Begin typing your search above and press return to search.

ఎవరి దారి వారిదే.. సభ్యత్వాల లక్ష్యానికి దూరంగా బీజేపీ

పార్టీలో ఈ ముగ్గురికి ఒకరంటే ఒకరు పడడం లేదనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది.

By:  Tupaki Desk   |   8 Oct 2024 5:30 PM GMT
ఎవరి దారి వారిదే.. సభ్యత్వాల లక్ష్యానికి దూరంగా బీజేపీ
X

కేంద్రంలో హ్యాట్రిక్ విజయం సాధించిన బీజేపీ.. మరోసారి సౌత్ రాష్ట్రాలపై దృష్టి సారించింది. అందులో భాగంగా తెలంగాణను టార్గెట్ చేసింది. ఇందుకోసం ఇక్కడ వీలైనన్ని ఎక్కువ సంఖ్యలో సభ్యత్వాలు నమోదు చేయించాలని అధిష్టానం ఆదేశించింది. సభ్యత్వాల నమోదు కార్యక్రమం ప్రారంభమై వారాలు గడుస్తున్నా ప్రజల నుంచి పెద్దగా రెస్పాన్స్ రావడం లేదు. అయితే.. ఇందుకు పలు కారణాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

బీజేపీలో ఇప్పుడు ముగ్గురు ప్రధాన నాయకులు ఉన్నారు. అందులో ఇద్దరు కేంద్ర మంత్రులు, ఓ ఎంపీ ఉన్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, ఈటల రాజేందర్.. పార్టీకి ఇప్పుడు ముఖ్యులుగా ఉన్నారు. అయితే.. పార్టీలో ఈ ముగ్గురికి ఒకరంటే ఒకరు పడడం లేదనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. ముగ్గురు మూడు దారుల్లో వెళ్తున్నారన్న టాక్ ఉంది. మొన్నటి అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లోనూ అదే వైఖరి అవలంబించారన్న అపవాదు ఉంది. ఈ విషయం అధిష్టానం వరకు కూడా వెళ్లింది. చాలా సందర్భాల్లోనూ వారితో ప్రత్యేకంగా మాట్లాడారు. పార్టీ పెద్దలు క్లాస్ కూడా పీకారు. అంతా కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆదేశించారు.

కానీ.. వారిలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదని ప్రచారం. అయితే.. బీజేపీకి గతంలో కంటే ఇప్పుడు బలం పెరిగింది. ఎన్నడూలేని విధంగా 8 మంది ఎంపీలను ఆ పార్టీ గెలిపించుకుంది. అటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ 8 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు ప్రజలు. దాంతో పార్టీ పుంజుకునే పరిస్థితులు ఉండడంతో అధిష్టానం కూడా తెలంగాణ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించింది. అయితే.. సభ్యత్వాల నమోదును టార్గెట్ పెట్టినప్పటికీ ఆ స్థాయిలో కావడం లేదని అధిష్టానం ఆగ్రహంతో ఉంది. దాంతో రాష్ట్ర నాయకత్వంపై గుర్రుగా ఉన్నట్లు తెలిసింది.

అందులోభాగంగా ఇటీవల పార్టీ చీఫ్ జేపీ నడ్డా కూడా రాష్ట్రానికి వచ్చారు. ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. సభ్యత్వ నమోదును పట్టించుకోకపోవడంపై క్లాస్ ఇచ్చారు. అయితే.. పార్టీ చీఫ్ జమ్ము ఎన్నికల్లో బిజీగా ఉండడం.. మిగిలిన నేతల్లో సఖ్యత లేకపోవడం వల్లే ఇలా జరుగుతున్నట్లు అధిష్టానం దృష్టికి పలువురు తీసుకెళ్లారు. ముఖ్యనేతలకు ఒకరంటే ఒకరు పడకనే నిత్యం ఢిల్లీ బాట పడుతున్నారని టాక్. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ టైమ్ పాస్ చేస్తున్నారని అధిష్టానం కూడా ఫైర్ అయినట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలు మాని రాష్ట్రంలో సభ్యత్వ నమోదుపై దృష్టి సారించాలని ఆదేశించారు. ఇటీవలే స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి జమ్ము నుంచి రాష్ట్రానికి చేరుకున్నారు. ఇక బండి సంజయ్ అమ్మవారి మాల ధరించి అమ్మవారి సేవలో కరీంనగర్‌లోనే ఉండిపోయారు. ఇక మరోనేత ఈటల రాజేందర్ నిత్యం సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారనే కానీ సభ్యత్వ నమోదుపై పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. దాంతో బీజేపీ సభ్యత్వ నమోదు లక్ష్యాలు అంత ఈజీ అయ్యే పరిస్థితులు లేవని పార్టీలో చర్చ నడుస్తోంది.