హస్తిన గెలిస్తే బీజేపీకి పట్టపగ్గాలు ఉండవ్ !
భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ. ఆ పార్టీ ఫిలాసఫీ దేశమంతా ఒక్కటిగా ఉండాలని. ఒకే దేశం ఒకే కార్డు.
By: Tupaki Desk | 6 Feb 2025 12:30 AM GMTభారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ. ఆ పార్టీ ఫిలాసఫీ దేశమంతా ఒక్కటిగా ఉండాలని. ఒకే దేశం ఒకే కార్డు. ఒకే ఎన్నిక ఇలా చెబుతూ పోతూ ఆఖరుకు ఒకే పార్టీ ఉండాలని కూడా అంటుందేమో అని అంతా సరదాగా చెప్పుకున్నా బీజేపీ మాత్రం దేశంలో కాంగ్రెస్ మాదిరిగా తాను కూడా ఏకచత్రాధిపత్యంగా ఏలాలన్న ఆశతో అదే ధ్యాసలో ఉండడం జరుగుతోంది.
బీజేపీ ఆకాంక్షలు కూడా కాలం కలిసి వచ్చి ఫలిస్తున్నాయి. దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే అందులో ఇరవై దాకా బీజేపీ దాని మిత్రులవే ఉన్నాయి అంటేనే కమల వికాసం ఎలా ఉందో అర్థం చేసుకోవాల్సి ఉంది. ఇక ఢిల్లీ కోటను బద్ధలు కొట్టాలన్న కమలం కలలు ఈసారి నెరవేరుతాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.
ఢిల్లీ అసెంబ్లీలో 2013 నుంచి పీట వేసుకుని కూర్చున్న ఆప్ ని గద్దె దించడం ఈసారి బీజేపీకి సాధ్యపడుతుందని ఎగ్జిట్ పోల్స్ మెజారిటీ చెబుతున్నాయి. అదే కనుక జరిగితే బీజేపీ ఆశలు నూరు శాతం తీరుతాయి. బీజేపీ ఢిల్లీలో మొదటిసారి చివరి సారి గెలిచింది 1993లోనే. అది కాస్తా 1998తో అధికారం పోయింది.
ఆ తరువాత వచ్చిన కాంగ్రెస్ మూడు సార్లు గెలిచింది. ఆప్ అయితే మరో మూడు సార్లు గెలిచింది. మరి దేశంలోనే బలమైన పార్టీగా చెప్పుకుంటున్న బీజేపీకి తాను ఉన్న చోట అధికారం దక్కకపోవడం ఎంతో బాధగా ఉంది. అయితే ఇపుడు బీజేపీకి మంచి రోజులు వస్తున్నాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఇదే ఎగ్జాక్ట్ పోల్స్ లోనూ జరిగితే మాత్రం బీజేపీ బూర్ల గంపలో పడినట్లే.
ఢిల్లీని బీజేపీ గెలిస్తే చాలా పరిణామాలు దేశంలో జరిగిపోతాయి. ఆప్ అన్న పార్టీని మరింతగా బలహీనం చేసే ప్రక్రియ మొదలవుతుంది. ఒక చిన్న ప్రాంతీయ పార్టీగా పుట్టి ఉత్తరాదిన అనేక ఎన్నికల్లో పోటీ చేస్తూ జాతీయ పార్టీగా ఇటీవలనే గుర్తింపు తెచ్చుకున్న ఆప్ కానీ దాని అధినేత కేర్జీవాల్ కానీ బీజేపీకి పెను సవాల్ గా ఉన్నారు. ఈ విజయంతో ఆప్ ని రాజకీయంగా బాగా తగ్గించేయవచ్చు అన్నది కమలానికి తెలిసిన విద్యనే.
అంతటితో బీజేపీ ఆగుతుందా అన్నదే చర్చ. దేశంలోని ఇతర ప్రాంతీయ పార్టీల విషయంలోనూ బీజేపీ ఇదే రకమైన వ్యూహాలను అనుసరిస్తే అపుడు ఏమి జరుగుతుంది అన్నది చర్చ. తెలుగు నాట చూస్తే క రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీని చిదిమేయాలన్న పధక రచన సాగుతోంది. అయితే దాని విషయంలో ఇతర ప్రాంతీయ పార్టీలు ఇదే బాగుందని సంతోషిస్తే మాత్రం వాటి పరిస్థితి కూడా తరువాత కాలంలో ఇలాగే ఉంటుందని అంటున్నారు.
తెలుగు రాజకీయాలు బీజేపీకి ఇపుడు బాగా అనుకూలిస్తున్నాయని అంటున్నారు. అంతా ప్రత్యక్షంగానో పోరోక్షంగానో సహకరించడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. నిలబడి కలబడి ఎదిరించిన ఆప్ కే బీజేపీ ఢిల్లీ ఎన్నికల తరువాత వెనక బెంచీ దారి చూపిస్తే ఇక మిగిలిన పార్టీల సంగతి గతి ఏమవుతుంది అన్నదే చర్చ. ఏది ఏమైనా బీజేపీ ఇప్పటికే హర్యానా మహారాష్ట్ర గెలిచి మంచి ఊపు మీద ఉంది. తనకు కల లాంటి ఢిల్లీని గెలిచి వస్తే మాత్రం ఆ పార్టీకు పగ్గాలే ఉండవన్నది నిజమవబోయే విషయమే అంటున్నారు. మరి తినబోతూ రుచి ఎందుకు. వెయిట్ అండ్ సీ.