టీడీపీ హైరానా..బీజేపీ జనసేన సైలెంట్...!?
టీడీపీ కూటమిలో చిచ్చు రేగుతోందా. అది కూడా వాలంటీర్ల వ్యవహారం మీదనేనా అన్న చర్చ సాగుతోంది.
By: Tupaki Desk | 2 April 2024 3:50 AM GMTటీడీపీ కూటమిలో చిచ్చు రేగుతోందా. అది కూడా వాలంటీర్ల వ్యవహారం మీదనేనా అన్న చర్చ సాగుతోంది. నిజానికి చూస్తే ఏపీలో మొదటి నుంచి వాలంటీర్ల మీద నానా యాగీ చేస్తూ వస్తోంది టీడీపీ మాత్రమే. ఆ తరువాత జనసేన కూడా కొంతకాలం వంతపడింది. బీజేపీ అయితే పెద్దగా దీని మీద వ్యతిరేక గళం వినిపించినది లేదు.
ఇపుడు చూస్తే ఎన్నికలు ముంగిటకు వచ్చేశాయి. ఈ కీలక సమయంలో వాలంటీర్లతో వారి వెనక ఉన్న అతి పెద్ద లబ్దిదారులతో పెట్టుకుంటే లాభమా నష్టమా అన్నది ఏ మాత్రం ఆలోచించకుండా టీడీపీ తెర వెనక ప్రయత్నాలు చేసి వాలంటీర్లను సేవలను దూరం పెట్టేసింది అన్నది ఒక ప్రధాన ఆరోపణ.
దీంతోనే ఇపుడు జనసేన బీజేపీ కూడా మౌనం దాల్చాయని అంటున్నారు. ఈ వాలంటీర్ల ఇష్యూ ఏ రాజకీయ ఉప ద్రవానికి దారి తీస్తుందో అన్న ఆలోచనలు భయాలు మిత్రపక్షాల లో ఉన్నాయని అంటున్నారు. తెలుగుదేశం గడచిన రెండు రోజులుగా దీని మీద కిందా మీదా అవుతూంటే వత్తాసుగా అయినా బీజేపీ జనసేనల నుంచి ప్రకటనలు రావడం లేదు.
దానికి కారణం ఏంటి అంటే వాలంటీర్ల వ్యవస్థ మంచిదా చెడ్డదా అన్నది పక్కన పెడితే దానితో ముడిపడి ఉన్న పేదల జీవితాలు వయో వృద్ధుల ప్రయోజనాలు. అందుకే ఇది చాలా సున్నితమైన అంశంగా మారుతోంది. దాని వల్లనే మిత్రులుగా ఉన్న వారు సైతం ఏదీ మాట్లాడలేకపోతున్నారు అని అంటున్నారు.
కోరి మరీ కొరివిని కూటమికి తగిలించడంతో టీడీపీ చేసిన ప్రయత్నంగా ఉంది ఉందా అన్న చర్చ కూడా సాగుతోందిట. టీడీపీ ఈ విషయంల హైరానా పడుతోంది. నిన్నటిదాకా జగన్ ఏ ఉద్యోగం ఇచ్చాడు అని సభలలో విమర్శలు చేసిన చంద్రబాబు ఇపుడు లక్షా ముప్పయి అయిదు వేల సచివాలయ ఉద్యోగులు ఉన్నారు కదా అంటున్నారు. వారి చేత పెన్షన్ పంపిణీ చేయించవచ్చు కదా అని అంటున్నారు.
అంటే దీనిని కవర్ చేసుకునే క్రమంలో అసలు నిజాలు చెబుతున్నారు అని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఏది ఏమైతేనేమి ఏపీలో ఇపుడు అతి పెద్ద వర్గానికి కూటమిని దూరం చేయడంలో టీడీపీ శల్య పాత్రని పోషించింది అన్నది కూడా మిత్రులలో కలుగుతున్న భావంగా ఉందిట.
మొత్తం మీద ఈ వ్యవహారం అయితే చిచ్చు రేపుతోంది. ఇది ఆరని మంటగా మారుతోంది. దీంతో మిత్రులు కూడా సైలెంట్ నే శరణ్యం అనుకుంటున్నారు. ఇక చంద్రబాబు టీడీపీ ఈ నష్ట నివారణలో ఎంత మేరకు సక్సెస్ అవుతారు అన్నది అందరితో పాటు మిత్రులు కూడా చోద్యంగానే చూస్తున్నారు అని అంటున్నారు.