ఢిల్లీలో చంద్రబాబు పవన్
ఈ ప్రమాణ స్వీకారానికి ఎండీయే మిత్రపక్షాల పార్టీలు ముఖ్యమంత్రులు ప్రత్యేక అతిధులుగా హాజరవుతున్నారు.
By: Tupaki Desk | 19 Feb 2025 5:19 PM GMTబీజేపీకి దాదాపుగా 27 ఏళ్ళ తరువాత ఢిల్లీ పీఠం దక్కింది. దాంతో ఆ పార్టీ విజయోత్సాహం అంతా ఇంతా కాదు. బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారాన్ని ఈ నెల 20న పెద్ద ఎత్తున నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లను చేసింది. ఈ ప్రమాణ స్వీకారానికి ఎండీయే మిత్రపక్షాల పార్టీలు ముఖ్యమంత్రులు ప్రత్యేక అతిధులుగా హాజరవుతున్నారు.
అలాగే బీజేపీ ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు కూడా తరలి వస్తున్నారు. బీజేపీకి చెందిన అతిరధ మహారధులు అంతా అక్కడ కనిపించబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాల సమక్షంలో ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా పదవీ ప్రమాణం చేయనున్నారు.
ఇదిలా ఉంటే ఢిల్లీకి ఒక రోజు ముందుగానే తెలుగుదేశం అధినేత ఏపీ సీఎం చంద్రబాబు చేరుకోవడం విశేషం. ఆయన బుధవారమే ఢిల్లీ బాట పట్టారు. మరో వైపు చూస్తే జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉత్తరప్రదేష్ లోని ప్రయాగ్ రాజ్ వద్ద కుంభమేళాకు వెళ్ళారు. అక్కడ పుణ్య స్నానాలు ఆచరించిన తర్వాత అక్కడ నుంచి నేరుగా ఢిల్లీకి చేరుకున్నట్లుగా సమాచారం.
అంటే పవన్ రెండు రోజులు ముందుగానే ఢిల్లీకి చేరుకున్నారు అన్న మాట. బీజేపీ కేంద్ర నాయకత్వానికి ఈ ఇద్దరూ కూడా అత్యంత కీలకమైన వారు. బాగా కావాల్సిన వారు అన్నది తెలిసిందే. దాంతో వీరికి ప్రత్యేక ఆహ్వానాలు అందాయి. దాంతో ఈ ఇద్దరూ కూడా ఈ ప్రమాణ స్వీకార ఘట్టంలో ప్రత్యేక ఆకర్షణ కాబోతున్నారు.
మరో వైపు చూస్తే ఢిల్లీ ఈ ఇద్దరు నేతలూ బీజేపీ పెద్దలతో భేటీలు వేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. బీజేపీ కూడా ఎన్డీయే మిత్రులకు పెద్ద పీట వేస్తోంది. మరో వైపు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఈ ఢిల్లీ టూర్ ని ఏపీ కోసం కూడా వాడుకోవాలని చూస్తున్నారు. ఆయన కేంద్ర మంత్రులను వీలు వెంబడి కలసి వారితో ఏపీ సమస్యలను ప్రస్తావిస్తారని అంటున్నారు.
ఇంకో వైపు చూస్తే ఎన్డీయే మిత్రులతో కీలక సమావేశం కానీ ఇష్టాగోష్టి మీటింగ్ కానీ బీజేపీ పెద్దలు నిర్వహిస్తారా అన్న చర్చ కూడా ఉంది. ఏది ఏమైనా ఢిల్లీలో మాత్రం ఏపీకి చెందిన ఇద్దరు తెలుగు నాయకులు ఇపుడు అందరినీ ఆకట్టుకుంటున్నారు. బీజేపీ విజయంలో చంద్రబాబు పాత్ర కూడా కీలకమని చెప్పాలి. ఆయన ఢిల్లీ ఎన్నికలలో తెలుగు వారు నివసించిన ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. బాబు ప్రచారం చేసిన చోటల్లా బీజేపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఆ విధంగా బాబు పవన్ ఇద్దరూ బీజేపీకి ఎంతో ముఖ్యమని చెప్పాల్సి ఉంది.