Begin typing your search above and press return to search.

డిప్యూటీ స్పీకర్ విపక్షానికేనా ?

దాని కంటే ముందు వాజ్ పేయి ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్ పదవిని కాంగ్రెస్ కి ఇచ్చారు.

By:  Tupaki Desk   |   27 Jun 2024 3:28 AM GMT
డిప్యూటీ స్పీకర్ విపక్షానికేనా ?
X

స్పీకర్ పదవిని బీజేపీ పంతం పట్టి మరీ గెలుచుకుంది. ఎన్నిక దాకా వ్యవహారం నడచినా పెద్ద సంఖ్యలో ఇండియా కూటమి సభ్యులు ఉన్నా కూడా బీజేపీ ఎక్కడా తగ్గలేదు. స్పీకర్ కి మేము సపోర్ట్ చేస్తాం, డిప్యూటీ స్పీకర్ పదవి మాకు ఇవ్వండి అని కోరినా వినలేదు

ఓటింగ్ దాకా వ్యవహారం వెళ్ళింది. అదే సమయంలో బీజేపీ తన అస్త్రశస్త్రాలను అన్నింటినీ ప్రయోగించి మరీ గ్యారంటీగా గెలిచేలా చేసుకుంది. ఓం బిర్లాను రెండోసారి ఉచితాసనం మీద బీజేపీ కూర్చోబెట్టింది. దానితో స్పీకర్ కధ కొలిక్కి వచ్చింది.

ఇపుడు డిప్యూటీ స్పీకర్ పదవి అయినా తమకు ఇవ్వాలని మళ్ళీ విపక్ష శిబిరం నుంచి గట్టిగా వినిపిస్తోంది. ఇది సంప్రదాయం అని అంటోంది. యూపీయే వన్ టూ ప్రభుత్వాలు ఉన్నపుడు 2004 నుంచి 2009 మధ్యలో శిరోమణీ అకాలీదళ్ కి అలాగె 2009 నుంచి 2014 దాకా బీజేపీకి డిప్యూటీ స్పీకర్ ఇచ్చిన సందర్భం ఉంది.

దాని కంటే ముందు వాజ్ పేయి ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్ పదవిని కాంగ్రెస్ కి ఇచ్చారు. అంత దాకా ఎందుకు యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలోనూ డిప్యూటీ స్పీకర్ పదవిని బీజేపీ అందుకుంది. పీవీ నరసింహారావు ప్రభుత్వంలోనూ డిప్యూటీ స్పీకర్ పదవిని తీసుకుంది.

అయితే 2014 నుంచే వ్యవహారం మారింది. స్పీకర్ డిప్యూటీ స్పీకర్ రెండూ తమ పార్టీ వారికే అన్న దానిని బీజేపీ నమ్ముతోంది. ఇక 2019 నుంచి 2024 మధ్యలో డిప్యూటీ స్పీకర్ లేకుండానే సభ సాగింది. అలా జరగడం అదే తొలిసారి. ఈ మధ్యలో వైసీపీకి ఆ పదవి ఇస్తారని ప్రచారం సాగినా ఆ పార్టీ తీసుకోలేదని చెబుతారు.

ఏది ఏమైనా బలంగా ఉన్న ఇండియా కూటమి ఈసారి డిప్యూటీ స్పీకర్ పదవిని కోరుతోంది. పార్లమెంట్ లో స్పీకర్ రానపుడు డిప్యూటీ స్పీకర్ సభను నడిపిస్తారు. స్పీకర్ కి ఉన్న అధికారాలు అన్నీ డిప్యూటీ స్పీకర్ కి ఉంటాయి. దాంతోనే పట్టుబడుతున్నారు. పైగా న్యాయంగా ఉండాలి. బ్యాలెన్స్ గా ఉండాలి. పార్లమెంట్ లో అందరికీ సమాన అవకాశాలు అన్న భావనకు అద్దం పట్టేలా ఉండాలీ అంటే డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షానికి ఇవ్వడం సమంజసం అని అంటున్నారు.

అయితే బీజేపీ ఈ పదవిని తన మిత్రులకు ఇస్తుంది అని ప్రచారం సాగుతోంది. తెలుగుదేశం కానీ జేడీయూ కానీ ఈ పదవిని అందుకుంటాయని చెబుతున్నారు. డిప్యూటీ స్పీకర్ పదవిని వేరే పార్టీకి ఇచ్చామని చెప్పుకోవడానికే ఇలా చేస్తున్నారు అని విపక్ష ఇండియా కూటమి నిందించినా లాభం ఉండదేమో. ఏది ఏమైనా డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుందా అన్నది కూడా అంతా ఆలోచిస్తున్న విషయం.

అదిగో ఇదిగో అంటూ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక లేకుండానే ఈ టెర్మ్ ని కూడా బీజేపీ నడిపిస్తుందా అన్న డౌట్ ని కూడా వ్యక్తం చేస్తున్న వారు ఉన్నారు. ఏది ఏమైనా కూడా పార్లమెంటరీ సంప్రదాయాలను అంతా పాటిస్తే అనుసరిస్తే బాగుంటుంది అన్నదే ప్రజాస్వామ్య ప్రియుల భావన. అదే మేధావుల సూచన కూడా.