Begin typing your search above and press return to search.

కాశ్మీరులో ముందే చేతులెత్తేసిన కమలం ?

జమ్మూ కాశ్మీర్ ని గెలిచి అధికారం చేపట్టాలన్నది బీజేపీ పూర్వ రూపం అయిన జన సంఘ్ నాటి నుంచి ఉన్న కోరిక.

By:  Tupaki Desk   |   18 Sep 2024 3:29 AM GMT
కాశ్మీరులో ముందే చేతులెత్తేసిన కమలం  ?
X

జమ్మూ కాశ్మీర్ ని గెలిచి అధికారం చేపట్టాలన్నది బీజేపీ పూర్వ రూపం అయిన జన సంఘ్ నాటి నుంచి ఉన్న కోరిక. అసలు జమ్మూ కాశ్మీర్ వివాదమే జన సంఘ్ పురుడు పోసుకోవడానికి ఒక ప్రధాన కారణం అని కూడా అంటారు. 1952 ఎన్నికల్లో జనసంఘ్ ఆవిర్భవించి పోటీ చేసింది. అలా చూసుకుంటే బీజేపీ మొత్తం రాజకీయ ప్రస్థానం ఏడు పదులుగా చెప్పాలి.

అలా ప్రాచీనమైన పార్టీగా ఉన్నా బీజేపీ కాశ్మీర్ కోరిక అలాగే ఉంది. కాంగ్రెస్ చాలా సార్లు అధికారం అందుకుంది. కానీ బీజేపీ 2014 లో జమ్మూలో పాతిక సీట్లు గెలిచి పీడీఎఫ్ తో జత కట్టి ఉప ముఖ్యమంత్రి పీఠం దాకా వచ్చింది.

ఈసారి ఆర్టికల్ 370 రద్దు చేశామని కాశ్మీర్ ప్రజలు అంతా తమ వెంటే అని చెప్పుకున్న బీజేపీ జమ్మూలో ఉన్న 43 అసెంబ్లీ సీట్లకు పోటీ పెట్టింది. కానీ కాశ్మీర్ లో ఉన్న 47 సీట్లలో కేవలం 19 చోట్ల మాత్రమే పోటీకి నిలిపింది. మిగిలిన 28 అసెంబ్లీ స్థానాలను అలా వదిలేసింది.

మరి కసిగా కాశ్మీర్ ఎన్నికల్లో పోటీకి దిగిన కమలం ఎందుకు ఇలా ఎన్నికలకు ముందే చేతులు ఎత్తేసింది అన్న చర్చ అయితే అంతటా సాగుతోంది. అయితే కాశ్మీర్ లొ 370 ఆర్టికల్ ఎత్తేసి వారిని భారత్ లో అంతర్భాగం చేసినా కూడా బీజేపీకి రాజకీయంగా అనుకూలత అయితే లేదు అనే అంటున్నారు.

దానికి కారణం స్థానికులు అంతా జమ్మూ కాశ్మీర్ లో స్వీయ పాలననే కోరుకుంటున్నారు అని అంటున్నారు. కాశ్మీర్ లో అత్యధిక శాతం ముస్లిములు ఉన్నారు. వారంతా బీజేపీని వ్యతిరేకిస్తున్నారు అని అంటున్నారు. దాంతో సరైన బలమైన అభ్యర్ధులు బీజేపీకి దొరకలేదని, గెలుపు అవకాశాలు కూడా తక్కువగా ఉన్నాయని అంటున్నారు.

దాంతో ఎక్కువ చోట్ల నిలబెట్టి నామ్ కే వాస్తే అన్నట్లుగా పోటీ చేసి పరువు తీసుకోవడం ఎందుకు అన్న ఉద్దేశ్యంతోనే బీజేపీ కాశ్మీర్ లో కేవలం 19 సీట్లకే పరిమితం అయింది అని అంటున్నారు. దీని మీద కాశ్మీర్ లో ఉండే బీజేపీ నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పోటీ చేసి ఉండాల్సింది అని వారు అంటున్నారు. అయితే అధినాయకత్వం మాత్రం అనవసరం అన్నట్లుగానే సందేశం ఇచ్చింది అని వారు అంటున్నారు.

బలహీనంగా ఉండే చోట్ల పార్టీ పోటీకి పెట్టడం మంచిది కాదు అని భావించే పోటీ చేయడం లేదని బీజేపీ నేతల నుంచి పరోక్షంగా వస్తున్న మాటగా ఉంది. కేవలం ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీజేపీ కాశ్మీర్ లోయలో తన పార్టీ అభ్యర్థులను పోటీకి దించలేదు అని అంటున్నారు.

అదే బీజేపీకి జమ్మూలో బలం ఉంది. అక్కడ పోటీ చేసి రెండు ఎంపీ సీట్లను కైవశం చేసుకుంది. జమ్మూలో హిందువులు ఎక్కువ. బీజేపీకి ఆదరణ కూడా ఎక్కువ. కానీ కాశ్మీర్ లో మాత్రం బీజేపీ మీద జనంలో నిరసనలు ఆందోళనలు అలాగే ఉన్నాయి. భద్రతా బలగాలతో వాటిని ఇంతకాలం అదిమి పట్టి ఉంచినా గ్రౌండ్ లెవెల్ రియాల్టీస్ ఏంటో బీజేపీకి బాగా తెలుసు కాబట్టే కాశ్మీర్ లో పోటీ నుంచి తప్పుకుంది అని అంటున్నారు.

ఇక బీజేపీ అయితే పూర్తి ఆశలు జమ్మూ మీదనే ఉంచుకుంది. కాశ్మీర్ లో వీక్ గా ఉన్నమని అంగీకరిస్తోంది. ఆ పార్టీ నిలబెట్టిన 19 మంది అభ్యర్ధులలో ఏడుగురు గెలుపు గుర్రాలు అవుతారని లెక్క వేసుకుంటోంది. ఇక జమ్మూలో మొత్తం 43 సీట్లకు గానూ అత్యధికం గెలుచుకుంటే కనుక అంటే 35 దాకా గెలిస్తే కాశ్మీర్ లో ఏడు కలుపుకుని 42 దాకా చేరుకోవచ్చునని మ్యాజిక్ ఫిగర్ కి అవసరం అయిన నాలుగు సీట్లను ఇండిపెండెంట్ల ద్వారా సాధించి జమ్మూ అండ్ కాశ్మీర్ లో ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు అన్నది ఒక అంచనాగా చేసుకుంది మరి కాశ్మీర్ లోయలో బీజేపీకి ఏడు సీట్లు వస్తాయా జమ్మూలో 35 సీట్లు గెలుస్తుందా అంటే చూడాల్సిందే. ఇక ఈ నెల 18 నుంచి మూడు విడతలుగా జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఎన్నికలు జరుగ్తున్నాయి.