సోము వీర్రాజు.. ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ.. చంద్రబాబు పక్కలో బల్లెం!
ఎమ్మెల్యేల కోటాలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం సులువుగా గెలుచుకోనున్న అన్ని సీట్లకూ అభ్యర్థులు ఖరారయ్యారు.
By: Tupaki Desk | 10 March 2025 11:10 AM ISTనామినేషన్లకు చివరి రోజైన సోమవారం (మార్చి 10)తో ఏపీలో ఐదో ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరో తేలిపోయింది. ఎమ్మెల్యేల కోటాలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం సులువుగా గెలుచుకోనున్న అన్ని సీట్లకూ అభ్యర్థులు ఖరారయ్యారు. కూటమి పెద్దన్న టీడీపీ మూడు స్థానాలతో సరిపెట్టుకోగా.. జనసేన, బీజేపీ చెరోటి పొందాయి. అయితే, ఇందులో బీజేపీనే అనూహ్యంగా ఒక సీటును పొందడం గమనార్హం.
ఆ పార్టీ తమ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత సోము వీర్రాజును ఖరారు చేసింది. చివరి రోజు కావడంతో సోమవారం ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. జనసేన తరఫున ఇప్పటికే ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు నామినేషన్ వేశారు. టీడీపీ ఆదివారం ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బీద రవిచంద్ర, కావలి గ్రీష్మ, బీటీ నాయుడులకు అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే.
బాబు బద్ధ విరోధి
ఏపీ బీజేపీ ఎమ్మెల్సీగా సోమును ఎంపిక చేయడం ద్వారా చంద్రబాబుకు బీజేపీ ఒక రకంగా షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఏపీ బీజేపీలో చంద్రబాబును తీవ్రంగా వ్యతిరేకించేది వీర్రాజు. 2014-19 మధ్య ప్రభుత్వంలో భాగం అయినప్పటికీ ఆయన తన వ్యతిరేకతను దాచుకోలేదని అంటారు. మరోవైపు చంద్రబాబుకు చెక్ పెట్టేందుకే బీజేపీ సోమును ఏరికోరి ఎంపిక చేసిందా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు.
ఇక ఏపీ 5 ఎమ్మెల్సీల్లో రెండు కాపు వర్గానికే దక్కడం గమనార్హం. అయితే, ఒకటి జనసేన నుంచి, రెండోది బీజేపీ నుంచి. సోము వీర్రాజు కాపు సామాజిక వర్గం వారే. వాస్తవానికి వంగవీటి రాధాను టీడీపీ ఎమ్మెల్సీ చేస్తుందని భావించారు. అయితే, అదే కాపు సామాజిక వర్గానికి చెందిన నాగబాబును ఎమ్మెల్సీ చేయడంతో రాధాకు దారులు మూసుకుపోయాయని అంటున్నారు. కానీ, బీజేపీ మాత్రం కాపు నాయకుడినే ఎమ్మెల్సీ చేయడం గమనార్హం.