Begin typing your search above and press return to search.

కమలనాథుల 'పసుపు' ప్లానింగ్ మామూలుగా లేదుగా?

అయితే..ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల వేళ.. పసుపు బోర్డు ఏర్పాటు అవశ్యకత అర్థం చేసుకున్న మోడీ.. అందుకు సరైన సమయాన్ని చూడటం కనిపిస్తుంది.

By:  Tupaki Desk   |   15 Jan 2025 4:00 AM GMT
కమలనాథుల పసుపు ప్లానింగ్ మామూలుగా లేదుగా?
X

ఏమాటకు ఆ మాటే చెప్పాలి.. భారతీయ జనతాపార్టీకి దేశ ప్రధాని నరేంద్ర మోడీ అన్నీ తానై అయినప్పటి నుంచి ఆ పార్టీ తీరులో మార్పు కొట్టొచ్చినట్లుగా ఉండేది. బీజేపీని చూస్తే.. మోడీకి ముందు, మోడీ తర్వాత అన్న విభజన రేఖ స్పష్టంగా గీయాల్సి ఉంటుంది. అంతలా పార్టీని ప్రభావితం చేశారు. మిగిలిన బీజేపీ అగ్రనేతలకు.. మోడీకి ఉన్న వ్యత్యాసం ఏమంటే.. అధికారంలోకి రావటం కోసం.. బీజేపీని.. దాని భావజాలాన్ని దేశ వ్యాప్తం చేసేందుకు ప్రయత్నిస్తే.. మోడీ మాత్రం అధికారంలోకి రావటమే కాదు.. ఆ పవర్ మరొకరి చేతికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవటమే కాదు.. ప్రత్యర్థి పార్టీలు అంతకంతకూ బలహీనం అయ్యేలా చేసే టాలెంట్ ఆయనలో పుష్కలంగా కనిపిస్తుంది.

పదేళ్లు నాన్ స్టాప్ అధికారాన్ని అనుభవించిన ఆయన.. మరో ఐదేళ్ల అధికారానికి గత ఏడాది మేలో మరోసారి దేశ ప్రజల నుంచి అధికారికంగా అనుమతి తీసుకోవటం తెలిసిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన్ను కాదనే దమ్ము..ధైర్యం బీజేపీ మొత్తంలో ఎవరికి లేదు. ఆయన తీరుకు తగ్గట్లే బీజేపీ రూపురేఖలు మారిపోయాయి. ఎన్నికలే లక్ష్యంగా మోడీ ఆలోచనలు ఉంటాయని చెబుతారు. ఏదైనా రాష్ట్రం మీద ఆయన ఫోకస్ పెడితే.. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగటానికి ఏడాది ముందు నుంచి అలెర్టు కావటం.. ఎప్పుడూ లేని విధంగా మొదటి ఆర్నెల్లలోనే పలుమార్లు సదరు రాష్ట్రానికి వెళ్లటం.. అక్కడి పార్టీని యాక్టివ్ చేయటం.. ఎన్నికలు రావటానికి చివరి ఆర్నెల్లలో అధికారాన్ని హస్తగతం చేసుకోవటానికి వేయాల్సిన ఎత్తులు వేస్తుంటారు.

ఇక్కడే మోడీలోని మరో ఆసక్తికరమైన వైరుధ్యాన్ని చెప్పాలి. ఎన్నికల వేళలో ఎంత నమ్మకంగా మాట ఇస్తారో.. తిరుగు లేని అధికారం చేతికి వస్తే మాత్రం ఆ హామీని తూచ్ అనటం ఆయనకే సాధ్యం. ఈ సందర్భంగా ఆయన ఎంతో కటువుగా వ్యవహరిస్తారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని కావొచ్చు.. తెలంగాణకు పసుపు బోర్డు అంశాన్ని ఉదాహరణగా చెప్పొచ్చు. పసుపు బోర్డు అంశంపై గత ప్రభుత్వం మోడీ సర్కారు ఎంత కఠినంగా వ్యవహరించిందో తెలిసిందే.

అయితే..ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల వేళ.. పసుపు బోర్డు ఏర్పాటు అవశ్యకత అర్థం చేసుకున్న మోడీ.. అందుకు సరైన సమయాన్ని చూడటం కనిపిస్తుంది. నిజామాబాద్ జిల్లా రైతుల చిరకాల వాంఛ అయిన పసుపు బోర్డును ఏర్పాటు చేస్తున్న విషయాన్ని సోమవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో (2023, అక్టోబరు 1న మహబూబ్ నగర్ లో జరిగిన ప్రచార సభలో) పసుపుబోర్డు హామీని అమలు చేయనున్నట్లుగా పేర్కొన్నప్పటికి.. అది వాస్తవ రూపంలోకి రావటానికి 16 నెలల టైం పట్టింది.

ఇంత ఆలస్యమైన ఈ వ్యవహారం సరిగ్గా ఇప్పుడే ఎందుకు ప్రకటించినట్లు? అన్న ప్రశ్న వేసుకోవటంతో పాటు.. దాని లోతుల్లోకి వెళితే.. మోడీ మాష్టారి మాస్టర్ ప్లాన్ అర్థమవుతుంది. ఆయన లోతుకు ఆశ్చర్యపోవాల్సిందే. గతంలో పసుపు బోర్డు ఏర్పాటు చేయనున్నట్లుగా కేంద్రం ప్రకటించినప్పటికీ.. అదెక్కడ ఏర్పాటు చేస్తారో మాత్రం చెప్పలేదు. తాజాగా మాత్రం దానిని నిజామాబాద్ లో ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రకటించటమే కాదు.. దాని ఛైర్మన్ గా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామానికి బీజేపీ నాయకుడు పల్లె గంగారెడ్డిని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను కేంద్ర వాణిజ్య శాఖ జారీ చేసింది.

ఇంతకూ నిజామాబాద్ లో పసుపు బోర్డును ఏర్పాటు చేయటానికి.. అదే జిల్లాకు చెందిన వ్యక్తిని పసుపు బోర్డు ఛైర్మన్ గా నియమించటం వెనుక లెక్కలు ఏమైనా ఉన్నాయా? అంటే.. ఎందుకు ఉండవు? అన్న సమాధానం ప్రశ్న రూపంలో రావటం ఖాయం. మరికొద్ది రోజుల్లో తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రెండు ఎన్నికల్ని చూస్తే. ఒకటి కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, మెదక్ జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల స్థానానికి ఎన్నిక జరగనుంది. మరో ఎన్నికల కరీంనగర్, అదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలకు సంబంధించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది.

నిజానికి మిగిలిన ఎన్నికలకు.. ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో బీజేపీ ఫార్మాట్ వేరుగా ఉంటుందని చెప్పాలి. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే వేళలో.. అధికారంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ.. దానితో ముఖాముఖిన పోరాడే సత్తా.. బీజేపీకి మాత్రమే సొంతమని చెప్పాలి. నిజానికి ఆ పార్టీకి బలం లేకున్నా.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం తన మార్కును చూపించటం తెలిసిందే.తాజా పసుపుబోర్డు నిజామాబాద్ లో ఎంపిక చేయటం ద్వారా.. తాజాగా జరుగుతన్న ఎమ్మెల్సీ ఎన్నికల మీద ప్రభావం చూపుతుందని చెప్పాలి. చిరకాల వాంఛ తీర్చిన ఘనత బీజేపీకి దక్కటంతోపాటు.. దానికి పేబాక్ గా ఓట్ల రూపంలో గెలిపించాల్సిన బాధ్యత ఆ జిల్లాలకు చెందిన వారి మీద ఉంటుంది. గురి చూసి దెబ్బేసిన చందంగా.. మోడీ అండ్ కో పసుపుబోర్డును నిజామాబాద్ లో ఏర్పాటు చేయటం వెనుక ఇంత భారీప్లానింగ్ ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మోడీనా మజాకానా.