Begin typing your search above and press return to search.

కాశ్మీర్ కి రాష్ట్ర హోదా....కొత్త ఎత్తుగడలో బీజేపీ ?

కేంద్రంలో బీజేపీ జమ్మూ కాశ్మీర్ విషయంలో ఏ రాత రాయనుంది అన్నదే ఇపుడు అంతటా ఆసక్తికరంగా సాగుతున్న చర్చ.

By:  Tupaki Desk   |   30 Oct 2024 6:30 AM GMT
కాశ్మీర్ కి రాష్ట్ర హోదా....కొత్త ఎత్తుగడలో బీజేపీ ?
X

కేంద్రంలో బీజేపీ జమ్మూ కాశ్మీర్ విషయంలో ఏ రాత రాయనుంది అన్నదే ఇపుడు అంతటా ఆసక్తికరంగా సాగుతున్న చర్చ. దేవుడు అందరి రాతలు రాస్తారు కానీ జమ్మూ అండ్ కాశ్మీర్ రాత మాత్రం అచ్చంగా కమలనాధులే రాయాల్సిన అవసరం ఉంది. వారి చేతిలోనే అది ఉంది.

బీజేపీ పెద్దలు తలచుకుంటే జమ్మూ అండ్ కాశ్మీర్ దేశంలో 29వ రాష్ట్రంగా మళ్లీ చేరుతుంది. లేదూ అనుకుంటే కంద్ర పాలిత ప్రాంతాల పక్కన నిలబడుతుంది. ఇదిలా ఉంటే ఇటీవలే జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఎన్నికలు ముగిసాయి. నేషనల్ కాన్ఫరెన్స్ ప్లస్ కాంగ్రెస్ కూటమి అక్కడ అధికారం చేపట్టింది.

కొత్త ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా బాధ్యతలు స్వీకరించారు. ఆయన తొలి ప్రసంగంలోనే జమ్మూ అండ్ కాశ్మీర్ కి రాష్ట్ర ప్రతిపత్తిని సాధిస్తామని చెప్పారు. అంతే కాదు 370 ఆర్టికల్ ని పునరుద్ధరిస్తామని కూడా అన్నారు. ఆ మాట చాలా పెద్దది. అది జరిగేది అయితే కాదు అని తెలిసిందే.

ఎన్నికల హామీగా దానిని జనంలో ఉంచి నేషనల్ కాన్ఫరెన్స్ భారీగా సీట్లను గెలుచుకుంది. నేషనల్ కాన్ఫరెన్స్ తో పొత్తు పెట్టుకుని కూడా కాంగ్రెస్ అయితే ఈ విషయంలో ఎలాంటి క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. మరి ఇండియా కూటమి 2029లో అధికారంలోకి వస్తే అపుడు కాంగ్రెస్ ఏమైనా చేయగలదేమో కానీ ఇపుడు అయితే ఏమీ చేయలేదు. అందుకే ఆ పార్టీ ఈ హామీ విషయంలో ఏమీ మాట్లాడలేదు కూడా.

మరో వైపు చూస్తే ఒమర్ అబ్దులా గతంలో సీఎం గా చేశారు. అపుడు ఆయనకు అపరిమితమైన అధికారాలు ఉన్నాయి. 370 ఆర్టికల్ ఉంది. స్వయంప్రతిపత్తి కలిగిన రాష్ట్రంగా కాశ్మీర్ ని ఆయన ఒక్క లెక్కన ఏలారు. ఇపుడు ఆయనకు కొంత ఇబ్బందికరంగానే ఉంది.

అయితే ఆయన ముందు రాష్ట్ర హోదా సాధిస్తే సీఎం గా తన ఇమేజ్ బాగా పెరుగుతుందని భావిస్తున్నారు. అందుకే ఆయన ఢిల్లీకి వచ్చి ప్రధాని నరేంద్ర మోడీని హోం మంత్రి అమిత్ షాను కలిశారు. కేంద్ర పెద్దలు ఇద్దరితోనూ ఆయన జరిపిన మంతనాలు చూస్తే ఆయన మీడియా మీటింగులో మాట్లాడిన తరువాత ఆయనలో ఆశలు పెరిగాయి. ధీమా కూడా కలిగింది.

తొందరలో కాశ్మీర్ కి రాష్ట్ర హోదా దక్కుతుందని ఒమర్ అబ్దుల్లా అంటున్నారు. ఈ విషయంలో కేంద్ర పెద్దలు సుముఖంగా ఉన్నారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఒమర్ అబ్దుల్లా మాటలను బట్టి చూస్తే ఆయన ఢిల్లీ టూర్ ఈ విధంగా సక్సెస్ అయినట్లే అనుకోవాలి.

అయితే కేంద్ర బీజేపీ పెద్దలు ఆ దిశగా ఆలోచిస్తున్నారా అన్నదే చర్చగా ఉంది. ఎందుకంటే జమ్మూ అండ్ కాశ్మీర్ లో తానే గెలిచి పాలించాలని బీజేపీ గట్టిగా భావించింది. బీజేపీని జమ్మూ ఆదరించింది. కాశ్మీర్ లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది.

మరో వైపు చూస్తే కేంద్ర పాలిత ప్రాంతంగా జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంటే కేంద్రం నియమించిన లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా ఇండైరెక్ట్ గా పాలన సాగించవచ్చు. మరి ఈ మంచి అవకాశాన్ని బీజేపీ వదులుకుని నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమికి మేలు చేస్తుందా అన్నదే కీలక పాయింట్. మరో వైపు రాష్ట్ర హోదా ఇచ్చి పూర్తి అధికారాలు నేషనల్ కాన్ఫరెన్స్ కి ఇస్తే ఉగ్ర వాదులు మళ్లీ వీర విహారం చేస్తారు అన్నది కూడా కేంద్రానికి అనుమానం ఉంది అని అంటున్నారు

ఇవన్నీ ఇలా ఉంటే కాశ్మీర్ ప్రజల మద్దతుని రాజకీయంగా గెలుచుకునేందుకు రాష్ట్ర హోదా ఇవ్వవచ్చు అని అంటున్నారు ఏనాటికి అయినా జమ్మూ అండ్ కాశ్మీర్ లో అధికారంలోకి రావాలీ అంటే కాశ్మీర్ ప్రజల మద్దతు అవసరం. దాంతో రాష్ట్ర ప్రజల కోరికగా మన్నించవచ్చు అని అంటున్నారు. బహుశా మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికలు పూర్తి అయిన తరువాత కేంద్రం నుంచి కీలక ప్రకటన వెలువడవచ్చు అని అంటున్నారు.