కేసీఆర్ కి అర్ధం అయింది....జగన్ కి అర్ధమవుతోందా ?
దేశంలో ప్రాంతీయ పార్టీలు పెద్ద ఎత్తున పుట్టుకుని రావడానికి కారణం కాంగ్రెస్ అయితే వాటిని నెమ్మదిగా బలహీనం చేయడమే బీజేపీ టార్గెట్ గా ఉంది.
By: Tupaki Desk | 27 March 2025 1:30 AMతెలుగు నాట బలంగా వేళ్ళూనుకోవాలని జాతీయ పార్టీ బీజేపీ భావిస్తోంది. బీజేపీకి ప్రాంతీయ పార్టీలు అవరోధంగా ఉంటున్నాయి. దేశంలో ప్రాంతీయ పార్టీలు పెద్ద ఎత్తున పుట్టుకుని రావడానికి కారణం కాంగ్రెస్ అయితే వాటిని నెమ్మదిగా బలహీనం చేయడమే బీజేపీ టార్గెట్ గా ఉంది. యూపీలో బీఎస్పీ పూర్వం ప్రభావాన్ని చూపించలేకపోతోంది.
ములాయం సింగ్ యాదవ్ ఉన్నప్పటి కంటే అఖిలేష్ యాదవ్ నాయకత్వంలో సమాజ్ వాద్ పార్టీ అంత బలంగా కనిపించడం లేదు అని అంటున్నారు. వరసగా రెండు సార్లు ఆ పార్టీని విపక్షంలో కూర్చోబెట్టేసింది బీజేపీ. ఇక ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ పార్టీని నిన్నటి ఎన్నికల్లో ఓడించింది. మహారాష్ట్రలో బాల్ థాక్రే కాలంలో పులిలా ఉన్న శివసేనను బొమ్మ పులిగా మార్చేసింది బీజేపీ. మరాఠా యోధుడిగా ముద్రపడిన శరద్ పవార్ పార్టీ ఎన్సీపీని వీక్ చేసి పారేసింది.
పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ ని కూడా గట్టిగానే టార్గెట్ చేస్తోంది. బీహార్ లో ఆర్జేడీని ఈసారి అధికారంలోకి రానీయకుండా చేయడానికి సర్వశక్తులు ఒడ్డుతోంది. కర్ణాటకలో జేడీఎస్ రాజకీయం పలచబడిపోయి బీజేపీ పొత్తులో ఉంది. తమిళనాడులో చూస్తే బలమైన డీఎంకే మీద ఇపుడు కమలం పార్టీ ఫుల్ ఫోకస్ పెట్టేసింది.
ఇక తెలుగు నాట చూస్తే అత్యంత బలంగా ఉన్న తెలుగుదేశాన్ని మిత్రపక్షంగా చేసుకుంది. జనసేనను నమ్మకమైన నేస్తంగా మార్చుకుంది. ఇపుడు తక్షణ కర్తవ్యం రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న బీఆర్ఎస్ వైసీపీలను వీక్ చేయడం. అపుడే ఆ పొలిటికల్ స్లాట్ లోకి బీజేపీ రాగలుగుతుంది అన్న విశ్లేషణలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలోనే ఈ మధ్య బీఆర్ఎస్ నుంచి రెండు కీలక పరిణామాలు సంభవించాయని అంటున్నారు. అందులో మొదటిది చెన్నైలో జరిగిన ఇండియా కూటమి కీలక భాగస్వామి అయిన డీఎంకే నిర్వహించిన డీలిమిటేషన్ మీటింగ్ కి బీఆర్ఎస్ హాజరైంది. ఆ విధంగా బీజేపీ వ్యతిరేక కూటమిలో చేరినట్లుగా సంకేతాలు ఇచ్చింది.
మరో వైపు చూస్తే కేసీఆర్ బీజేపీని నేరుగా విమర్శించకుండా పొత్తుల గురించి చంద్రబాబు మీద విమర్శలు చేశారు. పొత్తులతో ఆయన ఏపీలో గెలిచారు అని సెటైర్లు వేశారు. దీని పరమార్ధం ఏంటి అంటే తెలంగాణాలో ఎన్డీయే కూటమి కడితే టీడీపీని టార్గెట్ చేయడం ద్వారా సెంటిమెంట్ అస్త్రాన్ని తీస్తామని పరోక్షంగా బీజేపీకి చెప్పడమే అని అంటున్నారు.
ఒక విధంగా చూస్తే కేసీఆర్ బీజేపీ రాజకీయ అవకాశాలను ఆశలను సరిగ్గానే అర్ధం చేసుకుని తగినట్లుగా వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు. మరి అదే ఏపీలో చూస్తే వైసీపీ అధినాయకత్వం ఏ విధంగా బీజేపీ విషయంలో ఆలోచిస్తోంది అన్నది అర్ధం కావడంలేదు అనే అంటున్నారు.
ఏపీలో చూస్తే కనుక ఎన్డీయే కూటమి బలంగా ఉంది. ఎంతలా అంటే 2029లో కూడా ఇవే పొత్తులను కొనసాగించేలా. మరి వైసీపీకి ఇంకా బీజేపీ మీద ఆశలు ఉన్నాయా అన్నదే ఒక చర్చగా ఉంది. స్టాలిన్ చెన్నైలో నిర్వహించిన మీటింగ్ కి వైసీపీ వెళ్ళలేదు. ఆ విధంగా వైసీపీ ఏ విధమైన సంకేతాలు ఇచ్చింది అన్నది కూడా రాజకీయ విశ్లేషణలు చేస్తున్నారు.
బీజేపీ ఒకేసారి అటు కేసీఆర్ ఇటు జగన్ లను టార్గెట్ గా చేసుకుని పావులు కదుపుతోంది అని అంటున్నారు. బీఆర్ఎస్ అయితే ఇండియా కూటమి వైపే అన్నట్లుగా సంకేతాలు ఇచ్చింది. వైసీపీ ఎటూ తేల్చుకోలేకపోతోంది అని అంటున్నారు. ఇపుడు లిక్కర్ స్కాం విషయంలో కనుక బీజేపీ మార్క్ యాక్షన్ స్టార్ట్ అయితే కచ్చితంగా వైసీపీకి అన్నీ అర్ధం అవుతాయని అంటున్నారు. చూడాలి మరి కేంద్రం ఈ విషయంలో ఎలా ముందుకు అడుగులు వేస్తుందో. వైసీపీ న్యూట్రల్ స్టాండ్ వెనక ఏ రకమైన అర్ధాలు ఉన్నాయన్నది కూడా తెలుస్తుంది అని అంటున్నారు.