Begin typing your search above and press return to search.

సంచలనం.. దక్షిణాది దళిత నేతకు బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి?

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అంటే ఒకప్పుడు ఉత్తరాది పార్టీ అనే ముద్రను బలంగా వేశారు. అగ్రవర్ణాల పార్టీగానూ ప్రచారం చేశారు.

By:  Tupaki Desk   |   30 Dec 2024 5:30 PM GMT
సంచలనం.. దక్షిణాది దళిత నేతకు బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి?
X

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అంటే ఒకప్పుడు ఉత్తరాది పార్టీ అనే ముద్రను బలంగా వేశారు. అగ్రవర్ణాల పార్టీగానూ ప్రచారం చేశారు. రాజకీయాల్లో ప్రత్యర్థులు చేసే ఇలాంటి ప్రయత్నాలను దాటుకుని ఆ పార్టీ దేశమంతటా సత్తా చాటుతోంది. కర్ణాటకలో అధికారం చేజిక్కించుకుంది. తెలంగాణలో బలపడుతోంది. దక్షిణాదిలో ముందుగా బలమైన నాయకులను తయారు చేసుకుంటోంది. భావజాలాన్ని వ్యాపింపజేస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో అధికారం కైవసం చేసుకోవాలని చూస్తోంది. అన్నా డీఎంకేతో పొత్తుతో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బలంగా చాటాలని ప్రయత్నిస్తోంది. కేరళలో ఈ ఏడాది తొలిసారిగా లోక్ సభ సీటులో నెగ్గింది.

కొత్త అధ్యక్షుడు ఎవరు?

వరుసగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది బీజేపీ. దీంతోపాటు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా కేంద్రంలో మంత్రి కూడా అయ్యారు. ఈ నేపథ్యంలోనే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. ముందుగా మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేరు ఈ పదవికి గట్టిగా వినిపించింది. ఆ తర్వాత వెనక్కు పోయింది.

ముందు సంస్థాగతం..

జనవరి, ఫిబ్రవరిలో బీజేపీ సంస్థాగత ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. దేశవ్యాప్తంగా ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత కొత్త అధ్యక్షుడి ఎన్నిక ఉంటుంది. అయితే, జేపీ నడ్డా స్థానంలో కొత్తగా అధ్యక్షుడు ఎవరు? అనే సందేహం నెలకొంది.

తాజాగా వినిపిస్తున్న కథనాల ప్రకారం బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా దక్షిణాదికి చెందిన ఓ యువ దళిత నేతకు అవకాశం ఇవ్వనున్నారట. ఇటీవల అంబేడ్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం, కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా దళిత వర్గానికి చెందిన మల్లికార్జున ఖర్గే ఉండడం, బీజేపీ దళితులకు వ్యతిరేకం అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దళితుడినే జాతీయ అధ్యక్షుడిగా చేయనున్నట్లు చెబుతున్నారు. అందులోనూ దక్షిణాదిలో బలపడాలని కోరుకుంటున్న నేపథ్యంలో ఈ ప్రాంతానికే చెందిన నాయకుడికి ఆ బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

బంగారు లక్ష్మణ్, వెంకయ్య తర్వాత

దక్షిణాది నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షులుగా పనిచేసినవారిలో బంగారు లక్ష్మణ్ మొదటివారు. పైగా ఈయన దళిత వర్గానికి చెందినవారు కూడా. ఈయన అనంతర కాలంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వెంకయ్యనాయుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అయ్యారు. ఇప్పుడు దక్షిణాది నుంచి ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి.