తెలంగాణపైకి తమిళిసైని ఎక్కుపెట్టిన బీజేపీ
ఈ నేపథ్యంలోనే మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను తెలంగాణ ఎన్నికల ప్రచారంలో వాడుకోవాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తున్నది.
By: Tupaki Desk | 24 April 2024 4:55 AM GMT400 లోక్ సభ స్థానాలు లక్ష్యంగా ‘అబ్ కీ బార్ .. చార్ సౌ పార్’ నినాదంతో పార్లమెంట్ ఎన్నికల్లో ముందుకు సాగుతున్న బీజేపీ పార్టీ ఈ సారి ఎన్నికలలో దక్షిణాది నుండి గణనీయమైన స్థానాలు సాధించాలని ఆశిస్తున్నది. ఈ నేపథ్యంలోనే మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను తెలంగాణ ఎన్నికల ప్రచారంలో వాడుకోవాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తున్నది.
తెలంగాణ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో బీజేపీ ఎన్నికల సంఘానికి సమర్పించిన పేర్లలో తమిళిసై పేరుండడంతో ఈ విషయం వెల్లడయింది. తమిళిసైతో పాటు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైతో పాటు సినీ నటులు ఖుష్బూ, రాధిక, ఎంపీ తేజస్వీ సూర్య, ఎమ్మెల్యే రాజాసింగ్, సీఎం యోగీ ఆదిత్యానాథ్ తో పాటు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ లు ఈ జాబితాలో ఉన్నారు.
మొన్నటి వరకు తెలంగాణ గవర్నర్ గా ఉన్న తమిళిసై బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయాలను పక్కన పెట్టడం, తిరస్కరించడం చేసింది. ఎమ్మెల్సీలుగా బీఆర్ఎస్ పంపిన కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్ ల పేర్లను రాజకీయ నేతలంటూ తిరస్కరించి, కాంగ్రెస్ ప్రభుత్వం పంపిన ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్ ల పేర్లను ఆమోదించడం వివాదం రేపింది. ఈ విషయంలో బీఆర్ఎస్ కోర్టుకు వెళ్లగా తమిళిసై తీరును తప్పుపట్టి, కాంగ్రెస్ అభ్యర్థులను ఆమోదించడాన్ని తిరస్కరించింది.
రాజ్ భవన్ ను రాజకీయ భవన్ గా, బీజేపీ పార్టీ ఆఫీసుగా మార్చిందని బీఆర్ఎస్ విమర్శించింది. ఇటీవల తమిళిసై మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో నా ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆరోపించింది. గవర్నర్ పదవికి రాజీనామా చేసి ఇటీవల చెన్నై సౌత్ నుండి పోటీ చేసింది. అక్కడ మొదటి విడతలోనే పోలింగ్ ముగిసిన నేపథ్యంలో తెలంగాణలో బీఆర్ఎస్ మీద ఆమెను బీజేపీ ప్రయోగిస్తున్నట్లు తెలుస్తుంది.