కామ్రెడ్స్ వర్సెస్ కమలం : ఏపీలో పొత్తు సీన్ చేంజ్....?
ఏపీలో బీజేపీ వర్సెస్ కామ్రెడ్స్ గా రాజకీయం మారుతోంది. ప్రధాన పార్టీల పాలిటిక్స్ ఎలా ఉన్నా కూడా ఈ రెండు పార్టీల నుంచే ఏపీలో టోటల్ సీన్ మారనుంది అంటున్నారు.
By: Tupaki Desk | 1 Oct 2023 11:30 PM GMTఏపీలో బీజేపీ వర్సెస్ కామ్రెడ్స్ గా రాజకీయం మారుతోంది. ప్రధాన పార్టీల పాలిటిక్స్ ఎలా ఉన్నా కూడా ఈ రెండు పార్టీల నుంచే ఏపీలో టోటల్ సీన్ మారనుంది అంటున్నారు. ఏపీలో బీజేపీని వదిలేసి తమ వైపు రావాలని ఉభయ వామపక్షాలు కోరుతున్నాయి. ఏపీకి బీజేపీ తీరని అన్యాయం చేసింది కాబట్టి ఆ పార్టీతో జట్టు కట్టరాదని గట్టిగా టీడీపీ జనసేనలకు కామ్రెడ్స్ చెవిలో ఇల్లు కట్టుకుని పోరుతున్నాయి.
ఇక ఏపీలో చంద్రబాబు అరెస్ట్ విషయంలో కేంద్రంలోని బీజేపీ పాత్ర ఉందని కామ్రేడ్స్ ఆరోపిస్తున్నాయి. వారు డే వన్ నుంచి ఇదే మాట అంటున్నారు. అయితే తమ పాత్ర లేదని బీజేపీ నేతలు చెబుతూ వచ్చారు. ఏపీ సీఐడీ రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీ అని దగ్గుబాటి పురంధేశ్వరి కూడా విడమరచి చెప్పారు.
అయితే ఏపీలో బీజేపీతో జనసేన పొత్తు ఉంది. అదే జనసేన టీడీపీతో పొత్తుని ప్రకటించి ఉంది. దాంతో ఈ మూడు పార్టీలు కలుస్తాయా అన్న చర్చ ఒక వైపు ఉంటే అసలు కలవరాదు అన్నది కామ్రేడ్స్ పంతం రాజకీయ ఎత్తుగడగా ఉన్నాయి. అందుకే పదే పదే చంద్రబాబు కేసులో బీజేపీ పాత్ర ఉందంటూ ఆరోపిస్తున్నాయి.
ఈ విధంగా జరుగుతున్న ప్రచారం వల్ల టీడీపీ జనసేన బీజేపీ నుంచి ఏదో నాటికి విడిపోయి బయటకు వస్తాయని, ఆ మీదట ఆ రెండు పార్టీలతో కలసి ఎన్నికల్లో పోటీ చేయవచ్చు, ఆ కూటమిలో చేరవచ్చు అన్నది కామ్రేడ్స్ ఎత్తుగడ. ఇలా తరచూ చేస్తున్న ప్రచారం సహజంగానే బీజేపీకి చిర్రెత్తుకొచ్చేలా ఉంది.
దాంతో బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు సీపీఐని పట్టుకుని దిక్కుమాలిన పార్టీ అని విమర్శించారు. ఆ పార్టీ రాజకీయ కుట్రలో భాగంగానే ఇలాంటి ఆరోపణలు చేస్తోంది అని మండిపడ్డారు. సీపీఐ నేతలు రాజకీయ మనుగడ కోసం ఎంతకైనా దిగజారుతాయని ఘాటైన కామెంట్స్ చేశారు.
దీనికి మండిపడిన కాంగ్రెడ్ సీపీఐ రామక్రిష్ణ బీజేపీని గట్టిగానే తగులుకున్నారు. జనసేనతో ఎందుకు మీకు పొత్తు, ఆ పార్టీని వదిలేసి సొంతంగా ఏపీలో పోటీ చేసే సత్తా మీకు ఉందా అని నిలదీశారు. ఆ విధంగా చేస్తే మీకు నోటా కంటే తక్కువ ఓట్లు మాత్రమే వస్తాయని కూడా జోస్యం చెప్పారు. బీజేపీ ఏపీకి ఏమీ చేసింది లేదని అన్నారు.
మొత్తానికి చూస్తే ఏపీలో పొత్తులను చేంజ్ చేయడానికి బీజేపీ కామ్రేడ్స్ మధ్య కొత్త కయ్యం మొదలైంది అంటున్నారు. బీజేపీని టీడీపీ జనసేనల నుంచి వేరు చేయాలని కామ్రేడ్స్ చూస్తున్నారు ఇది కుట్ర అని బీజేపీ అంటూంటే బీజేపీతో ఎవరు జత కడతారు, ఎందుకు కట్టాలి అంటూ కామ్రేడ్స్ కౌంటర్ ఇస్తున్నారు.
మొత్తానికి చూస్తే ఈ రెండు పార్టీల కొత్త తగవు కాదు కానీ టీడీపీ జనసేనల మీద ఈ ప్రభావం ఎంతవరకూ ఉంటుంది అన్నది చూడాలని అంటున్నారు. టీడీపీ అధినేత అరెస్ట్ కి కేంద్రంలోని బీజేపీ కారణం అని నమ్మితే మాత్రం అర నిముషం కూడా ఆలస్యం లేకుండా టీడీపీ బీజేపీ స్నేహం కోరకుండా వెనక్కి తప్పుకుంటుంది అని అంటున్నారు. అలాగే జనసేన కూడా మిత్ర బంధం తెంచుకుంటుంది అని అంటున్నారు. మొత్తానికి పొత్తు గేమ్ చేంజర్ గా ఈ కయ్యం ఉందా అంటే అవును అనే అంటున్నారు.