Begin typing your search above and press return to search.

హరియాణాలో కాంగి'రేసు'.. ఒకరికి నలుగురు సీఎంలు

లోక్ సభ ఎన్నికల్లో పుంజుకున్న కాంగ్రెస్ అసెంబ్లీని కైవసం చేసుకుంటుందనే అంచనాలు వెలువడుతున్నాయి.

By:  Tupaki Desk   |   6 Oct 2024 1:30 PM GMT
హరియాణాలో కాంగిరేసు.. ఒకరికి నలుగురు సీఎంలు
X

ఉత్తరాది రాష్ట్రం హరియాణాలో పోలింగ్ ముగిసింది.. ఆ వెంటనే వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ పార్టీదే అధికారం అని స్పష్టమైంది. వాస్తవానికి హరియాణాలో బీజేపీ పదేళ్లుగా అధికారంలో ఉంది. 2014, 2019 ఎన్నికల్లో మనోహర్ లాల్ ఖట్టర్ ను చూపుతూ ఎన్నికలకు వెళ్లింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయనను అనూహ్యంగా తప్పించి సైనీని సీఎం చేసింది. అనంతరం లోక్ సభ ఎన్నికల్లో దెబ్బతిన్నది. 2019లో 10కి పది సీట్లను గెలిచిన బీజేపీ ఈసారి సగం కోల్పోయింది. ఈలోగా అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. లోక్ సభ ఎన్నికల్లో పుంజుకున్న కాంగ్రెస్ అసెంబ్లీని కైవసం చేసుకుంటుందనే అంచనాలు వెలువడుతున్నాయి.

ముందే తెలిసిన ఫలితం

హరియాణాలో పదేళ్లుగా అధికారంలో ఉండడంతో బీజేపీకి ప్రతికూలమైంది. ధరల పెరుగుదల, నిరుద్యోగంతో పాటు సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన, నిరుడు అంతర్జాతీయ స్థాయిలో పేరున్న రెజ్లర్ల నిరసనలు బీజేపీని బాగా అన్ పాపులర్ చేశాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని అందరూ భావించారు. దీనికితగ్గట్లే ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి.

హిమాచల్ తర్వాత..

ఉత్తరాదిలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ లోనే ఒంటరిగా అధికారంలో ఉంది. ఇప్పడు హరియాణాలోనూ విజయం సాధించడం ఖాయమని చెబుతున్నారు. దీంతో రెండు ఉత్తరాది రాష్ట్రాల్లోనూ హస్తవాసి కనిపించనుంది. అయితే, పార్టీ గెలుపు ఖాయం కావడంతో కాంగ్రెస్ నుంచి సీఎం ఎవరనేది పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. పార్టీలోనూ ఒకరికి నలుగురు నాయకులు పోటీ పడుతున్నారు.

ఈ ముగ్గురిలో..

కుమారి షెల్జా, రణదీప్ సూర్జేవాలా, భూపీందర్ సింగ్ హుడా.. హరియాణా కాంగ్రెస్ లో పెద్ద నాయకులు. వీరిలో ఒకరికి సీఎం పదవి దక్కనుందని చెబుతున్నారు. భూపీందర్ పైకి అధిష్ఠానందే నిర్ణయం అని అంటున్నా.. తానూ గట్టిగా పట్టుబడుతున్నారు. సీనియర్ నాయకురాలు కావడంతో షెల్జా కు కూడా హక్కు ఉందని చెప్పడం గమనార్హం. రణదీప్ సూర్జేవాలా కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి. పలు అంశాల్లో పార్టీ వాయిస్ ను గట్టిగా వినిపిస్తున్నారు. మరి వీరిలో చాన్స్ దక్కేదెవరికో.. ఈ నెల 10వ తేదీ నాటికి తేలిపోనుంది. కాగా, హరియాణాతో పాటు జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల మంగళవారం వెలువడనున్నాయి. సోమవారం తమ కార్యాచరణపై కాంగ్రెస్ అధిష్ఘానం సమావేశం కానుంది.