బీజేపీ ఎంపీ దూకుడు.. బాబు, పవన్‌ల కోర్టుకు వివాదం!?
అయితే.. బీజేపీకి ఉన్న ఆరుగురు ఎంపీలలో ఒక ఎంపీ ఇప్పుడు రాజకీయంగా చర్చకు వస్తున్నారు.
By: Tupaki Desk | 21 Oct 2024 3:39 AM GMTసాధారణంగా ఏపీలో బీజేపీకి బలం తక్కువగా ఉంది. దీంతో కూటమి పార్టీల నాయకుల్లో టీడీపీ, జనసేన నేతలు ఒకింత ముందంజలో ఉన్నారు. ఒకరిపై ఒకరు ఆధిపత్యం కూడా ప్రదర్శించుకుంటున్నారు. నియోజకవర్గాలను ఏలేస్తున్నారు. ఈ విషయంలో కొన్ని చిక్కులు.. కొన్ని వివాదాలు తెరమీదికి వస్తున్నా యి. ఇవన్నీ సాధారణమే. అయితే.. బీజేపీకి ఉన్న ఆరుగురు ఎంపీలలో ఒక ఎంపీ ఇప్పుడు రాజకీయంగా చర్చకు వస్తున్నారు. ఆయన దూకుడుతో టీడీపీ, జనసేనపార్టీల ఎమ్మెల్యేలు మౌనం పాటిస్తున్నారన్నది నియోజకవర్గం టాక్.
అనకాపల్లి ఎంపీగా.. బీజేపీ నాయకుడు, మాజీ టీడీపీ నేత.. సీఎం రమేష్ విజయం దక్కించుకున్నారు. ఈయనకు అటు కేంద్రంలోనూ.. ఇటు రాష్ట్రంలోనూ మంచి పరిచయాలు ఉన్నాయి. ముఖ్యంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ల దగ్గర కూడా చనువు ఎక్కువగా ఉంది. లేకపోతే.. ఎక్కడో కడపకు చెందిన ఆయన అనకాపల్లిలో టికెట్ దక్కించుకుని విజయం సాధించారంటే.. ఆశ్చర్యమే కదా! ఇదిలావుంటే.. గత మూడు మాసాలుగా ఆయన నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లోనూ కుమ్మేస్తున్నారన్నది కూటమి పార్టీల నేతల సమాచారం.
అనకాపల్లి పార్లమెంటు పరిధిలో చోడవరం, మాడుగుల, పాయకరావుపేట, నర్సీపట్నం నియోజకవర్గాల్లో టీడీపీ విజయం దక్కించుకుంది. ఇక, అనకాపల్లి అసెంబ్లీ సహా పెందుర్తి, యలమంచిలి నియోజకవర్గాల ను జనసేన తన ఖాతాలో వేసుకుంది. ఈ ఏడు నియోజకవర్గాల్లో విజయం దక్కించుకున్న నాయకులు చోటా నాయకులు కారు. అందరూ సీనియర్లే. పైగా నర్సీపట్నం నుంచి గెలిచిన చింతకాయల అయ్యన్న ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్నారు. ఇక, అనకాపల్లి నుంచి గెలిచిన కొణతాల రామకృష్ణకు జిల్లాలపైనే పట్టు ఉంది.
ఇక, మిగిలిన వారిలో పంచకర్ల రమేష్‌బాబు, బండారు సత్యనారాయణ మూర్తి, సన్యాసి రాజులు కూడా సీనియర్లే. ఇక, పాయకరావు పేట ఎమ్మెల్యే ప్రస్తుత హోం మంత్రిగా ఉన్నారు. అయితే.. ఇంత మంది ఉన్నా.. ఎంపీ సీఎం రమేష్ రాజ్యమే నడుస్తోందన్నది నియోజకవర్గంలో టీడీపీ, జనసేన నాయకులు చెబుతున్న మాట. మంత్రి, స్పీకర్ సైలెంట్‌గా ఉన్నారు. ఇక, కొణతాల కూడా తనకు ఏమీ పట్టనట్టే ఉన్నారు. కానీ.. మిగిలిన నాయకులు మాత్రం ఎంపీని ప్రశ్నిస్తున్నారు.
ఇసుక, సహా.. ఇతర విషయాల్లో మీ జోక్యం ఎందుకన్నది వారి ప్రశ్న. కానీ, సీఎం రమేష్ వారిని లైట్ తీసుకుంటున్నారు. ఈ పరిణామాలు ఇప్పుడు రాజధాని అమరావతికి చేరాయి. మీరే ఏదైనా చేయండి.. ఆయనతో వేగలేక పోతున్నాం.. అంటూ నాయకులు.. అటు చంద్రబాబుకు, ఇటు పవన్‌కు కూడా మొర పెట్టుకున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.