చక్రం తిప్పిన వీర్రాజు.. బీజేపీలో పట్టు నిలబెట్టుకున్నారుగా..!
సోము వీర్రాజుకు తాజాగా బీజేపీ ఎమ్మెల్సీ టికెట్ ప్రకటించింది. వాస్తవానికి ఆయనకు ఈ దఫా టికెట్ రాదన్న ప్రచారం జోరుగా సాగింది.
By: Tupaki Desk | 11 March 2025 12:37 PM ISTసోము వీర్రాజుకు తాజాగా బీజేపీ ఎమ్మెల్సీ టికెట్ ప్రకటించింది. వాస్తవానికి ఆయనకు ఈ దఫా టికెట్ రాదన్న ప్రచారం జోరుగా సాగింది. ఆదివారం అర్ధరాత్రి వరకు జరిగిన సమాలోచనలు, చర్చలను గమనిస్తే.. సోము ను దాదాపు పక్కన పెట్టేశారని మీడియా వర్గాలకు కూడా సమాచారం అందింది. ఇదేసమయంలో తూర్పు గోదావరి నుంచి జనసేన పార్టీ తరఫున.. కాపు సామాజిక వర్గంలో నాగబాబుకు టికెట్ దక్కింది. దీంతో మళ్లీ ఇదే కాపు సామాజిక వర్గానికి చెందిన సోము కు ఇవ్వబోరని కూడా చెప్పుకొచ్చారు.
అంతేకాదు.. కాపులకు సమానంగా బలమైన ఓటు బ్యాంకు ఉన్న శెట్టిబలిజ సామాజిక వర్గాన్ని ఆకర్షించేం దుకు గత ఎన్నికల సమయంలో పార్లమెంటు టికెట్‌ను ఆశించిన పాకా సత్యనారాయణకు ఈ దఫా పార్టీ అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని.. ఆయనను మండలికి పంపిస్తారని అందరూ అనుకున్నారు. ఈ పేరు దాదాపు ఖరారైనట్టేనని రాష్ట్ర బీజేపీ చీఫ్ కార్యాలయ వర్గాల నుంచి కూడా మీడియాకు సమాచారం అందింది. కానీ, అనూహ్యంగా ఈ వ్యవహరంలో సోము పై చేయి సాధించారు.
ఎలా సాధ్యమైంది..?
రాష్ట్రస్థాయిలో నిర్ణయం తీసుకుని.. ఎమ్మెల్సీఅభ్యర్థిని నియమించాలని పార్టీ అధిష్టానం రాష్ట్ర బీజేపీ చీఫ్ పురందేశ్వరికి బాధ్యతలు అప్పగించింది. దీంతో ఆమె ఆదివారం అర్ధరాత్రి వరకు విజయవాడలోని తన నివాసంలో ప్రత్యేక చర్చలు చేపట్టారు. దీనిలో ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఎంపీ సీఎం రమేష్ వంటివారు కూడా పాల్గొన్నారు. దీనికి టికెట్ ఆశిస్తున్న నలుగురు నాయకులు తపన్ చౌదరి, మాధవ్, పాకా సత్యనారాయణ, సోము వీర్రాజు కూడా వచ్చారు. ఎంతకీ ఈ విషయం తెగలేదు.
దీంతో రాత్రికి రాత్రి.. పురందేశ్వరి ఈ విషయం తేల్చడం తన వల్లకాదని.. పేర్కొంటూ కేంద్రంలోని బీజేపీ పెద్దలకు సమాచారం ఇచ్చారు. అదేసమయంలో పోటీలో ఉన్న నలుగురి హిస్టరీని కూడా ఆమె పంపించా రు. ఈ పరిణామమే సోముకు కలిసి వచ్చింది. కేంద్రంలో సోము కు మంచి పేరు ఉండడంతోపాటు.. ఆర్ ఎస్ ఎస్ నాయకుడిగా ఆయనకు ఉన్న ఇమేజ్ కారణంగా.. మరో ముగ్గురి పేర్లను అసలు పరిశీలనకు కూడా తీసుకోకుండానే పార్టీ పెద్దలు సోమును ఖరారు చేసినట్టు సమాచారం. కాగా.. గతంలో ఏపీ బీజేపీ చీఫ్‌గా, మండలిలో సభ్యుడిగా కూడా సోము పనిచేశారు.