కష్ట కాలంలో కమలం నేతలకు బాధ్యతేదీ?
ప్రాథమికంగా వచ్చిన నష్టం 6880 కోట్ల రూపాయలు ఉంటుందని సీఎం చంద్రబాబు కేంద్రానికి నివేదిక పంపించారు.
By: Tupaki Desk | 11 Sep 2024 11:30 PM GMTవిజయవాడ వరదల్లో అపార నష్టం వాటిల్లింది. వారం రోజుల పాటు సీఎం చంద్రబాబు, టీడీపీ మంత్రులు ప్రజల మధ్యే ఉన్నారు. వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. వారిని ఆదుకునే ప్రయత్నం చేశారు. నిరంతరం సేవలు చేశారు. ఇంత వరకు బాగానే ఉంది. ఇప్పుడు అసలు ఘట్టం తెరమీదికి వచ్చింది. అదే బాధితులకు ఆర్థిక సాయం చేసే వ్యవహారం. దీనిపై ప్రభుత్వం మల్ల గుల్లాలు పడుతోంది. ప్రాథమికంగా వచ్చిన నష్టం 6880 కోట్ల రూపాయలు ఉంటుందని సీఎం చంద్రబాబు కేంద్రానికి నివేదిక పంపించారు. దీనిపై ఆయన చాలానే ఆశలు పెట్టుకున్నారు.
అయితే.. రాష్ట్రంలోని బీజేపీ నాయకులు ఈ విషయంలో మౌనంగా ఉండడం ఇప్పుడు చర్చకు దారి తీసింది. ఎందుకంటే.. ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలు, వీరిలో ఒక కేంద్ర మంత్రి కూడా ఉన్నారు. మరి వీరికి బాధ్యత లేదా? వీరు కనీసం సమస్యలను పట్టించుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఒక్క బీజేపీ రాష్ట్ర చీఫ్ పురందేశ్వరి మాత్రం కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ వచ్చినప్పుడు ఆయన వెంట ఉన్నారు. అంతకు మించి ఆమె వరద ప్రభావిత ప్రాంతాల్లోనూ పర్యటించలే దు. బాధితులకు భరోసా కూడా కల్పించలేదు. మరి దీనిని ఎలా చూడాలి? అనేది ప్రశ్న.
రాజకీయంగా మోడీ ఈ రాష్ట్రానికి ఎన్నో మేళ్లు చేశారని చెబుతున్న బీజేపీ నాయకులు.. కీలకమైన సమయంలో ఎందుకు మౌనంగా ఉన్నారన్నది అందరినీ ఆలోచనకు గురిచేసింది. వాస్తవానికి ఇలాంటి విపత్కర సమయంలో కేంద్రానికి సూచనలు, సలహాలు ఇచ్చి.. బీజేపీ పెద్దలకు ఇక్కడి పరిస్థితిని వివరించాల్సిన అవసరం బీజేపీ నేతలకు ఉందనేది టీడీపీ సీనియర్ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. ``ఇన్ని రోజులు అయింది. మేం అడిగాం. అయినా.. కేంద్రం ఏమేరకు స్పందిస్తుందో తెలియదు. బీజేపీ నాయకులకు కొంతైనా బాధ్యత ఉండాలి. కానీ వారికి అలాంటిది లేదనిపిస్తోంది`` అని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు.
మరోవైపు.. చంద్రబాబు పంపించిన ప్రాథమిక నివేదికను కేంద్రం ఏమేరకు ఆమోదిస్తుందన్న విషయంపైనా అనేక సందేహాలు వున్నాయి. ఇప్పుడు కనుక కేంద్రం హ్యాండిస్తే.. అది రాజకీయంగా పెనుదుమారానికి, నేతల మధ్య దూరానికి కూడా దారితీసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ రాష్ట్ర నేతలు ఇప్పటికైనా జోక్యం చేసుకుని కేంద్రానికిరాయబారం చేయాల్సిన అవసరం ఉందని పరిశీలకులు చెబుతున్నారు.