అరబ్బుల ఒంటె - బీజేపీ రాజకీయం.. రెండూ ఒక్కటే ..!
ఈ క్రమంలో తమకు సహకరించిన పార్టీలు .. తమతో కలిసి వచ్చిన పార్టీలను కూడా తనలో కలిపేసుకుంటుంది.
By: Tupaki Desk | 7 March 2025 3:00 AM ISTబీజేపీ రాజకీయ వ్యూహాలు భిన్నంగా ఉంటాయి. ఒకరకంగా.. అరబ్బుల 'ఒంటె' సామెత గుర్తుకు వస్తుంది. ముందు తల దాచుకునేందుకు చోటు సంపాయించుకుని.. తర్వాత.. పూర్తిగా గుడారాన్ని ఆక్రమించినట్టు గా బీజేపీ దేశవ్యాప్తంగా రాజకీయాలు చేస్తుంది. ముందుగా చాలా నిదానమైన అడుగులు వేస్తుంది. అనంతరం.. నడక ప్రారంభించి.. తర్వాత.. పరుగులు పెడుతుంది. ఈ క్రమంలో తమకు సహకరించిన పార్టీలు .. తమతో కలిసి వచ్చిన పార్టీలను కూడా తనలో కలిపేసుకుంటుంది.
ఇది.. గతంలో కంటే.. ఇటీవల 10 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అనుసరిస్తున్న విధానమని చెప్పాలి. ఏపీ విషయానికి వస్తే.. తొలుత కర్నూలు, అనంతపురంపై దృష్టి పెట్టిన బీజేపీ అక్కడ పాగా వేసేందుకు పరిస్థితులు అనుకూలించకపోవడంతో కోస్తా వైపు వికసించాలని ప్రయత్నించింది. అయితే.. పొత్తులో ఉంటే ఒకరకంగా.. ఒంటరి పోరులో మరో విధంగా బీజేపీ రాజకీయాలు కనిపిస్తాయి. దీంతో ఆ పార్టీ పరిస్థితి డోలాయమానంలో పడింది.
అయితే.. నెమ్మదినెమ్మదిగా ఉత్తరాంధ్రపై పట్టు పెంచుకునే ప్రయత్నం చేసిన బీజేపీ.. ఇప్పుడు పట్టు విషయంలో తన పంతం నెగ్గించుకున్నట్టే ఉంది. గతంలో విశాఖ ఎంపీ స్తానం నుంచి బీజేపీ విజయం దక్కించుకుంది. తాజాగా గత ఏడాది జరిగిన ఎన్నికల్లో అనకాపల్లి నుంచి విజయం సాధించింది. మొత్తం గా.. ఉత్తరాంధ్రపై ప్రత్యేకంగానే దృష్టి పెట్టారు. ఇక, ఇప్పుడు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం దక్కిం చుకున్న పీఆర్ టీయూ ద్వారా మరింతగా బలపడిందన్న వాదన వినిపిస్తున్నారు కమల నాథులు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్ టీయూకు బీజేపీ మాతృ సంస్థ.. ఆర్ ఎస్ ఎస్ అనుబంధ విభాగం `ఆపస్` ఉపాధ్యాయ సంఘం మద్దతు తెలిపింది. దీంతో అనివార్యంగా.. ఇక్కడి బీజేపీ నాయకులు పీఆర్ టీయూకు సపోర్టు చేయాల్సి వచ్చింది. ఇది.. గాదె శ్రీనివాసుల నాయుడు విజయానికి దారితీసింది. దీనిని వారు క్లెయిమ్ చేసుకోవడం తప్పులేదు. ఇదిలావుంటే.. ఈ విషయాన్ని పైపైకి చూడడం కాదు.. ఒకింత లోతుగా చూస్తే.. బీజేపీ విస్తరిస్తున్న సంకేతాలు వస్తున్నాయి. అంటే.. అరబ్బు ఒంటె మాదిరిగా.. ఉత్తరాంధ్రలో కమల వికాసం జరిగినా ఆశ్చర్యం లేదని అంటున్నారు పరిశీలకులు.