'ఢిల్లీ'ని గెలవగానే సంబరం కాదు.. పాలన బీజేపీకి పెను సవాలే
కరిష్మా ఉన్న సుష్మా సర్వాజ్ ను సీఎం చేసినా పార్టీ 1998 ఎన్నికల్లో ఓడిపోయింది. దీంతో మళ్లీ గెలిచేందుకు 27 ఏళ్లు ఆగాల్సి వచ్చింది.
By: Tupaki Desk | 9 Feb 2025 10:01 AM GMT27 ఏళ్ల తర్వాత దేశ రాజధాని ఢిల్లీని గెలుచుకున్న బీజేపీ ఇప్పుడు పట్టరాని ఆనందంతో ఉంది. బహుశా పెద్ద రాష్ట్రమైన మహారాష్ట్ర, ఢిల్లీ పొరుగునే ఉండే హరియాణాల కంటే ఈ గెలుపు వారికి బాగా కిక్ ఇచ్చిందేమో..?
దేశాన్ని ఏలుతున్నప్పటికీ.. ఒక పెద్ద కార్పొరేషన్ సైజ్ ఉండే ఢిల్లీని పదేళ్లుగా గెలుచులేకపోవడం కాషాయ పార్టీకి ఇన్నాళ్లూ తలవంపులుగా ఉంది. ఇప్పుడది నెరవేరింది. అయితే, ‘ఢిల్లీ’ని గెలవగానే సంబరం కాదు.. పాలనలో బీజేపీకి సవాళ్లు తప్పవనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
1998.. ఢిల్లీలో బీజేపీ అధికారాన్ని కోల్పోయిన సంవత్సరం. రాష్ట్ర హోదా పునరుద్ధరణ తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లోనే గెలిచిన బీజేపీ పాలనలో మాత్ర తీవ్రంగా విఫలమైంది. ఢిల్లో బీజేపీకి పునాదులు వేసిన సీనియర్ నేత మదన్ లాల్ ఖురానా అవినీతి ఆరోపణల్లో చిక్కుకోవడంతో తప్పించాల్సి వచ్చింది. దీంతో ఆయన రెబల్ నాయకుడిగా మారారు.
ఉల్లి గడ్డల ఘాటుతో..
ఖురానా స్థానంలో సాహెబ్ సింగ్ వర్మను సీఎం చేసినా.. ఈయన కూడా ఫెయిల్ అయ్యారు. 1998లో ఉల్లి గడ్డల ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ ప్రభావం దేశవ్యాప్తంగా ఉన్నా.. ఢిల్లీలో మరీ తీవ్రంగా కనిపించింది. ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తం కావడంతో సాహెబ్ సింగ్ ను తప్పించారు. అప్పటికే బీజేపీ ప్రతిష్ఠ పడిపోయింది. కరిష్మా ఉన్న సుష్మా సర్వాజ్ ను సీఎం చేసినా పార్టీ 1998 ఎన్నికల్లో ఓడిపోయింది. దీంతో మళ్లీ గెలిచేందుకు 27 ఏళ్లు ఆగాల్సి వచ్చింది.
ఆప్ తో పోల్చి చూస్తూ..
ఢిల్లీలో బీజేపీ కొత్త ప్రభుత్వానికి సవాళ్లు తప్పవు. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షంగా ఓవైపు ఆప్ పక్కలో బల్లెం. మరోవైపు ఏం జరిగినా నిలదీసే విద్యావంతులు, చైతన్యవంతులైన ప్రజలు. డబుల్ ఇంజిన్ సర్కారు ఏమాత్రం గాడితప్పినా వీరు సహించరు.
ఇప్పుడు నయా ఢిల్లీని నిర్మిస్తాం అంటూ సాక్షాత్తు ప్రధాని మోదీనే చెబుతున్నారు. కానీ, అసలు ఇన్నాళ్లూ కేంద్ర ప్రభుత్వ పాలనా కేంద్రమైన ఢిల్లీని ఎందుకు డెవలప్ చేయలేదు? అనేది ప్రాథమిక ప్రశ్న. దీనికి సమాధానం ఐదేళ్ల తర్వాత తెలుస్తుంది.