కాషాయ భారతం : ప్రత్యర్ధులకు సింగిల్ డిజిట్ స్టేట్స్ !
దాంతో వరసబెట్టి రాష్ట్రాలు ఒక్కోటిగా వచ్చి బీజేపీ ఒడిలో పడుతున్నాయి.
By: Tupaki Desk | 8 Feb 2025 11:30 PM GMTదేశంలో 1980 దాకా కాంగ్రెస్ ఏకచత్రాధిపత్యం సాగింది. కాంగ్రెస్ పార్టీనే కేంద్రంలోనూ దేశంలోని దాదాపుగా అన్ని రాష్ట్రాలలోనూ అధికారంలో ఉండేది. అయితే ఏనాడూ కాంగ్రెస్ డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకోలేదు. కానీ కాంగ్రెస్ కి నాడు సామాజిక రాజకీయ పరిస్థితులు పూర్తిగా సహకరించాయి. ఇపుడు బీజేపీకి అవే పరిస్థితులు సహకరిస్తునాయి. దాంతో వరసబెట్టి రాష్ట్రాలు ఒక్కోటిగా వచ్చి బీజేపీ ఒడిలో పడుతున్నాయి.
దేశంలో ఈ రోజుకు 28 రాష్ట్రాలు ఉంటే అందులో ఇరవై దాకా బీజేపీ దాని మిత్రులవి ఉన్నాయంటే కాషాయ భారతం అని వేరేగా చెప్పాల్సినది లేదు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. అలాగే ఉత్తరాదితో పాటు పశ్చిమ మధ్య భారతంలోనూ అనేక రాష్ట్రాలలో అధికారంలో ఉంది. ఈశాన్య రాష్ట్రాలలో తన హవా చాటుకుంది. దక్షిణాదిన చూస్తే ఏపీలో కూటమి ప్రభుత్వం లో భాగంగా ఉంది. తెలంగాణాలో బలమైన ప్రతిపక్షంగా ఉంది.
కర్ణాటకలో ఒకసారి అధికారం చేపట్టి మరో చాన్స్ కోసం చూస్తోంది. అలా చూస్తే కనుక కేరళ తమిళనాడులలో బీజేపీ జెండా పాతాల్సి ఉంది. ఇక విపక్షాల విషయానికి వస్తే కాంగ్రెస్ హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణాలలో అధికారంలో ఉంటే కేరళలో వామపక్షాలు ఉన్నాయి. తమిళనాడులో డీఎంకే, పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ పంజాబ్ లో ఆప్ అధికారంలో ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్ పవర్ లో ఉంది.
అంటే ఎనిమిది రాష్ట్రాలే ప్రత్యర్థి పార్టీల చేతులలో ఉన్నాయి. మిగిలిన వాటిలో బీజేపీ దాని మిత్రులే ఉన్నారు. ఇక మరో వైపు చూస్తే ఈ ఎనిమిదిలో కూడా పశ్చిమ బెంగాల్, తెలంగాణా, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ లను బీజేపీ ఖాతాలో వేయడానికి మరింతగా బీజేపీ ప్రయత్నం చేస్తుంది అన్నది తెలిసిందే. అపుడు మిగిలిన ఆ నాలుగు రాష్ట్రాలలో కూడా తన పట్టుని సాధించేందుకు దృష్టి పెడుతుంది అని చెప్పాలి.
బీజేపీ దూకుడు చూస్తూంటే మరో పంచ వర్ష ప్రణాళికలోగా దేశం మొత్తం కాషాయం చేయడానికి పూర్తి బ్లూ ప్రింట్ ని రెడీ చేసి ఉంటుందని అంటున్నారు. బీజేపీ ఇంతలా విస్తరించడానికి ఆ పార్టీ బలంతో పాటు వ్యూహాలు కసి పట్టుదల అన్నీ పనిచేస్తూంటే విపక్ష శిబిరంలో అనైక్యత కూడా కలసి వస్తోంది. ఒకనాడు కాంగ్రేసేతర ఫ్రంట్ లను కట్టడానికి ఎంతో ప్రయాస పడి చివరికి కాంగ్రెస్ కే అధికారం అప్పగించిన సందర్భాలు అందరికీ తెలుసు.
ఇపుడు కూడా అదే పరిస్థితి ఉంది. బీజేపీయేత పార్టీలు అన్నీ ఒకే గూడు కిందకు రావాలి. ఆధిపత్యం మరచి అంతా బీజేపీ మీద పోరాడాలి. అయితే అది సాధ్యపడదు అన్నది తెలిసిందే. దాంతోనే బీజేపీ పంట పండుతోంది. బీజేపీ కూడా ఈ విధంగా అందివచ్చిన అవకాశాన్ని పూర్తి స్థాయిలో వాడుకుంటోది అని చెప్పాలి.
బీజేపీ టార్గెట్ చాలా సదూరంలో ఉంది. 2047 నాటికి ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్ళు నిండుతాయి. ఆ సమయానికి కేంద్రంలో అధికారంలో ఉండాలి. అందుకే బీజేపీ ఇప్పటి నుంచే తన పునాదులను గట్టి పరచుకుంటోంది. దేశమంతా అనేక రాష్ట్రాలలో విస్తరించుకుంటే రేపటి రోజున ఒక చోట వ్యతిరేకత వచ్చినా ఆ లోటుని మరో చోట పూడ్చుకుంటూ కేంద్రంలో నిరాటంకంగా అధికారంలో కొనసాగవచ్చు అన్నదే బీజేపీ ఆలోచనగా చూడాలి. గతంలో కాంగ్రెస్ కూడా ఆ విధంగానే రాజకీయంగా లాభపడుతూ వచ్చింది.
ఫార్ములా అదే. దానిని మరింత పదును పెట్టడానికి బీజేపీ తనదైన వ్యూహాలను కూడా సిద్ధం చేసి వదులుతోంది. ఇక బీజేపీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ దేశమంతా లేదు, ప్రాంతీయ పార్టీలకు పరిమితులు ఉంటాయి. ఇదే ఈ రోజున బీజేపీని అంతకంతకు బలోపేతం చేస్తోంది.
ఇక బీజేపీ 2047కి కూడా అధికారంలో ఉండాలనుకోవడంలో ఒక లెక్క ఉంది. దేశ స్వాతంత్ర్యం 1947లో వచ్చినప్పుడు కాంగ్రెస్ పవర్ ఫుల్ గా ఉంది. స్వర్ణోత్సవ వేళ కాంగ్రెస్ బీజేపీ రెండూ దేశంలో అధికారంలో లేవు. యునైటెడ్ ఫ్రంట్ కేంద్రంలో ఉంది. ఇక 75 ఏళ్ళ పండుగకు బీజేపీ కేంద్రంలో అధికారం చలాయిస్తోంది. దాంతో వికసిత్ భారత్ నినాదంతో 2047 నాటికి తామే ఉండాలని కోరుకుంటోంది. అది దేశానికి ఒక చారిత్రక సందర్భం. పైగా ఆనాటికి దేశం రూపురేఖలు సరికొత్తగా మార్చాలన్నదే బీజేపీ ఆలోచన.