ఇక బీజేపీ క్రిష్ణయ్యగా...!
బీజేపీ దేశవ్యాప్తంగా రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఆ లిస్ట్ లో ఏపీ కోటా నుంచి ఆర్ క్రిష్ణయ్య పేరుని ఖరారు చేశారు.
By: Tupaki Desk | 9 Dec 2024 11:23 AM GMTబీజేపీ దేశవ్యాప్తంగా రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఆ లిస్ట్ లో ఏపీ కోటా నుంచి ఆర్ క్రిష్ణయ్య పేరుని ఖరారు చేశారు. మొత్తం మూడు రాష్ట్రాల నుంచి బీజేపీ అభ్యర్థుల జాబితాని పార్టీ విడుదల చేసింది.
ఇందులో ఒడిషా నుంచి సుజీత్ కుమార్, హర్యానా నుంచి రేఖా శర్మను బీజేపీ ఎంపిక చేసింది. ఏపీ నుంచి ఆర్ క్రిష్ణయ్య పేరును కమలం పార్టీ ఖరారు చేసింది. రాజ్యసభకు సంబంధించి నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈ నెల 10 చివరి తేదీ కావడంతో ఆర్ క్రిష్ణయ్య రేపు తన నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు
ఇదిలా ఉంటే ఆర్ క్రిష్ణయ్య బీసీల కోసం దశాబ్దాలుగా పోరాటం చేస్తూ వచ్చారు. ఆనాడు ఏ పార్టీ అన్నది చూడకుండా ఉద్యమిస్తూ వచ్చారు. అయితే 2014 సమయంలో ఆయన టీడీపీలో చేరి రాజకీయాల వైపు అడుగులు వేశారు. అలా టీడీపీ ఎమ్మెల్యే అయ్యారు. టీడీపీ అప్పట్లో గెలిస్తే బీసీ సీఎం గా కూడా ఆయన ప్రొజెక్ట్ చేయబడ్డారు.
ఇక టీడీపీ ఓటమి పాలు కావడంతో ఆయన అసెంబ్లీలో పెద్దగా యాక్టివ్ కాలేకపోయారు. 2018 నాటికి కాంగ్రెస్ లో చేరారు. ఇక ఆ తరువాత ఆయన 2019 ఎన్నికలలో వైసీపీకి మద్దతుగా ఏపీలో బీసీలను కూడగట్టే ప్రయత్నం చేశారు. దానికి బదులు అన్నట్లుగా ఆయనకు వైసీపీ 2022లో రాజ్యసభకు నామినేట్ చేసింది. 2024లో వైసీపీ ఓటమి పాలు కావడంతో వైసీపీ నుంచి ఇద్దరు ఎంపీలు ఆగస్టులో రాజీనామా చేశారు.
అయితే ఏ హడావుడి లేకుండా చాలా సైలెంట్ గా తన రాజీనామాను ప్రకటించి వైసీపీ అధినాయకత్వానికి షాక్ ఇచ్చారు. ఆయన రాజీనామా సంగతి వైఎస్ జగన్ కి కూడా తెలియచేయలేదని చెబుతారు. అయితే రాజ్యసభకు రాజీనామా చేశాక ఆర్ క్రిష్ణయ్య మీడియాతో అన్నది ఏంటి అంటే తాను బీసీల కోసం ఉద్యమిస్తానని అందుకే ఈ విధంగా ఎంపీ పదవిని వదులుకున్నాను అని. అదే సమయంలో బీసీలు కొత్త పార్టీని పెట్టమని కోరుతున్నారని కూడా ఆయన చెప్పారు.
ఇలా ఆయన ఎంపీగా తాను ఉండడం కంటే జనంలో ఉంటూ బీసీల సమస్యల మీద ఉద్యమించడం మంచిదని భావించే తన పదవిని వదులుకుంటున్నాను అని చెప్పారు. కట్ చేస్తే ఆయన పేరు బీజేపీ జాబితాలో ఉంది. దాంతో ఆయన తన రాజీనామా కంటే ముందు బీజేపీ పెద్దలకు టచ్ లోకి వచ్చి వారి ఆలోచనలన మేరకే ఈ రాజీనామాను చేశారు అని అంటున్నారు.
అంతే కాదు తన వల్ల ఖాళీ అయిన సీటులో తిరిగి తనకే ఇవ్వాలని ఆయన అడిగి మరీ రాజీనామా చేసి ఉంటారని అందుకే ఆయన పేరునే బీజేపీ ప్రకటించిందని అంటున్నారు. తెలంగాణాకు చెందిన ఆర్ క్రిష్ణయ్య సేవలను రానున్న కాలంలో అక్కడ ఉపయోగించుకోవాలని కమలం పార్టీ భావిస్తోందని అందుకే ఆయనను ఏపీ కోటాలో ఎంపిక చేసిందని అంటున్నారు.
ఇవన్నీ పక్కన పెడితే బీసీల సమస్యల మీద నిబద్ధత కలిగిన ఆర్ క్రిష్ణయ్య తన ఎంపీ పదవికి రాజీనామా చేసిన విషయంలో కానీ నాడు ఆయన మీడియా ముందు చెప్పిన మాటలు కానీ ఇపుడు ఆయన పేరు బీజేపీ జాబితాలో ఉండడం కానీ చూస్తే ఆయన కూడా రాజకీయ నేతగా మారిపోయారా అన్న చర్చ అయితే సాగుతోంది.
ఎక్కడో తెలంగాణాకు చెందిన క్రిష్ణయ్యకు ఏపీకి పిలిచి టికెట్ ఇవ్వడం వైసీపీ అధినాయకత్వం చేసిన తప్పిదమా అని ఆ పార్టీలోనూ చర్చ సాగుతోంది. ఇక వైసీపీ ఓడిన పార్టీ కాబట్టి ఆ పార్టీ తరఫున రాజ్యసభలో తాను ఎంపీగా ఉండడం కరెక్ట్ కాదని అధికార బీజేపీ వైపు క్రిష్ణయ్య మళ్ళిపోయారా అన్నది మరో చర్చగా ఉంది.
ఏది ఏమైనా జగన్ నిర్ణయాలు చాలా సార్లు రాంగ్ అని తేలుతాయని అంటారు. అందులో ఈ డెసిషన్ కూడా ఉందా అనన్ చర్చ అయితే సాగుతోంది. మొత్తానికి బీసీల పెద్దగా ఉద్యమకారుడిగా ఆర్ క్రిష్ణయ్యను ఏపీ తరఫున గౌరవించి రాజ్యసభకు పంపిస్తే ఆయన సైతం మిగిలిన రాజకీయ నేతల మాదిరిగానే వ్యవహరించారా అన్నదే చర్చగా ఉంది. దానికి సరైన సమాధానం ఆర్ క్రిష్ణయ్య మాత్రమే ఇవ్వగలరని అంటున్నారు.