బీఆర్ఎస్ లెక్కలోనే లేదు.. బీజేపీనే టార్గెట్
తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఒకప్పుడు ఇక్కడ చక్రం తిప్పిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు పూర్తిగా వెనుకబడుతోంది.
By: Tupaki Desk | 15 April 2024 11:30 AM GMTతెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఒకప్పుడు ఇక్కడ చక్రం తిప్పిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు పూర్తిగా వెనుకబడుతోంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆధిపత్యాన్ని కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు తెలంగాణలో మరింతగా పుంజుకోవాలని బీజేపీ చూస్తోంది. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్యే ప్రధాన పోటీ అని విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ బీఆర్ఎస్ లెక్కలోనే లేదని, బీజేపీనే టార్గెట్ చేసి ప్రచారంలో దూసుకెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది. తెలంగాణలో ఎక్కువ లోక్‌సభ స్థానాలు గెలిచేందుకు ప్రధాన అడ్డంకిగా బీజేపీనే ఉందని కాంగ్రెస్ అనుకుంటోంది.
2019 లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ 9, బీజేపీ 4, కాంగ్రెస్ 3 స్థానాల్లో గెలిచింది. హైదరాబాద్‌లో ఎంఐఎం విజయం సాధించింది. అప్పుడు తెలంగాణలో అధికారంలో ఉండి కూడా 9 స్థానాలే సాధించడం బీఆర్ఎస్‌కు షాక్ అనే చెప్పాలి. కరీంనగర్, నిజామాబాద్, సికింద్రాబాద్, ఆదిలాబాద్‌లో అప్పుడు బీజేపీ విజయఢంకా మోగించింది. ఇప్పుడు ఈ సిటింగ్ స్థానాలను నిలబెట్టుకోవడంతో పాటు మిగతా చోట్ల కూడా కాషాయ జెండా ఎగరేయాలని బీజేపీ చూస్తోంది. మరోవైపు గత ఎన్నికల్లో మల్కాజిగిరి, నల్గొండ, భువనగిరిలో మాత్రమే గెలిచిన కాంగ్రెస్ ఈ సారి 15 స్థానాలపై కన్నేసింది.
తెలంగాణలో అధికారంలో ఉండటం కాంగ్రెస్‌కు కలిసొచ్చే అంశం. అయినా లోక్‌సభ ఎన్నికల్లో పరిస్థితి విభిన్నంగానే ఉంటుంది. కేంద్రంలో వరుసగా రెండు సార్లు గెలిచిన బీజేపీ.. హ్యాట్రిక్‌పై కన్నేసింది. మోడీనే తమ గ్యారెంటీ అని ప్రచారం చేస్తోంది. మరోవైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, కీలక నేతలు పార్టీ మారడంతో ఢీలా పడ్డ బీఆర్ఎస్ అస్థిత్వం కాపాడుకోవడం కోసం పోరాడుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీ మారింది. కేంద్రంలో బీజేపీని గద్దె దించాలనే లక్ష్యంతో సాగుతున్న కాంగ్రెస్.. తెలంగాణలోనూ ఆ పార్టీని దెబ్బకొట్టాలని చూస్తోంది. అందుకే మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఇక్కడి నేతలకు సూచించింది. అలాగే తమ గ్యారెంటీలను ప్రజలకు మరింత చేరువ చేయాలని కూడా మార్గనిర్దేశం చేసింది.