కూటమిలో బీజేపీ అసంతృప్తి...రాజేసిన రాజు!
తమకు నామినేటెడ్ పోస్టుల నుంచి మంత్రి పదవుల దాకా అన్యాయం జరుగుతోంది అని వాపోతున్నారు.
By: Tupaki Desk | 13 Dec 2024 4:30 AM GMTఏపీలో టీడీపీ కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయి. అయితే ఎక్కువగా టీడీపీ జనసేనకే ప్రయారిటీ ఇస్తోంది అని కమలనాధులు కుములుతున్నారు. తమకు నామినేటెడ్ పోస్టుల నుంచి మంత్రి పదవుల దాకా అన్యాయం జరుగుతోంది అని వాపోతున్నారు.
మొత్తం 80 దాకా నామినేటెడ్ పదవుల పందేరం జరిగితే అందులో బీజేపీకి దక్కినవి కచ్చితంగా అయిదు కూడా లేవు అని అంటున్నారు. మంత్రి పదవులు తీసుకుంటే పాతిక మందితో ఉన్న కేబినెట్ లో ఒకే ఒక్కరికి ఆ చాన్స్ ఇచ్చారు. ఇక జనసేనకు నాలుగవ మంత్రి పదవిని కట్టబెడుతున్నారు. అది కూడా పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుని తెచ్చి మరీ మంత్రి కిరీటం ఇస్తున్నారు.
ఆయన చట్ట సభలలో దేనిలోనూ సభ్యుడు కారు. ఆ మాటకు వస్తే ఆయన ఇప్పటిదాకా ఎక్కడా గెలవలేదు. అలా చూస్తే కనుక ఆయనకు అంతగా అనుభవం లేకపోయినా కోరి తెచ్చి మంత్రి పదవిని ఇవ్వడం పట్ల అయితే చర్చ సాగుతోంది.
జనసేనకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూండడం పట్ల బీజేపీ నేతలలో అయితే తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురంధేశ్వరిని ఎక్కడా పట్టించుకోవడం లేదని కూటమి ఫ్లెక్సీలలో ఆమె ఫోటో కూడా లేదని అంటున్నారు.
కూటమి అంటే మూడు పార్టీల నేతలూ ఏ అంశం మీదనైనా చర్చించుకోవాల్సి ఉండగా చంద్రాబబు పవన్ మాత్రమే భేటీ అవుతూ చర్చించుకుంటున్నారు అని అంటున్నారు. ఇవన్నీ ఇల్లా ఉంటే ఇపుడు నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని చంద్రబాబు ప్రకటించిన నేపధ్యంలో బీజేపీలో అసంతృప్తి సెగలు రాజుకుంటున్నాయి.
వాటిని రాజేసింది కూడా బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు. ఆయన విశాఖ నార్త్ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. శాసన్సభలో ఆయన బీజేపీ పక్ష నేతగా ఉన్నారు. ఆయన తాజాగా ఒక చానల్ తో మాట్లాడుతూ తమకు ఈసారి సీట్లు రెట్టింపు అయ్యాయని కానీ మంత్రి పదవులు మాత్రం రెండింటికి ఒకటి అయిందని అన్నారు.
వెనక్కి వెళ్తే 2014 నుంచి 2019 మధ్యలో బీజేపీకి కేవలం నలుగురు ఎమ్మెల్యేలు ఉంటే అందులో ఇద్దరికీ మంత్రి పదవులు దక్కాయని ఆయన గుర్తు చేస్తున్నారు. ఈసారి ఎనిమిది మంది ఉంటే ఒక్కరికే ఇచ్చారని అంటున్నారు బీజేపీలో అసంతృప్తి ఉందో లేదో చంద్రబాబే చూడాలని కూడా అంటున్నారు.
మూడు పార్టీలను చూసి జనాలు ఓటు వేశారని మూడు పార్టీల కలయికతోనే గెలుపు సాధ్యమైంది అని ఆయన అంటున్నారు. అనుభవం ఉన్న వారికే అవకాశాలు ఇవ్వాలని అంటున్నారు. మొత్తం మీద చూస్తే మంత్రి పదవి విషయంలో రాజు గారు ఆశలు పెట్టుకున్నారు అని అంటున్నారు.
ఇపుడు ఆ ఒకే ఒక బెర్త్ కాస్తా నాగబాబుకు వెళ్ళడంతో బీజేపీ కూడా అసంతృప్తిగా ఉందని అంటున్నారు. జనసేనకు మూడు మంత్రి పదవులు ఇచ్చిన తరువాత బీజేపీకి కనీసం రెండు అయినా ఇవ్వాల్సింది అని అంటున్నారు. అయితే జనసేనకే మరో మంత్రి పదవి అనడంతోనే ఇపుడు ఈ విధంగా కమలం పార్టీలో అసంతృప్తి వ్యక్తం అవుతోంది అని అంటున్నారు.