ఢిల్లీ బీజేపీలో అధికార ‘పర్వేషాన్’..? మరో ఏక్ నాథ్ శిందే అవుతారా?
పర్వేష్ వర్మ.. ఢిల్లీ మాజీ సీఎం సాహెబ్ సింగ్ వర్మ కుమారుడు. సాహెబ్ సింగ్.. ఢిల్లీలో బీజేపీని పటిష్ఠం చేసిన నాయకుల్లో ఒకరు.
By: Tupaki Desk | 21 Feb 2025 9:30 PM GMTలేక లేక 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ అధికార పీఠం దక్కినా.. దాదాపు రెండు వారాల తర్వాత కాని సీఎం ఎవరో తేల్చేలేకపోయింది బీజేపీ. వరుసగా మూడోసారి దేశాన్ని ఏలుతున్న పార్టీ.. మోదీ వంటి నాయకుడు ఉన్న పార్టీ.. దేశ రాజధానిలో గెలిచి కూడా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొనడం కొంత ఆశ్చర్యమే.. ఢిల్లీలో ఉన్నది 70 నియోజకవర్గాలే అయినా, సీఎం పదవి కోసం పోటీ తక్కువేం లేదని తెలుస్తోంది. అందుకే ఎవరికీ కాకుండా అనూహ్యంగా కొత్త వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసింది బీజేపీ నాయకత్వం.
పర్వేష్ వర్మ.. ఢిల్లీ మాజీ సీఎం సాహెబ్ సింగ్ వర్మ కుమారుడు. సాహెబ్ సింగ్.. ఢిల్లీలో బీజేపీని పటిష్ఠం చేసిన నాయకుల్లో ఒకరు. ఇక పర్వేష్ మాజీ సీఎం కేజ్రీవాల్ ను ఓడించిన నాయకుడు. ఫలితాలు వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి పదవి ఈయనకే దక్కుతుందని మీడియాలో ఒకటే హడావుడి. కానీ, చివరికి రేఖా గుప్తా సీఎం అయ్యారు. దీంతో పర్వేష్ వర్మ, ఆయన మద్దతుదారులు చాలా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన.. మరో ఏక్‌నాథ్ శిందే కావొచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి.
ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీకి 48, ఆప్ నకు 22 స్థానాలు దక్కాయి. కనీస మెజారిటీ 36. దీంతో పర్వేష్ వర్గం ఆప్ తో కలిస్తే ప్రభుత్వం పడిపోతుందనే ఊహాగానాలు వస్తున్నాయి.
మహారాష్ట్రలో 2022లో ఏక్ నాథ్ శిందే శివసేనను చీల్చి బీజేపీ మద్దతుతో సీఎం అయిన సంగతి తెలిసిందే. ఇటీవలి ఎన్నికల్లో మాత్రం బీజేపీనే ఎక్కువ సీట్లు సాధించింది. ఎంతో తర్జనభర్జన తర్వాత దేవేంద్ర ఫడణవీస్ కు ముఖ్యమంత్రి పదవి దక్కింది. మొదట్లో మొండికేసాని శిందే మెత్తబడి డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. ఢిల్లీలో పర్వేష్ వర్మ కూడా ఇలానే సీఎం పదవి కోసం తీవ్రంగా ప్రయత్నించి వెనక్కుతగ్గారు. ఆయనకు మేనిఫెస్టో హామీలు నెరవేర్చే మంత్రిత్వ శాఖను అప్పగించారు.
బీజేపీ వర్గాలు మాత్రం పర్వేష్ వర్మ.. శిందేలా చేయరని అంటున్నాయి. ఆయన క్రమశిక్షణ కలిగిన కార్యకర్త అని.. అధిష్ఠానం చెప్పినట్లుగానే నడుచుకుంటారని చెబుతున్నాయి. రేఖా గుప్తా కంటే 47 ఏళ్ల పర్వేష్ చిన్నవారేనని.. ఆయనకు మంచి భవిష్యత్ ఉందని పేర్కొంటున్నాయి.