రూ. 12.75 లక్షల ఆఫర్.. బీజేపీ బిగ్ స్కెచ్ వేసిందా?
కేంద్ర బడ్జెట్లో ఎవరి ఊహకు అందని వరం ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. వేతన జీవులపై కనికరం చూపుతూ ఆదాయపు పన్ను పరిమితిని రూ.12.75 లక్షలకు పెంచారు.
By: Tupaki Desk | 2 Feb 2025 1:30 PM GMTకేంద్ర బడ్జెట్లో ఎవరి ఊహకు అందని వరం ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. వేతన జీవులపై కనికరం చూపుతూ ఆదాయపు పన్ను పరిమితిని రూ.12.75 లక్షలకు పెంచారు. ఏటా బడ్జెట్ సమయంలో ఆదాయపు పన్ను మినహాయింపును కోరుకోవడం సగటు ఉద్యోగికి పరిపాటి. ఈ సారి కూడా ఇదే విధంగా ఎంతో కొంత పన్ను సడలింపు కోరుకున్నారు. కానీ, కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కుమారుడు లభించినట్లు ఏదో లక్షో, రెండు లక్షలో సడలిస్తారనుకుంటే ఏకంగా రూ.5.75 లక్షలు పెంచి రూ.12.75 లక్షల వరకు పన్ను చెల్లించక్కరలేదని ప్రకటించడం విస్మయానికి గురిచేసింది. ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం చూస్తున్న వారంతా తాము వింటున్నది నిజమేనా? లేక కలా? అంటూ కాసేపు ఆశ్చర్యపోయారు. అయితే తేరుకున్నాక తమ పాలిట మహాలక్ష్మిగా నిర్మలమ్మను కీర్తించారు. ఇది నాణేనికి ఒకవైపు కాగా, మరోవైపు ఉన్నఫళంగా కేంద్రం మధ్య తరగతి జనానికి భారీ ఊరట కల్పించడానికి కారణం వేరే ఉందని అంటున్నారు.
కేంద్రంలో ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చి పదేళ్లు అవుతోంది. ఈ దఫాతో మోదీ ప్రభుత్వం మొత్తం 11 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినట్లైంది. అయితే గత పదిసార్లు వేతన జీవులపై కన్నెత్తి చూడని సర్కారు ఇప్పుడు భారీ నజరానా ఇవ్వడానికి ప్రధాన కారణం ఢిల్లీ ఎన్నికలే అని విశ్లేషిస్తున్నారు. దేశ రాజధానిలో అధికారం కోల్పోయి 25 ఏళ్లు కావస్తున్నందున ఈ సారి కచ్చితంగా గెలవాలని భావిస్తోంది బీజేపీ. ఇదే సమయంలో ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ ప్రభుత్వం వరుసగా రెండు సార్లు గెలిచింది. ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. దీంతో గెలుపు కోసం పగలు రాత్రి తేడా లేకుండా పనిచేస్తున్న బీజేపీ.. ఎన్నో ఉచిత హామీలు ప్రకటించింది. వీటికి పోటీగా ప్రత్యర్థి పార్టీలైన ఆప్, కాంగ్రెస్ కూడా ఉచిత హామీలు గుప్పిస్తున్నాయి. దీంతో బడ్జెట్ తో భారీ గూగ్లీ విసరాలని బీజేపీ ప్లాన్ చేసిందని అంటున్నారు.
ఢిల్లీ ఎన్నికలకు మరో నాలుగు రోజులు మాత్రమే ఉండటంతో బడ్జెట్ లో నేరుగా ప్రయోజనాలు కల్పించే పథకాలు ఏవీ ప్రకటించలేకపోయింది. ఇదే సమయంలో త్వరలో ఎన్నికలు జరగనున్న బిహార్ రాష్ట్రానికి పెద్దపీట వేసింది. దీంతో ఢిల్లీ ఓటర్లను మచ్చిక చేసుకునే వ్యూహంతో ఆదాయపు పన్ను పరిమితిని భారీగా సడలించేందుకు రెడీ అయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీలో ఎక్కువగా మధ్య తరగతి వారు ఏటా ఆదాయపు పన్ను రూపంలో కేంద్రానికి రూ.1.78 లక్షలు చెల్లిస్తున్నట్లు చెబుతున్నారు. ఢిల్లీ మొత్తం ఓటర్లు కోటి 55 లక్షలు కాగా, ఇందులో దాదాపు 40 లక్షల మంది ట్యాక్స్ పేయర్స్ ఉన్నారని లెక్కలు చెబుతున్నాయి. వీరి కుటుంబ సభ్యుల ఓట్లు కలిపితే దాదాపు 67 శాతం ఓటర్లు మధ్యతరగతి వారేనని అంచనా. వీరి అభిమానాన్ని చూరగొంటే ఢిల్లీలో ఈజీగా గట్టెక్కవచ్చని బీజీపీ ప్లాన్ చేసిందని చెబుతున్నారు.
వాస్తవానికి బీజేపీకి ఈ మాస్టర్ ప్లాన్ ఇచ్చింది కూడా ప్రతిపక్షమే కావడం గమనార్హం. ఢిల్లీలో మధ్య తరగతి ఓటర్లు ఎక్కువగా ఉన్నందున మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆ వర్గంపై ఫోకస్ చేశారు. వారి మనసులను గెలుచుకునేందుకు కేంద్రాన్ని ఇరుకున పెట్టేలా ఇటీవల విమర్శలు గుప్పించారు. రూ.7 లక్షల వరకు ఉన్న ఆదాయపన్ను పరిమితిని రూ.10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. కేంద్రం మధ్య తరగతి ప్రజలను ఏటీఎంగా వాడుకుంటోందని తీవ్ర విమర్శలు చేశారు. అయితే బీజేపీ కేజ్రీవాల్ విమర్శలనే సలహాలుగా తీసుకుని ఆయనపైనే గూగ్లీ సంధించిందంటున్నారు. కేజ్రీవాల్ రూ.10 లక్షలు చేయాలని డిమాండ్ చేస్తే.. బీజేపీ ఏకంగా రూ.12.75 లక్షలకు పెంచి అంతకు మించి అన్నట్లు వ్యవహరించిందని అంటున్నారు. మొత్తానికి ఢిల్లీ ఎన్నికల పుణ్యమాని దేశవ్యాప్తంగా వేతన జీవులకు ఊరట దక్కిందనే సంతోషం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో బీజేపీ ప్లాన్ ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందనేది ఆసక్తి రేపుతోంది.