రంజాన్ వేళ మోడీ తోఫా లెక్కేంటి?
ప్రతి మసీదు పరిధిలో వంద నిరుపేద ముస్లిం కుటుంబాలను గుర్తించి.. ఈ గిఫ్టు ప్యాక్ ను అందజేస్తారు.
By: Tupaki Desk | 26 March 2025 4:16 AMమీరు చదువుతున్నది నిజమే. అందుకే అంటారు రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని. కరుడుగట్టిన హిందుత్వవాదులు.. మోడీ భక్తులు మామూలుగా అయితే రంజాన్ కు మైనార్టీలకు తోఫాలేంటి? ఇఫ్తార్ విందులు ఏమిటి? అంటూ ప్రశ్నిస్తారు. అలాంటిది బీజేపీనే స్వయంగా ఒక మెగా కార్యక్రమాన్ని నిర్వహించటం.. ఇందులో భాగంగా మైనార్టీలకు మోడీ తోఫాను అందిస్తున్న వైనం ఆసక్తికరంగా మారింది. సౌగాత్ ఎ మోదీ పేరుతో రంజాన్ పండుగ రోజుల్లో వివిధ వస్తువులతో కూడిన కిట్ ను అందజేయాలని నిర్ణయించిన వైనం ఆసక్తికరంగా మారింది.
సేమియా.. ఖర్జూరం.. డ్రైఫ్రూట్స్.. పంచదార మాత్రమే కాదు మహిళలకు అవసరమైన కుర్తా - పైజమా లేదంటే సల్వార్ కమీజ్ లాంటి దుస్తులు ఉన్నాయి. రంజాన్ సందర్భంగా దేశ వ్యాప్తంగా 32 లక్షల మంది పేద ముస్లింలకు ఈ కిట్ లను అందజేయాలన్న లక్ష్యాన్ని బీజేపీ పెట్టుకుంది. ఇంత భారీగా రంజాన్ తోఫాను పంపిణీ చేసేందుకు దేశంలోని 32 వేల మసీదుల సహకారం తీసుకోనున్నట్లు చెబుతున్నారు.
ప్రతి మసీదు పరిధిలో వంద నిరుపేద ముస్లిం కుటుంబాలను గుర్తించి.. ఈ గిఫ్టు ప్యాక్ ను అందజేస్తారు. మసీదు కమిటీ సహాయంతో లబ్థిదారుల్ని గుర్తిస్తారు. ఈ మెగా కార్యక్రమాన్ని మొదట ముంబయిలోని పార్టీ మైనార్టీ మోర్చా చొరవతో నవీ ముంబయిలో 200 మంది పేదల్ని గుర్తించి ఈ కిట్ లను ఇవ్వనున్నారు. అయితే.. ఈ కార్యక్రమం మీద ఇప్పుడు చర్చ మొదలైంది. మైనార్టీల మీద ఇంత ప్రేమ ఎందుకు మొదలైంది?అన్నది చర్చగా మారింది.
తాజా తోఫా వెనుక బిహార్ ఎన్నికలే అసలు కారణంగా చెబుతున్నారు. బిహార్ లో 16-17 శాతం ముస్లింలు ఉన్న నేపథ్యంలో.. ప్రభుత్వ ఏర్పాటులో వారు పలు జిల్లాల్లో కీలకంగా మారనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి తెర తీసినట్లుగా పేర్కొంటున్నారు. నిజాంగానే.. బిహార్ కు బహుమతి ఇవ్వాలనుకుంటే వలసల్ని అడ్డుకోవాలని.. స్థానికంగా ఉద్యోగాల్ని కల్పించాలని చెబుతున్నారు. ఏమైనా.. మైనార్టీలకు బహుమతులు అందించాలన్న ఆలోచన మారుతున్న బీజేపీ వైఖరికి నిదర్శనమన్న మాట వినిపిస్తోంది.