Begin typing your search above and press return to search.

బాబుకు బీజేపీకి అడ్డంగా జగన్ ...కాషాయం లెక్క తేలనుందా...?

లేకపోతే దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో రెండు ప్రధాన పార్టీలకు చుట్టాలు అధ్యక్షులుగా ఉన్నారు అంటున్నారు.

By:  Tupaki Desk   |   2 Sep 2023 1:30 AM GMT
బాబుకు బీజేపీకి అడ్డంగా జగన్ ...కాషాయం లెక్క తేలనుందా...?
X

ఏపీకి సంబంధించినంతవరకూ బీజెపీ డబుల్ గేమ్ ఆడుతోంది. లోక్ సభ రాజ్యసభలలో బలం ఉన్న వైసీపీ ఎంపీల మద్దతుని కీలక బిల్లుల ఆమోదం కోసం పొందుతున్న బీజేపీ మరో వైపు తన భవిష్యత్తు రాజకీయాల కోసం తెలుగుదేశాన్ని దువ్వుతోంది అన్న అనుమానాలు ఉన్నాయి. లేకపోతే దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో రెండు ప్రధాన పార్టీలకు చుట్టాలు అధ్యక్షులుగా ఉన్నారు అంటున్నారు.

పైగా ఈ రెండు పార్టీలు పొత్తులకు సిద్ధపడాలని అనుకుంటున్న వేళ ఈ పరిణామం జరిగింది. టీడీపీకి చంద్రబాబు ప్రెసిడెంట్ అయితే ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా ఆయన వదిన గారు అయిన దగ్గుబాటి పురంధేశ్వరిని నియమించారు. ఈ నియామకం సాధారణం అని అనుకున్నా ఏపీలో ఇపుడున్న పొత్తులు ఎత్తులు రాజకీయ జిత్తులలో దీనిని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం అయితే ఉంది అంటున్నారు.

మరో వైపు చూస్తే 2014 పొత్తులను రిపీట్ చేయాలని టీడీపీ జనసేనలకు ఉంది అని అంటున్నారు. ఇక ఏపీ బీజేపీ నేతలు దీనికి సుముఖంగా ఉన్నారని ప్రచారం అయితే సాగుతోంది. మరి కేంద్ర బీజేపీ పెద్దలే దీనికి అనుమతి ఇవ్వాల్సి ఉంది. కానీ కేంద్ర బీజేపీకి పార్లమెంట్ అవసరాలు వైసీపీతో ఉన్నాయి. అందుకే ఇప్పటికిప్పుడు ఏ విషయం తేల్చకుండా ఉందని అంటున్నారు.

ఈ నేపధ్యంలో వైసీపీ కూడా ఈ బంధాలు అనుబంధాల సంగతేంటి అన్నది చూస్తోంది. ఆలోచిస్తోంది. ఈ క్రమంలో ఇటీవల ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు బీజేపీ జాతీయ ప్రెసిడెట్ జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. అదే సమావేశంలో ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ ఉన్నారు. ఆమె స్వయంగా జోక్యం చేసుకుని ఈ భేటీ జరిగేలా చూశారని అంటున్నారు.

దీంతో వైసీపీ బీజేపీ వైఖరి పైన సందేహాలు వ్యక్తం చేస్తోంది. ఈ నేపధ్యంలో వైసీపీకి ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. అదేంటి అంటే ఈ నెల 18 నుంచి 22 వరకూ అయిదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలలో కీలకమైన బిల్లులను ఆమోదిస్తారు. అయితే ఈ సమావేశాలలో జమిలి ఎన్నికలకు సంబంధించి బిల్లుతో పాటు ఉమ్మడి పౌర స్మృతి అలాగే మహిళా బిల్లును కూడా ఆమోదిస్తారు అంటున్నారు.

ఈ బిల్లుల ఆమోదానికి బీజేపీకి బలం లేదు.జమిలి ఎన్నికలు అంటే రాజ్యాంగ సవరణ జరగాలి. అక్కడ మొత్తం 543 లోక్ సభ ఎంపీలలో 67 శాతం మంది మద్దతు కావాలి. అలాగే రాజ్యసభలో 245 సభ్యులలో 67 శాతం మంది మద్దతు కావాలి. దీంతో బీజేపీకి లోక్ సభలో 333 సీట్లతో 61 శాతం మద్దతు ఉంది. మరో 5 శాతం ఓటింగ్ అవసరం అయితే కచ్చితంగా పడుతోంది. ఇక లొక్ సభలో వైసీపీకి 22 మంది సభ్యులు ఉన్నారు. ఈ మద్దతు చాలా అవసరం. రాజ్యసభలో వైసీపీకి తొమ్మిది మంది సభ్యులు ఉన్నారు. వారి అవసరం కూడా ఉంది.

దాంతో ఇపుడు బీజేపీ అధినాయకత్వం ముందు వైసీపీ కచ్చితంగా బెట్టు చేసి పట్టు బిగించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. బీజేపీకి అవసరం పడిన ప్రతీసారీ వైసీపీ మద్దతు ఇస్తూ పోతోంది. బీజేపీ ఏపీలో టీడీపీతో సఖ్యతగా ఉంటోంది అని డౌట్లు ఉన్నాయి. ఆ విషయం తేల్చుకుని కానీ కీలక బిల్లుల విషయంలో మద్దతు ఇచ్చేందుకు ముందుకు అడుగు వేయకూడదు అని వైసీపీ గట్టిగా డిసైడ్ అయింది అని అంటున్నారు. అదే కనుక జరిగితే మాత్రం బీజేపీ బిగ్ ట్రబుల్స్ లో పడినట్లే.

పైగా ఏపీలో డబుల్ గేమ్ కి చెక్ పడుతుంది. తాను ఎటు వైపో కచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. మొత్తానికి బీజేపీకి బాబుకు మధ్యలో జగన్ అడ్డుగా నిలిచేందుకు అరుదైన అవకాశం లభిస్తోంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.