Begin typing your search above and press return to search.

బీజేపీ ఎంపీ పలుకుబడి అమాంతం పెరిగిందిగా !

అయినా కూడా ఆయనకు ప్రధాని నరేంద్ర మోడీ వద్ద కేంద్ర పెద్దల వద్ద పలుకుబడి అమాంతం పెరిగిపోతోంది.

By:  Tupaki Desk   |   9 Jan 2025 4:04 AM GMT
బీజేపీ ఎంపీ పలుకుబడి అమాంతం పెరిగిందిగా !
X

ఆయన స్వతహాగా చూస్తే తెలుగుదేశం మనిషి. ఆయన రక్తంతో ముప్పావు వంతు టీడీపీదే. ఎందుకంటే అది ఎప్పటికీ తెంచుకోలేని బంధం. ఆయన రాజకీయ అరంగేట్రం చేసిన పార్టీ టీడీపీ ఏకంగ ముప్పయి అయిదేళ్ల పాటు టీడీపీలో ఉండి ఆ పార్టీ తరఫున రెండు సార్లు రాజ్యసభకు వెళ్ళిన సీఎం రమేష్ ఇపుడు బీజేపీ ఎంపీగా అనకాపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

అయినా కూడా ఆయనకు ప్రధాని నరేంద్ర మోడీ వద్ద కేంద్ర పెద్దల వద్ద పలుకుబడి అమాంతం పెరిగిపోతోంది. ఎంతలా అంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఏ కమిటీలో అయినా సీఎం రమేష్ ఉండి తీరాల్సిందే. లేటెస్ట్ గా ఆయన జమిలి ఎన్నికల మీద కేంద్ర ప్రభుత్వం నియమించిన జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ఉన్నారు.

ఆయనను రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా మరో పదవిని ఇచ్చారు. ఇకా రెండు మూడు కమిటీలలో ఉన్నారని అంటున్నారు. ఆయన నరేంద్ర మోడీ విశాఖ వచ్చిన సందర్భంగా స్వాగత ఉపన్యాసం చేశారు. సాధారణంగా ఆ ఉపన్యాసం ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ ఎవరు ఉంటే వారు చేయాలి. కానీ ఆ చాన్స్ సీఎం రమేష్ తీసుకున్నారు. ఆయన పది నుంచి పదిహేను నిముషాల పాటు తెలుగు ఇంగ్లీష్ హిందీలలో మాట్లాడి ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసలతో ముంచెత్తారు.

అంతే కాదు ఏపీ సీఎం చంద్రబాబుని కూడా రాజకీయ దిగ్గజం అంటూ కీర్తించారు. గొప్ప నాయకుడు అంటూ పవన్ కళ్యాణ్ ని యువ నేత అంటూ నారా లోకేష్ ని అందరినీ కూడా పొగిడారు. ఆయన ఈ సభలో చేసిన వెల్ కం స్పీచ్ ద్వారా కేంద్ర పెద్దల వద్ద తన పలుకుబడి ఎలాంటిదో చెప్పారు. ఇదే సభలో వేదిక మీద కూర్చున్నా కూడా ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురంధేశ్వరి మాత్రం సభలో మాట్లాడలేకపోయారు.

అంతే కాదు ఆమె రోడ్ షోలో కూడా మోడీ వెనకన నిలబడిపోయారు. ఏపీ కూటమిలో ఆమె బీజేపీ పక్షాన ఉండాల్సిన నాయకురాలు కానీ ఆమెను అలానే పక్కన ఉంచుతున్నారు అని అంటున్నారు. ఇక ఏపీ నుంచి బీజేపీ తరఫున ముగ్గురు ఎంపీలు గెలిస్తే అందులో ఒకరైన శ్రీనివాసవర్మ కేంద్ర మంత్రి అయ్యారు. సీఎం రమేష్ కి కేంద్ర ప్రభుత్వం నామినేటెడ్ పదవులు కట్టబెడుతోంది. ఎటూ పురంధేశ్వరికే ప్రాధాన్యత లేదా అన్న చర్చ వస్తోంది.

ఇక ఆమె కంటే లేటుగా బీజేపీలో చేరినా సీఎం రమేష్ మాత్రం అలా కమలదళాన్ని ఆకట్టుకుంటూ అల్లుకుని పోతున్నారు అని అంటున్నారు. అంతే కాదు మోడీ విశాఖ టూర్ లో హవా అంతా ఆయనదే అయింది. ఎక్కడ చూసినా ఫ్లెక్సీలలో ఆయన ఫోటోలే కనిపించాయి. మొత్తానికి ఏపీ బీజేపీ అంటే సీఎం రమేష్ అన్నట్లుగానే ఉంది. మరి ముందు వచ్చిన చెవుల కంటే వెనక వచ్చిన కొమ్ములు వాడి అని సామెత ఉండనే ఉంది. అదే రాజకీయాల్లో అయితే ఇలాగే ఉంటుంది అని అంటున్నారు.ఏది ఏమైనా పేరులోనే సీఎం అని ట్యాగ్ ఉన్న రమేష్ రాజకీయ వైభోగం ఇలాగే ఉంటుంది కదా అని అంతా అంటున్నారు.