణిస్తున్నది. రామ్‌వీర్ వ్యూహం, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మాజీముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రచారంతో ఈ ఫలితం వచ్చినట్లుగా తెలుస్తోంది. రామ్‌వీర్ సింగ్ ముస్లిం ఏరియాలకు కూడా వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ముస్లింల టోపీ ధరించి మరీ ప్రచారం చేశారు. వారితో మాట్లాడుతూ వారి భాషనే వాడారు. దీంతో ఈ విజయం సాధ్యపడినట్లుగా బీజేపీ నేతలు అంటున్నారు. మొత్తానికి మహారాష్ట్ర ఫలితాలకు మించి ఈ విజయం పార్టీకి ఎంతో కిక్ ఇచ్చిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.