ఢిల్లీ విజయంపై బాబు, పవన్ రియాక్షన్ ఇదే!
ఆయన ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో బీజేపీ గెలుపు గుర్రం ఎక్కింది.
By: Tupaki Desk | 8 Feb 2025 5:56 PM GMTదేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం దక్కించుకుంది. సుమారు 27 సంవత్సరాల తర్వాత.. గెలుగు గుర్రం ఎక్కింది. పక్కా వ్యూహం.. సమష్టి కృషి.. కట్టుతప్పని ఐక్యత ఇతమిత్తంగా బీజేపీ అనుసరించిన వ్యూహాలు. ఇక, ఉచితాలు మరో మెట్టు! ఈ విజయంలో ఎన్డీయే కూటమి భాగస్వామిగా టీడీపీకి కూడా భాగం ఉంది. సీఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటించి.. తెలుగువారు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. బీజేపీని గెలిపించాల్సిన ఆవశ్యకతను ఆయన వివరించారు. ఆయన ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో బీజేపీ గెలుపు గుర్రం ఎక్కింది.
ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు తాజాగా మీడియాతో మాట్లాడారు. బీజేపీ విజయం.. మోడీ విజయం అంటూ.. ఆయన వ్యాఖ్యానించారు. మోడీ విజన్, వికసిత భారత్ లక్ష్యాలకు.. ఢిల్లీ ప్రజలు ఆమోదముద్ర వేశారని పేర్కొన్నారు. ప్రధాని మోడీపై ఉన్న నమ్మకంతోనే ఢిల్లీ వాసులు ఆయనకు అధికారం కట్టబెట్టారని తెలిపారు. సరైన సమయంలో సరైన నాయకుడు ఈ దేశానికి ఉన్నాడని.. అదేవిధంగా సరైన సమయంలో ఢిల్లీ ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని సంతోషం వ్యక్తం చేశారు. దేశంలోని ప్రజలందరి ఆత్మగౌరవానికి ఈ విజయం ప్రతీకని అభివర్ణించారు.
ఏపీలో ఎన్నికల గురించి కూడా ప్రస్తావించిన చంద్రబాబు.. ఏపీలో ప్రజలు ఇచ్చిన తీర్పు మాదిరిగానే ఢిల్లీ ప్రజలు కూడా తీర్పు చెప్పారని అన్నారు. అవినీతి, అక్రమాలు, భవంతుల రాజకీయాలను ప్రజలు ఇక్కడ తిరస్కరించారని.. అదేవిధంగా ఢీల్లీ ప్రజలు కూడా అవినీతి, అక్రమాలను సహించలేదన్నారు. ఏపీ, ఢిల్లీలో గత ప్రభుత్వాలు అమలు చేసిన విధానాలను ప్రజలు తిరస్కరిం చారని.. అభివృద్ధికే మొగ్గు చూపించారని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గత ప్రభుత్వాలు పనిచేయలేదని చెప్పారు. రెండు రాష్ట్రాల ప్రజలు తమ తప్పులు తెలుసుకుని.. ఎన్నికల రూపంలో సరిదిద్దుకున్నారని చంద్రబాబు తెలిపారు. గెలిచిన అభ్యర్థులకు అభినందనలు తెలిపారు.
పవన్ స్పందన ఇదీ..
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. ఢిల్లీ విజయాన్ని మోడీ విజయంగా పేర్కొన్నారు. వికసిత భారత్ లక్ష్యానికి అనుగు ణంగా మోడీ వెంటే తామున్నామని ఢిల్లీ ప్రజలు నిరూపించారని తెలిపారు. విజన్-2047 లక్ష్యాల సాధనకు ఇది మరింత దన్నుగా నిలుస్తుందని చెప్పారు. డబుల్ ఇంజన్ సర్కారుతో ఢిల్లీ అభివృద్ధి వేగంగా జరుగుతుందని తెలిపారు. ఇది ఢిల్లీ ప్రజల విజ్ఞత, విజన్‌కు ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఇదే సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాపైనా పవన్ అభినందనలు కురిపించారు. ఆయన కృషి, చాతుర్యం ఢిల్లీ ఎన్నికల్లో ఫలించిందని పేర్కొన్నారు.