ఇదో సిత్రం: ఢిల్లీ సీఎం తేలకున్నా.. ప్రమాణస్వీకారం ముహుర్తం ఫిక్స్!
జాతీయ పార్టీలతో వచ్చే తంటా ఇదేనేమో? అసెంబ్లీ ఎన్నికలు పూర్త.. వాటి ఫలితాలు వెల్లడైన తర్వాత కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిని తేల్చేందుకు తీసుకునే సమయం చూసినప్పుడు చిరాకు వచ్చేస్తుంటుంది.
By: Tupaki Desk | 18 Feb 2025 5:45 AM GMTజాతీయ పార్టీలతో వచ్చే తంటా ఇదేనేమో? అసెంబ్లీ ఎన్నికలు పూర్త.. వాటి ఫలితాలు వెల్లడైన తర్వాత కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిని తేల్చేందుకు తీసుకునే సమయం చూసినప్పుడు చిరాకు వచ్చేస్తుంటుంది. డిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడై దగ్గర దగ్గర పది రోజులు పూర్తయ్యాయి. ఇప్పటికి ముఖ్యమంత్రి ఎవరన్నది ఇంకా నిర్ణయించలేదు బీజేపీ అధినాయకత్వం.
ఫలితం వెల్లడైన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటనకు వెళ్లటం.. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ సీఎం ఎంపిక ఆలస్యమవుతుందని చెబుతున్నారు. నిజానికి.. ఎన్నికల ఫలితాల మీద బీజేపీకి నమ్మకం ఉంది. ఈసారి తాము తప్పక విజయం సాధిస్తామన్న ధీమాను ఆ పార్టీ అధినాయకత్వం ప్రదర్శిస్తోంది. అందుకు తగ్గట్లే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు.. ఎన్నికల ఫలితాలు అలానే ఉన్నాయి. అలాంటప్పుడు ఎన్నికల్లో విజయం సాధిస్తే.. ముఖ్యమంత్రిగా ఎవరిని డిసైడ్ చేయాలన్న దానిపై బీజేపీకి క్లారిటీ లేకుండా ఉండదు కదా?
అనూహ్య పరిణామాలు చోటు చేసుకొని.. ముఖ్యమంత్రి ఎంపిక పీటముడి పడినట్లైయితే అదో పద్దతి. ఈ రోజు ఉన్న పరిస్థితికి మోడీషాలు ఎవరిని డిసైడ్ చేస్తే వారే ముఖ్యమంత్రి. పల్లెత్తు మాట అనటానికి.. తమ అభిప్రాయాన్ని ఓపెన్ గా వెల్లడించే పరిస్థితే లేదు. అలాంటప్పుడు ముఖ్యమంత్రిని ఎంపిక చేసి.. ప్రమాణస్వీకారం చేయిస్తే సరిపోతుంది కదా? అలా ఎందుకు జరగదు? అన్నది ప్రశ్న.
ఆసక్తికరమైన అంశం ఏమంటే.. మంగళవారం నాటికి ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న అంశాన్ని నిర్ణయించింది లేదు. కానీ.. ఎంపిక చేయని ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేసే తేదీ.. ముహుర్తం కూడా నిర్ణయించేయటం గమనార్హం. తాజాగా బీజేపీ వర్గాలు వెల్లడిస్తున్న సమాచారం ప్రకారం.. ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారం ఈ నెల 20న (గురువారం) సాయంత్రం 4.30 గంటలకు కొత్త సీఎం ప్రమాణస్వీకారం చేస్తారని ప్రకటించాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు బీజేపీ 48 స్థానాల్ని సొంతం చేసుకోవటం తెలిసిందే. మొత్తంగా చూస్తే.. ముఖ్యమంత్రి ఎవరో డిసైడ్ కాలేదు కానీ.. ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేసే టైం మాత్రం ఫిక్స్ అయ్యిందన్న మాట.