ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి షాకింగ్ ఫలితాలు ?
దేశంలో బీజేపీ నాయకత్వంలో మూడవసారి ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వం పాలనకు ఎనిమిది నెలలు నిండాయి.
By: Tupaki Desk | 13 Feb 2025 3:33 AM GMTదేశంలో బీజేపీ నాయకత్వంలో మూడవసారి ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వం పాలనకు ఎనిమిది నెలలు నిండాయి. ఇదే సమయంలో పలు రాష్ట్రాల ఎన్నికలు జరిగితే అందులో మెజారిటీ స్టేట్స్ బీజేపీ గెలుచుకుంది. తాజాగా ఢిల్లీ విజయంతో బీజేపీ గెలుపు గుర్రం హద్దులు లేని వేగంతో ప్రయాణిస్తోంది. రానున్న బీహార్ కానీ యూపీ పశ్చిమ బెంగాల్ కానీ ఇదే తీరున చరిత్ర సృష్టించాలని బీజేపీ ఉవ్విళ్ళూరుతోంది.
ఈ నేపధ్యంలో ఇండియా టుడే సీ ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ నిర్వహించిన పోల్ చూస్తే బీజీపీకే షాక్ తినేలా ఫలితాలు వచ్చాయి. ఏ మెజారిటీ అయితే లేకుండా టీడీపీ జేడీయూ అన్న రెండు ఊతకర్రల మీద అధారపడి బీజేపీ కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని నడుపుతోందో ఆ బీజెపీకి కరవు తీరా పూర్తి మెజారిటీని ఇపుడు ఇచ్చేందుకు దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఈ సర్వే నివేదిక చెబుతోంది.
ఇప్పటికిపుడు ఎన్నికలు జరిగితే కనుక బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయేకు 300 పై చిలుకు ఎంపీ సీట్లు దక్కుతాయని ఇండియా టుడే సీ ఓటర్ మూడ్ ఆఫ్ ద నేషన్ పోల్ తెలియచేస్తోంది. బీజేపీకి సొంతంగా 281 సీట్లు లభిస్తాయని చెప్పింది. అంటే 2024 ఎన్నికల్లో 240 దగ్గర ఆగిపోయిన బీజేపీ మరో 41 సీట్లను కేవలం ఈ ఎనిమిది నెలలలో పెంచుకుంది అన్న మాట. అదే ఎన్డీయే మిత్రులతో కలిస్తే 343 సీట్లు దక్కుతాయి. ప్రస్తుతం ఎండీయేకు లోక్ సభలో 293 సీట్లు మాత్రమే ఉన్నాయి. అంటే మరో యాభై సీట్లు అదనంగా వస్తాయని ఈ పోల్ సర్వే తేల్చింది.
అంతే కాకుండా ఎండీయే ఓటు షేర్ 2024 కంటే మరో మూడు సాతం పెరిగి 47 శాతంగా వస్తుందని పేర్కొంది. ఇండియా కూటమికి ఒక శాతం ఓటు షేర్ తగ్గి సీట్లు కూడా 2024లో వచ్చిన 232 సీట్ల నుంచి 188కి పడిపోతుందని సర్వే వెల్లడించింది. కాంగ్రెస్ కి 2024లో 99 సీట్లు సొంతంగా వచ్చాయి. అవి కూడా ఏకంగా 78కి పడిపోతాయని చెప్పింది.
జనవరి 2 నుంచి ఫిబ్రవరి 9 మధ్యలో జరిపిన ఈ పోల్ సర్వేలో దేశవ్యాప్తంగా వివిధ కేటగిరీలకు చెందిన ఓటర్లు 1, 23, 123 మంది పాల్గొని తన అభిప్రాయాలను ఈ విధంగా వెల్లడించారు. దేశంలో కమలం హవా నానాటికీ పెరుగుతోందని ఇండియా కూటమి సహా కాంగ్రెస్ గాలి తగ్గుతోందని ఈ లేటెస్ట్ పోల్ సర్వే వ్యక్తం చేయడంతో రాజకీయంగా ఇది చర్చకు తావిస్తోంది. బీజేపీకి మూడు చాన్సులే కాదు మరిన్ని చాన్సులు దేశ ప్రజలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ఈ సర్వే చెబుతూంటే జమిలి ఎన్నికలకు కమలనాధులు సిద్ధం కాకుండా ఉంటారా అన్నదే చర్చగా ఉంది.