నిజం కానున్న ఎగ్జిట్ పోల్స్..స్పష్టమైన అధిక్యతలో బీజేపీ!
ఢిల్లీ రాష్ట్ర కోట మీద కాషాయ జెండా ఎగరాలన్న కమలనాథుల కల తీరనుంది.
By: Tupaki Desk | 8 Feb 2025 5:02 AM GMTఢిల్లీ రాష్ట్ర కోట మీద కాషాయ జెండా ఎగరాలన్న కమలనాథుల కల తీరనుంది. ఎప్పుడెప్పుడు ఢిల్లీ రాష్ట్రాన్ని సొంతం చేసుకోవాలని తపించిన ఇంతకాలానికి ఢిల్లీ ఓటర్లు బీజేపీకి పట్టం కట్టేలా నిర్ణయం తీసుకున్నారా? అన్నట్లుగా తాజా ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో బీజపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి అవసరమైన స్థానాల కంటే ఎక్కువ చోట్ల అధిక్యతను ప్రదర్శిస్తోంది.
మొత్తం ఢిల్లీ అసెంబ్లీలో 70 స్థానాలు ఉండగా.. ఇప్పటివరకు జరిగిన ఓట్ల లెక్కింపునకు సంబంధించిన వివరాల్ని చూస్తే.. పోలింగ్ అనంతరం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్లే ఉన్నాయి. శనివారం ఉదయం 9.30 గంటల ప్రాంతానికి అధికార ఆమ్ ఆద్మీ పార్టీ 25 స్థానాల్లో మాత్రమే అధిక్యతను ప్రదర్శిస్తూ వెనుకబడి ఉండగా.. బీజేపీ కూటమి 45 స్థానాల్లో అధిక్యతను ప్రదర్శిస్తూ దూసుకెళుతోంది. ఇప్పటివరకు వెల్లడైన రౌండ్లలో మెజార్టీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు అధిక్యతలను ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వానికి ఏర్పాటు చేయటానికి 36 స్థానాల్ని సొంతం చేసుకోవాల్సి ఉంది. ఇప్పటివరకు వెల్లడైన ఓట్ల లెక్కింపు ప్రకారం చూస్తే.. మెజార్టీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ముందుకు వెళుతున్నారు.
అదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన అగ్రనేతలు క్రేజీవాల్, ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న అతిశీలతో సహా పలువురు తిరోగమనంలో పయనిస్తూ ఉండటం గమనార్హం. తొలి రౌండ్లలో కాంగ్రెస్ ఒక స్థానంలో అధిక్యతలో ఉండగా.. తొమ్మిదిన్నర గంటల సమయానికి ఆ ఒక్క స్థానంలోనూ వెనుకబడి ఉంది. దీంతో.. ఈ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కు దారుణమైన షాక్ కు గురి చేస్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజా ఫలితాల ట్రెండ్ చూస్తే.. ఈసారికి బీజేపీ కల నెరవేరి.. ఢిల్లీ రాష్ట్రంలో కమలనాథుల ప్రభుత్వం కొలువు తీరుతుందన్నఅభిప్రాయం బలంగా వినిపిస్తోంది.